సేంద్రియ ఆపిల్‌ సాగుకు పచ్చజెండా!

Organic apple grown green!

సీసీఎంబీ పర్యవేక్షణలో ఫలప్రదమవుతున్న ఆపిల్‌ ప్రయోగాత్మక సాగు

తెలంగాణలోని కెరిమెరిలో సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం

అరకు సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు అనుకూలం..

మరో రెండేళ్లలో సాగు పద్ధతిని ప్రమాణీకరిస్తామంటున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు

సేంద్రియ ఆపిల్‌ సాగు ఆనందకరం..
సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యాన శాఖాధికారుల, వ్యవసాయాధికారుల సహాయంతోనే ఆపిల్‌ను సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేసిన పత్తిలో ఏటా నష్టాలు రావటంతో గడచిన ఏడేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను. సీసీఎంబీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ఈ విధానంలో ఎటువంటి ఇతర ఇబ్బందులు లేవు.

కాండం కుళ్లు, రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బెడద లేదు. ఎరువులు, పురుగు మందులు కొనే పనిలేకపోవటంతో ఖర్చు తగ్గింది. కష్టపడితే చాలు. ఒక వారం కషాయాలు పిచికారీ ఆలస్యమయినా మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వచ్చింది. అయితే, మాది మారుమూల ప్రాంతం కావడంతో ప్రకృతి సేద్యంలో పండించిన పంటలను మార్కెట్లో అధిక ధరకు అమ్ముకోవటం ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం సహకరించాలి.

కశ్మీర్‌ లోయలోనే కాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ప్రకృతి సేద్య విధానంలో ఆపిల్‌ పండ్లను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని నిరూపిస్తున్నారు సేంద్రియ రైతు కేంద్రే బాలాజీ.  కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి మండలం ధనోరా ఆయన స్వగ్రామం. ఐదెకరాల పొలంలో ఆపిల్‌తో పాటు అనేక ఏళ్లుగా మామిడి, బత్తాయి, దానిమ్మ, అరటి, బత్తాయి తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో బంతి, పసుపు, కొత్తమీరలను అంతర పంటలుగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ అనుభవంతో బాలాజీ సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం చుట్టారు.

ఆపిల్‌ మొక్కలకు పూత, కాత వచ్చింది..
ఆపిల్‌ నేషనల్‌ జీనోమ్‌ ప్రాజెక్టుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) చీఫ్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రధాన శాస్త్రవేత్తలు డా. రమేశ్‌ కె.అగర్వాల్, డా. ఎ. వీరభద్రరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో డా. జోగినాయుడు ఆధ్వర్యంలో ఆపిల్‌ సాగుపై అధ్యయనం జరుగుతోంది.

అదేవిధంగా, మినీ కశ్మీరంగా పేరుపొందిన కెరెమెరి పరిసరాల్లో ఆపిల్‌ ప్రయోగాత్మక సాగుకు 2015 మేలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలను పరిశీలించారు. చుట్టూ కొండలు, నడి వేసవిలోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకపోవటం వంటి కారణాలతో ధనోరా గ్రామం ఆపిల్‌ సాగుకు అనువైన ప్రాంతం అని సీసీఎంబీ నిర్ధారించింది.

శాస్త్రవేత్తలు బాలాజీ పొలానికి వచ్చి మట్టి పరీక్షలు జరిపారు. తొలుత కొన్ని ఆపిల్‌ మొక్కలను సాగు చేసి వాటి ఎదుగుదల బావుండటంతో బాలాజీని ప్రోత్సహించారు. 8–10 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ సాగుకు అనువైన  ఆపిల్‌ రకాలుగా గుర్తించిన హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–99, బిలాస్‌పూర్, నివోలిజన్, అన్న, రాయల్‌ బెలిషియస్‌ తదితర ఆపిల్‌ రకాలను సాగు చేస్తున్నారు. హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–49 రకాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త హరిమాన్‌ శర్మ ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు.

సీసీఎంబీ సరఫరా చేసిన ఆపిల్‌ మొక్కలను 2015 ఆగస్టులో బాలాజీ నాటారు. తొలుత 2 అడుగులు లోతు, వెడల్పు ఉండేలా గుంతలు తవ్వుకున్నారు. గుంతకు 10 కిలోలు పశువుల ఎరువు వేశారు. సాళ్లు, మొక్కల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా నాటుకున్నారు. ఆపిల్‌ మొక్కలకు నష్టం కలిగించే రసంపీల్చే పురుగుల నివారణకు వారానికోసారి కలుపు తీయిస్తున్నారు.

ప్రతి 20 రోజలకోసారి మొక్కకు లీటరు జీవామృతం ఇస్తున్నారు. చీడపీడల నివారణకు వారానికోసారి 20 లీటర్ల నీటికి లీటరు దశపత్ర కషాయం కలిపి పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పూత వచ్చింది. నెల రోజుల్లో కాయలు ఒక మోస్తరుగా పెరిగాయి. వేసవిలో నాలుగు రోజులకోసారి బోరుతో నీటి తడి ఇచ్చారు. అయితే ఆపిల్‌ చెట్లకు మూడేళ్ల వయసు వచ్చే వరకు కాపు తీయవద్దని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్పటంతో బాలాజీ పూతను తీసేస్తున్నారు. పరిశోధన కోసం రెండు చెట్లకు మాత్రమే కాయలు పెంచుతున్నారు. గుంతలు తవ్వేందుకు, మొక్కలు నాటేందుకు, కలుపు నివారణకు, ఇనుప కంచె, కూలీలకు, రూ. 3 లక్షల వరకు ఖర్చయిందని బాలాజీ తెలిపారు.

సేంద్రియ పండ్ల సాగులో పదేళ్ల అనుభవం
బాలాజీ అనేక ఏళ్లుగా ఎకరంలో బత్తాయిని సాగు చేస్తున్నారు. చెట్టుకు క్వింటా నుంచి క్వింటాన్నర వరకు బత్తాయిల దిగుబడి వస్తోంది. రూ. 60 వేల వరకు ఖర్చవుతుండగా, ఏడాదికి రూ. లక్ష నికరాదాయం వస్తోంది. జీవామృతం, దశపత్ర కషాయాలను వీటి సాగులో వాడతారు. బత్తాయిలో అల్చింతను అంతరపంటగా మడుల్లో సాగు చేస్తున్నారు. రబీలో గోధుమను సాగు చేస్తున్నారు. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.

గతేడాది ఆగస్టు నెలలో ఎకరంలో దానిమ్మ, మరో ఎకరంలో టిష్యూకల్చర్‌ అరటì  మొక్కలను నాటుకున్నారు. ఇందులో బంతిని అంతరపంటగా సాగు చేశారు. 40 క్వింటాళ్ల పూల దిగుబడి వచ్చింది. రూ. 30 వేల నికరాదాయం లభించింది. రెండేళ్ల క్రితం దశేరి, బంగినపల్లి మామిడి మొక్కలను రెండెకరాల్లో నాటారు. ఎకరాలో అంతరపంటగా దానిమ్మను సాగు చేశారు.

అర ఎకరాలో పసుపును సాగు చేస్తున్నారు. చిన్న మడులను ఏర్పాటు చేసి వేసవిలో కొత్తిమీర సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపికైన బాలాజీ జూన్‌ 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా రూ. లక్ష నగదు పుర స్కారాన్ని అందుకున్నారు.
– సర్పం ఆనంద్, సాక్షి, కెరెమెరి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యాన వర్సిటీలు ఆపిల్‌ సాగుకు తోడ్పాటునందించాలి!
ఆపిల్‌ సాగుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు రెండేళ్లుగా సాగుతున్న మా అధ్యయనంలో రుజువైంది. హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌. తదితర రకాలు మైదాన ప్రాంతాల్లో సైతం బాగా పెరుగుతున్నాయి. కోరాపుట్‌ (ఒడిశా)లో, అరకులో, రిషివ్యాలీలో, విజయనగరం జిల్లా సాలూరులో, నాందేడ్‌లో, వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో, ఆదిలాబాద్‌ జిల్లా కెరిమెరిలో ఆపిల్‌ పండ్ల సాగు సాధ్యమేనని తేలింది. ఆపిల్‌.. గులాబీ కుటుంబానికి చెందిన మొక్క.

గులాబీ మాదిరిగానే మన దగ్గర కూడా సాగు చేయొచ్చు. శీతాకాలంలో కనీసం 100–150 గంటల పాటు 10–12 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైతే ఫలితాలు బాగుంటాయి. మెదక్‌లో కూడా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సందర్భాలున్నాయి. కాబట్టి, ఆపిల్‌ మొక్కలు పెరుగుదల, పూత, కాత నిలబడటం వరకు సమస్య లేదు. అయితే, సమగ్ర సాగు పద్ధతిని ప్రమాణీకరించాల్సి ఉంది. ఇందుకు మరో రెండేళ్లు సమయం పడుతుంది.

ఒకేసారి విస్తారంగా పొలాల్లో కాకుండా పెరటి తోటల్లో సాగు చేయించాలి. ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు, ఉద్యాన వర్సిటీలు, ఉద్యాన శాఖలు శ్రద్ధాసక్తులు కనబరిస్తే పని సులువు అవుతుంది. వీరు ఆసక్తి చూపితే రానున్న డిసెంబర్‌ – జనవరి నెలల్లో మొత్తం 20 వేల ఆపిల్‌ మొక్కలను ఈ రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మక సాగుకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, చిత్తూరు రైతులు ఆపిల్‌ సాగుపై ఆసక్తి చూపారు.

Credits : https://www.sakshi.com/news/family/938484

పక్షులు.. పంటలకు ఆప్తమిత్రులు!

Protect Crops From Birds Prof Dr Vasudeva Rao ...

పత్తి, కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలనాశించే శనగపచ్చ పురుగును తినే పక్షి జాతులున్నాయి..

పంటలను పాడు చేసే పక్షి జాతులు 63.. మేలు చేసే పక్షి జాతులు 420!

పంటలకు మేలు/హాని చేసే పక్షులపై పీజేటీఎస్‌ఏయూలో విస్తృత పరిశోధనలు

అడవి పందులు, కోతుల నుంచి పంటలను కాపాడుకునే మార్గాలపైనా అన్వేషణ

మిత్ర పక్షుల ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతు సురేశ్‌రెడ్డి

పక్షులు..!  పంటలకు మిత్రులా? శత్రువులా??

పక్షుల పేరు వినగానే పంటలకు కీడు చేస్తాయన్న భావనే సాధారణంగా చాలా మంది రైతుల మదిలో మెదులుతుంది…  కానీ, నిజానికి పంటలను కనిపెట్టుకొని ఉంటూ పురుగులను ఎప్పటికప్పుడు ఏరుకు తింటూ ఎంతో మేలు చేసే పక్షి జాతులు వందలాదిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటూ ఉంటే..  ఏదో చెబుతుంటారు.. కానీ, ఈ కలికాలంలో ఇవన్నీ రైతులు ఆధారపడదగినవి కాదేమోనని అనిపిస్తుంటుంది. అయితే, యువరైతు సురేశ్‌రెడ్డి మాత్రం మిత్ర పక్షుల వల్ల పంటలకు ఎంతో మేలు జరుగుతున్న మాట ముమ్మాటికీ నిజమేనని అనుభవపూర్వకంగా చెబుతున్నారు!

తన పొలంలో కొంగలు, కాకులు, నీటికోళ్లు, బండారి గాళ్లు (గిజిగాళ్లు) వంటి మిత్ర పక్షులు పురుగులను ఏరుకు తింటూ పంటలను చాలా వరకు చీడపీడల నుంచి కాపాడుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు. మిత్ర పక్షులు మన పొలాలకు రావాలంటే.. పొలం గట్ల మీద, పరిసరాల్లో చెట్లను పెరగనివ్వాలని.. వాటిపైనే మిత్రపక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకొని మన పంటలకు అనుక్షణం కాపలా కాస్తున్నాయని కృతజ్ఞతాపూర్వకంగా చెబుతున్నారు.

గత 20 ఏళ్లుగా తాము ఒక్క చెట్టునూ నరకలేదని సురేశ్‌రెడ్డి గర్వంగా చెబుతున్నారు. పక్షులు, జంతువుల ద్వారా పంటలకు కలిగే లాభనష్టాలపై, పంట నష్టాలను అధిగమించే ఉపాయాలపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ వైద్యుల వాసుదేవరావు సారధ్యంలో దీర్ఘకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి.   డా.వాసుదేవరావు సూచనలు, సలహాలను సురేశ్‌రెడ్డి గత ఐదారేళ్లుగా శ్రద్ధగా పాటిస్తూ.. పంటల సాగులో మిత్ర పక్షుల సహాయంతో చీడపీడలను సులువుగా జయిస్తుండటం విశేషం.

మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి పంటపై అతి ప్రమాదకరమైన పురుగుల మందులను చల్లుతూ ఇటీవల 18 మంది రైతులు, రైతు కూలీలు చనిపోగా 400 మంది ఆసుపత్రులపాలయ్యారు. ఈ నేపథ్యంలో చీడపీడల బారి నుంచి పంటలను కాపాడటంలో పురుగుమందులే కాదు మిత్ర పక్షులు కూడా ఎంత సమర్థవంతంగా ఉపకరిస్తాయో తెలియజెప్పే శాస్త్రీయ పరిశోధనలు, అనుభవాలపై ప్రత్యేక సమగ్ర కథనం ‘సాక్షి సాగుబడి’ పాఠకుల కోసం..

పొలాల్లో పురుగులను పక్షులతో ఏరించవచ్చు!
► పొలాల్లో పురుగులను ఏరుకు తిని పంటలకు మేలు చేసే పక్షులు 420 జాతులున్నాయి.
► పత్తి తదితర పంటల్లో శనగపచ్చ పురుగులు, పొగాకు లద్దెపురుగులను పక్షులు ఇష్టంగా తింటాయి
► మిత్ర పక్షులను సంరక్షిస్తే పురుగుమందుల అవసరాన్ని మూడొంతులు తగ్గించవచ్చు
► ‘సాగుబడి’ ఇంటర్వ్యూలో ముఖ్య శాస్త్రవేత్త డా. వాసుదేవరావు

మన దేశంలో 1300 పక్షి జాతులుంటే.. 483 జాతుల పక్షులకు వ్యవసాయ పంటలతో సంబంధం ఉంది. 420 జాతుల పక్షులు రైతు నేస్తాలు. పొలాల్లోని పురుగులు మాత్రం తిని బతుకుతూ రైతులకు ఇవి ఎనలేని మేలు చేస్తున్నాయి. పండ్లు, గింజలు తినే 63 జాతుల పక్షులు పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఈ పక్షులు, అడవి పందులు, కోతులు తదితర జంతువుల (ఎలుకలు మినహా) వల్ల దేశవ్యాప్తంగా పంటలకు తీరని నష్టం జరుగుతున్నది. అడవులు, పొలాల దగ్గర చెట్ల సంఖ్య తగ్గిపోతున్నకొద్దీ వీటి బెడద పెరుగుతున్నది. వీటిని చంపడానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం అంగీకరించదు.

కాబట్టి, పంటలను వీటి నుంచి కాపాడుకునే ఉపాయాలపై పరిశోధనలు చేయడానికి దేశవ్యాప్తంగా 17 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ‘అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం’ ఏర్పాటైంది. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న విభాగానికి ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు అధిపతిగా పనిచేస్తున్నారు. ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పంటలకు హాని చేసే పక్షులను, అడవి పందులను పారదోలడానికి ఆయన కనిపెట్టిన యంత్రానికి పేటెంట్‌ రావటం విశేషం. ఆయన సారథ్యంలో పక్షులపై 17 ఏళ్లుగా, అడవి పందులపై ఐదేళ్లుగా, రెండేళ్లుగా కోతులపై జరుగుతున్న పరిశోధనలు రైతుల శ్రేయస్సుకు దోహదపడుతున్నాయి. ‘సాక్షి సాగుబడి’కి డా. వాసుదేవరావు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు..

పక్షులు, జంతువులకు క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటాయి. ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే సంపాదించుకొని ఎంత అవసరమో అంతే తింటాయి. పక్షుల్లో కొన్ని జాతులు పురుగులు మాత్రమే తింటాయి. మరికొన్ని జాతులు గింజలను తింటాయి. రామచిలుకలు స్వతహాగా పండ్లు తింటాయి. అడవుల నరికివేతతో పాటు రోడ్ల విస్తరణ వల్ల పండ్ల చెట్లు తగ్గిపోవటంతో రామచిలుకలు గింజలు తింటున్నాయి. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను పురుగుమందుల పిచికారీ ద్వారానే కాదు మిత్ర పక్షుల ద్వారా కూడా అరికట్టవచ్చు.

పత్తి, వేరుశనగ, శనగ, కంది, మినుము, పొద్దుతిరుగుడు తదితర పంటలకు నష్టం చేస్తుంది. పొలాల్లో శనగపచ్చపురుగు, పొగాకు లద్దె పురుగులను ఇష్టంగా తినే పక్షులు మన దేశంలో 420 రకాల జాతులు ఉన్నాయి. వేరుశనగ పొలంలో ఒక కొంగ 20 నిమిషాల్లో సుమారు 50 పురుగులను తింటుంది. శనగ పంటలో శనగపచ్చ పురుగును సముద్ర కాకులు ఏరుకు తిని పురుగుల ఉధృతిని 73% వరకు తగ్గిస్తాయి. పంటల సాళ్ల మధ్య అడుగున్నర దూరం ఉన్న పొలాల్లో కన్నా.. 2 అడుగుల దూరం ఉన్న పొలాల్లో పక్షులు స్వేచ్ఛగా తిరుగుతూ పురుగులను ఏరుకు తింటాయి.  మిత్ర పక్షుల్లో తెల్లకొంగలు చాలా ముఖ్యమైనవి. వర్షాలు పడి పొలాలు దున్నుతున్నప్పుడు బయటపడే వేరుపురుగులను, లార్వా దశలో ఉన్న పురుగులను 73% వరకు కొంగలు తినేస్తాయి. మే,జూన్‌ నెలల్లో చెట్లపై స్థావరాలను ఏర్పాటు చేసుకొని దుక్కుల సమయంలో సంతానోత్పత్తి చేస్తాయి.

తెల్ల కొంగలు.. వర్షాల రాకను ముందే పసిగట్టగలవు!
ఒకటి, రెండు నెలలు ముందుగానే వర్షాల రాకను తెల్లకొంగలు గ్రహించి, తదనుగుణంగా గుడ్లు పెట్టడానికి సమాయత్తమవుతాయి. వర్షాలు ఆలస్యమౌతాయనుకుంటే.. సంతానోత్పత్తి షెడ్యూల్‌ను ఆ మేరకు వాయిదా వేసుకుంటాయి. పిల్లలను పొదిగే దశలో తెల్లకొంగల మెడ భాగం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని బట్టి వర్షం రాకను తెలుసుకోవచ్చు. వర్ష  సూచిక జాతిగా కొంగలు గుర్తింపు పొందాయి. పొలాలు దున్నుతున్నప్పుడు, పశువులు నడుస్తున్నప్పుడు బయటపడే వేరుపురుగులను కొంగలు తింటాయి.ఒక్కో పిల్లకు రోజుకు 16 గ్రాముల చొప్పున.. 3 పిల్లలకు కలిపి 45 గ్రాముల వేరుపురుగులను ఆహారంగా అందిస్తాయి. ఒక చెట్టుంటే.. వందలాది కొంగల గూళ్లుంటాయి. దీన్నిబట్టి పంటలకు ఎంత మేలు చేస్తున్నాయో గుర్తించవచ్చు. వీటి ఆహారంలో 60% పురుగులు, 10% కప్పలు, 5% చిన్నపాములు, చేపలు ఉంటాయి. తెల్లకొంగలు పొలాల్లో చెట్ల మీదకన్నా మనుషుల ఇళ్లకు దగ్గర్లోని చెట్లపైనే ఎక్కువ గూళ్లు పెట్టుకుంటాయి. మనుషులకు దగ్గర్లో ఉంటే శత్రువుల నుంచి రక్షణ దొరుకుతుందని భావిస్తాయి.

కానీ, కొంగలు రెట్టలు వేస్తున్నాయని, నీసు వాసన వస్తున్నదని మనం మూర్ఖంగా చెట్లు కొట్టేస్తున్నాం. పంటలపై చీడపీడలు పెరగడానికి ఇదొక ముఖ్య కారణం. పొలాల దగ్గర్లో, గట్ల మీద పూలు, పండ్ల చెట్లను పెంచితే వాటిపై స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ పక్షులు పురుగులను తింటూ పంటలను కాపాడతాయి. కానీ, మన పొలాల్లో, గట్లపై చెట్లను 95% వరకు నరికేశాం. చెట్లుంటే పక్షులు వాలి పెంటికలు వేస్తాయి. వర్షం పడినప్పుడు నీసు వాసన వస్తుంది.ఇది తెలియక మనుషులు ఇళ్ల దగ్గర, ఊళ్లో, పొలాల గట్ల మీద ఉన్న చెట్లను నరికేస్తున్నారు. తెల్ల కొంగలు ఊళ్లో చెట్ల మీదే ఎక్కువగా గూళ్లు పెట్టి.. కిలోమీటర్ల దూరంలోని పొలాలకు వెళ్లి పురుగులను తింటాయి. పక్షుల విసర్జితాలు భూసారాన్ని సహజసిద్ధంగా పెంపొందించడానికి దోహదపడతాయి. పంటల్లో పురుగులు ఏరుకొని తినే మిత్ర పక్షులను ఆహ్వానించాలనుకుంటే పొలాల గట్లపైన, పరిసరాల్లో చెట్లు పెంచాలి. పంట పొలాల మధ్య ‘టి’ ఆకారంలో పంగల కర్రలు లేదా పక్షి స్థావరాలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలి. పంట ఎంత ఎత్తుకు ఎదుగుతుందో దానికన్నా అడుగు ఎత్తున ఈ పంగల కర్రలు ఉండాలి.  పురుగులు పంట పూత దశలో వస్తాయి. అప్పుడు పంగల కర్రలను ఏర్పాటు చేయాలి. ఎన్‌.పి.వి. (న్యూక్లియో పాలీ హైడ్రో ద్రావణం) ద్రావణాన్ని హెక్టారుకు 250 ఎల్‌.ఈ. మోతాదులో పురుగు వచ్చిన తొలిదశ(మొక్కకు 2,3 పురుగులు కనిపించినప్పుడు)లో పిచికారీ చేయాలి. ఈ రెండు పనులూ చేస్తే పురుగుమందుల వాడకాన్ని 75% తగ్గించుకోవచ్చు.

శత్రు పక్షుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలు!
పొలాల్లో పురుగులు ఏరుకు తిని బతికే పక్షుల వల్ల పంటలకు మేలు జరుగుతుండగా.. పంటలపై దాడి చేసి కంకుల్లో గింజలను, కాయలను తినేసే 63 రకాల పక్షుల వల్ల రైతుకు నష్టం జరుగుతున్నది. పూల నుంచి మకరందాన్ని, పండ్లను, గింజలను తిని బతికే పక్షులు ఇవి. వీటి నుంచి పంటలను కాపాడుకోవడానికి అనేక ఉపాయాలను
డా. వాసుదేవరావు రైతులకు సూచిస్తున్నారు.

► మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, చిరుధాన్య పంటలకు పక్షుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది. వీటిని ప్రధాన పంటలుగా ఎకరంలో సాగు చేస్తే పక్షుల వల్ల దిగుబడి నష్టం 80–90 శాతం ఉంటుంది. అయితే, ఒకే చోట కనీసం 20 ఎకరాల్లో ఈ పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తే నష్టం 5% కన్నా తక్కువగానే ఉంటుంది. ఈ పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులు అనేక ఉపాయాల ద్వారా పంటను రక్షించుకునే తక్షణ, దీర్ఘకాలిక మార్గాలున్నాయి.

► రామచిలుకలు, గోరింకలు, కాకులు, జీలువాయిలు, పిచుకలు, గిజిగాళ్లు.. తదితర జాతుల పక్షుల వల్ల పంటలకు నష్టం జరుగుతున్నది. పూల చెట్లు, పండ్ల చెట్లను నరికేయడం వల్ల ఈ పక్షులు పంటల మీదకు వస్తున్నాయి.

► ఒక ప్రాంతంలో 250–300 పక్షులు ఉంటాయి. 15–20 కిలోమీటర్ల పరిధిలో పంటలపైనే ఇవి వాలతాయి. ఆ పరిధిలోకి ఇతర పక్షులు రావు. ఆహారం దొరక్కపోతే వెళ్లిపోతాయి. సంతతి బాగా పెరిగినప్పుడు దూరంగా వలస వెళ్లిపోతాయి.

► పంటలను నష్టపరిచే జాతుల పక్షులు ఎక్కువగా ఏయే జాతుల చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయో గత 3,4 ఏళ్లుగా డా. వాసుదేవరావు సారధ్యంలో అధ్యయనం జరిగింది. 12 పూలజాతి చెట్లు, 11 పండ్ల జాతి చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీటిలో వీలైన కొన్ని జాతుల చెట్లను పొలం గట్లపై నాటితే.. పంటలను నష్టపరిచే పక్షుల దష్టిని మళ్లించి పంటలను కాపాడుకోవచ్చు.

► పొలాలకు దగ్గర్లో హెక్టారుకు పూల జాతి చెట్లు 4, పండ్ల జాతి చెట్లు 4 పెంచితే పక్షులు వీటిపై ఆధారపడి బతుకుతాయి. పంటల జోలికి రావు.

► పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పూల జాతి చెట్లు:
కాడమల్లి, రేల, అడవి బూరుగ, చెట్టు తంగేడు, నిద్రగన్నేరు, మోదుగ, అడవి గానుగ, దేవకాంచనం, కారక, ఆకుపాల, ఇప్ప, సీమగానుగ…
► పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పండ్ల జాతి చెట్లు:
నేరేడు, రావి, మర్రి, చీమచింత, చింత, ఈత, పరిగి, రేగు, చెక్కర చెట్టు, నక్కెర, మేడి…

పేపర్‌ ప్లేట్ల పద్ధతి
► పొద్దు తిరుగుడు గింజలు పాలుపోసుకునే దశలో అల్యూమినియం ఫాయిల్‌ పూతపూసిన పేపర్‌ పేట్లను పొద్దుతిరుగుడు పువ్వుల అడుగున అమర్చితే రామచిలుకల దాడి నుంచి 69% పంటను రక్షించుకోవచ్చు.

మొక్కజొన్నకు ఆకుచుట్టు రక్షణ!
► మొక్కజొన్న పంట పాలు పోసుకునే దశలో కంకి చుట్టూ చుట్టి పక్షుల దష్టిని మరల్చవచ్చు.
► పొలం గట్ల నుంచి 3 లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దష్టిని మరల్చి పంటలను రక్షించుకోవచ్చు.
► తక్కువ విస్తీర్ణంలో పంట వేసిన రైతులకు ఇది అనువైన పద్ధతి.

రక్షక పంట పద్ధతి
► రామచిలుకలు సాధారణంగా మొక్కజొన్న పంటకు గట్టు పక్కన మొదటి వరుసపై దాడి చేస్తాయి.
► జొన్న లేదా మొక్కజొన్న మొక్కలను గట్ల పక్కన వరుసలో రెట్టింపు ఒత్తుగా వేయడం (స్క్రీన్‌ క్రాప్‌) ద్వారా పక్షులను పంట లోపలికి చొరబడకుండా అడ్డుకోవచ్చు

కోడి గుడ్ల ద్రావణం పిచికారీ
► పొద్దుతిరుగుడు పంటలో గింజ పాలుపోసుకునే దశలో 20 మి.లీ. కోడిగుడ్ల ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పూలపై పిచికారీ చేయాలి. పక్షుల వల్ల కలిగే నష్టాన్ని 82% వరకు తగ్గించుకోవచ్చని రుజువైంది.
► విత్తనోత్పత్తి క్షేత్రాలలో నైలాన్‌ వలలను పంటపైన కప్పటం ద్వారా పక్షుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు.

నెమళ్ల నుంచి పంటలను కాపాడుకునేదిలా..
► పొలంలో వేసిన విత్తనాలను నెమళ్లు తినేస్తుంటాయి. ఒక వైపు ఎరుపు, మరోవైపు తెలుపు రంగులో ఉండే రిబ్బన్లను విత్తనాలు వేసిన పొలంలో అడుగు ఎత్తులో కడితే విత్తనాలను నెమళ్ల నుంచి కాపాడుకోవచ్చు. మొలక వచ్చే వరకు 10 రోజులు ఉంచి రిబ్బన్లను తీసేయవచ్చు.
► పంట పొలాల్లోకి నెమళ్లు రాకుండా పొలం చుట్టూ 3 నిలువు వరుసలుగా కొబ్బరి తాళ్లతో కంచె మాదిరిగా కట్టాలి. పై తాడుకు కింది తాడుకు మధ్య అడుగు దూరం ఉండాలి. దాని నుంచి నెమలి లోపలికి వెళ్లలేదు.

వేప గింజల ద్రావణం పిచికారీ పద్ధతి
► వేప గింజల ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా పంటలను పక్షులు తినకుండా కాపాడుకోవచ్చు.

► లీటరు నీటికి 200 మి. లీ. వేప గింజల ద్రావణాన్ని కలిపి పంటలు గింజ పాలుపోసుకునే దశలో పిచికారీ చేయాలి. పక్షులు వేప గింజల ద్రావణం రుచి సహించక వెళ్లిపోతాయి.

► వేప గింజల ద్రావణం లేక పొగాకు కషాయాన్ని లీటరు నీటికి 10 మి.లీ. కలిపి పిచికారీ చేసి పక్షుల బెడదను నివారించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ పంటల్లో ఇది బాగా పనిచేసింది.
(అడవి పందులు, కోతుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలపై కథనం వచ్చే వారం ‘సాగుబడి’ పేజీ చూడండి)

పక్షులు నడిచిన పొలాల్లో పురుగులు మిగలవు!
► మా పొలాల్లో వందల చెట్లున్నాయి..20 ఏళ్లలో ఒక్క చెట్టూ కొట్టలేదు
►  పంటలకు పురుగుమందుల అవసరం పెద్దగా లేదు
► ‘సాక్షి సాగుబడి’తో ఆదర్శ రైతు సురేశ్‌రెడ్డి
 పొలాల గట్లపైన, పరిసరాల్లో అనేక జాతుల చెట్లను, వాటిపైన గూళ్లు పెట్టుకున్న మిత్ర పక్షులను సంరక్షించుకుంటూ సమీకృత వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు చింతపల్లి సురేశ్‌ రెడ్డి (39). ఆయన స్వగ్రామం గడ్డమల్లాయిగూడెం. ఆ ఊరు హైదరాబాద్‌కు దగ్గర్లో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంది. ఐదారు బర్రెలున్నాయి. ఒకటిన్నర ఎకరాల్లో వరి, ఎనిమిదెకరాల్లో రాగులు, సజ్జలు, ఉలవలు, కందులు వంటి ఆహార పంటలనే వేస్తున్నారు. వేసవిలో ఆకుకూరలు సాగు చేస్తారు. అధిక పెట్టుబడులు, అనుక్షణం టెన్షన్‌ పడటం ఎందుకని పత్తి జోలికి వెళ్లటం లేదన్నారు. వరి పొలం గట్ల మీద, చెల్క మధ్యలో కూడా చెట్లను పెరగనివ్వటం సురేశ్‌రెడ్డి ప్రత్యేకత. వంద వరకు వేపచెట్లు, 50 వరకు నల్లతుమ్మ, ఊడుగు తదితర జాతుల చెట్లు ఆయన పొలాల్లో ఉన్నాయి. ఇవన్నీ పడి మొలిచినవేనని అంటూ.. పనిగట్టుకొని మొక్కలు నాటక్కర లేదని, ఉన్న వాటిని నరక్కుండా ఉంటే చాలంటారాయన. గత 20 ఏళ్లలో ఒక్క చెట్టునూ తమ పొలాల్లో కొట్టలేదని గర్వంగా చెబుతున్నారు. గట్ల మీద చెట్లుంటే  పంటకు ఇబ్బందేమీ లేదని, వేసవిలో నీడలో పెరిగే కొత్తిమీర వంటి పంటలకు చెట్ల నీడ ఉపయోగపడుతుందంటున్నారు. చెట్లు ఉండటం వల్ల తమ పొలాల్లోకి అనేక రకాల మిత్ర పక్షులు వచ్చి పురుగులను తింటూ పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయంటున్నారు సురేశ్‌రెడ్డి. గత ఐదారేళ్లుగా డా. వాసుదేవరావు సూచనలు పాటిస్తూ మిత్ర పక్షుల సేవలను ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారు.
పురుగుమందుల అవసరం బాగా తగ్గింది..
సురేశ్‌రెడ్డి ఇంకా ఇలా చెబుతున్నారు.. ‘‘దుక్కి చేస్తున్నప్పుడు తెల్లకొంగలు, కాకులు వేరు పురుగులను, నిద్రావస్థలో ఉన్న పురుగులను తింటాయి. శ్రీవరి నాటిన తర్వాత సాళ్ల మధ్యలో కొంగలు తిరుగుతూ తెల్ల కంకికి కారణమయ్యే పురుగులను ఏరుకు తింటాయి. నీరుకోళ్లు వరి పొలంలో పురుగులను తింటూ కనిపిస్తాయి. పక్షులను పొలంలో నుంచి వెళ్లగొట్టను. వాటి పని వాటిని చేయనిస్తాను. కొందరు రైతులు మొక్కలను తొక్కుతాయేమోననుకొని వీటిని పారదోలుతుంటారు. కానీ, నీరుకోడి నడిచిన వరి పొలానికి కాండం తొలిచే పురుగు సమస్య అసలు రానే రాదు. చిరుధాన్య పంటలను ఇష్టపడే బండారి గాళ్లు (గిజిగాళ్లు) పక్షులు గడ్డిపోచలను ఏరి చెట్లకు అందమైన గూళ్లను నిర్మించుకొని స్థిరనివాసం ఉంటున్నాయి. పురుగులను తింటాయి. కొంత మేరకు చిరుధాన్యాలను తింటాయి. మనకన్నా ఎక్కువగా పంటను కనిపెట్టుకొని ఉంటాయి. పొలంలో పాము కనిపిస్తే ‘వచ్చే.. వచ్చే..’ అనే విధంగా చిత్రమైన శబ్దాలు చేస్తూ దూరంగా వెళ్లిపోతాయి. అక్కడ ఏమో ఉందని గ్రహించి మేమూ జాగ్రత్తపడుతుంటాం. మిత్ర పక్షులు పురుగులను తినటం వల్ల పురుగుమందుల అవసరం బాగా తగ్గింది. వరి, వంగ, బెండ వంటి పంటల్లో ఒకటి, రెండు సార్లు పురుగుమందులు పిచికారీ చేస్తే సరిపోతున్నది. చెట్లుంటేనే పురుగులను తినే పక్షులు మన దగ్గర్లో ఉంటాయి. వేప, నల్లతుమ్మ చెట్లు బాగా పెరిగాయి కాబట్టి వాటి ఆకులను మేకలు, గొర్రెల మేపునకు ఇస్తున్నాం. ఏటా రూ. 10 వేల అదనపు ఆదాయం కూడా వస్తున్నది..’’

ముందుగా రికార్డు చేసిన ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పక్షులను భయపెట్టి పారదోలటం ఒక పరిష్కారం..
రిబ్బన్లు కడితే పంటలు సేఫ్‌!
► రిబ్బన్‌ పద్ధతి ద్వారా వివిధ పంటలను పక్షుల బెడద నుంచి కాపాడుకోవచ్చు.
► పంటకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కర్రలను ఉత్తర – దక్షిణ దిశలలో నాటాలి.
► ఒక పక్క ఎరుపు రంగు, మరో పక్క తెలుపు రంగులతో అర అంగులం వెడల్పు, 30 అడుగుల పొడవు గల రిబ్బన్‌ను 3 లేదా 4 మెలికలు తిప్పి.. కర్రలను 10 మీటర్ల దూరంలో నాటి కట్టాలి.
► పక్షుల ఉధృతి ఎక్కువగా ఉంటే కర్రల మధ్య దూరం 5 మీటర్లకు తగ్గించాలి.
► రిబ్బన్‌పైన ఎండ పడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ.. పంట ఏ దశలో ఉందో పక్షుల కంట పడకుండా ఈ రిబ్బన్‌ చేస్తుంది.
► ఈ పద్ధతిలో అన్ని రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, పండ్ల తోటలను పక్షుల బారి నుంచి కాపాడుకోవచ్చు.

Credits : https://www.sakshi.com/news/family/protect-crops-birds-prof-dr-vasudeva-rao-944310

అడవి పందులు, కోతుల పీడ విరగడయ్యేదెలా?

Wild pigs and monkeys to get sick?

అడవి పందులు, కోతుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పంటలకు తీవ్ర నష్టం

డా. వాసుదేవరావు సారథ్యంలో ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విస్తృత అధ్యయనం

అడవి పందులను పారదోలే ‘ఆర్తనాదాల యంత్రం’.. కోతులను బెదరగొట్టే తుపాకీకి రూపకల్పన

పంటల రక్షణకు మరికొన్ని ఉపాయాలను రూపొందించిన శాస్త్రవేత్తలు

అడవి పందులు, కోతుల సంఖ్య, పంట నష్టంపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించడం అవసరమంటున్న శాస్త్రవేత్తలు

అడవిలోని పందులు, కోతుల వంటి జంతువులకు ఆహార కొరత ఏర్పడితే ఏమవుతుంది? అవి దగ్గర్లోని పంట పొలాలపై వచ్చి పడుతూ ఉంటాయి. అడవి బలహీనమవుతున్న కొద్దీ పంటల మీద వీటి దాడి తీవ్రమవుతూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో  రైతులకు అడవి పందులు, కోతుల బెడద గత ఐదారేళ్ల నుంచి పెను సమస్యగా పరిణమించింది. వీటిని పారదోలి పంటలను కాపాడుకునే పద్ధతులపై ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్నది. విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అడవి పందులు, కోతులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలేందుకు అనేక పద్ధతులను రూపొందించింది. ఇవి రైతులకు ఊరటనిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెంచుకుంటున్న అడవి పందులు, కోతులను నిర్మూలిస్తే తప్ప తమ కష్టాలు తీరవని కొందరు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటి కాల్చివేత నేరం.

కిం కర్తవ్యం?!
అడవి పందులు, కోతుల సంఖ్య ఎంత? వీటి వల్ల ఏయే పంటల్లో జరుగుతున్న నష్టం ఎంత? స్పష్టంగా తెలియదు! గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకావడం లేదన్నది ఒక వాదన. సమస్య తీవ్రతపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించినప్పుడే వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొనే మరింత సమర్థవంతమైన మార్గాలు వెదకడం సాధ్యమవుతుందని అఖిల భారత సకశేరుక చీడల(వెర్బట్రేట్‌ పెస్ట్‌) యాజమాన్య విభాగం అధిపతి డా. వాసుదేవరావు స్పష్టం చేస్తున్నారు.  పాలకులారా వింటున్నారా..?!

అడవి పందులు పంటల వాసనను  పసిగట్టి పొలాలపై దాడి చేస్తుంటాయి..
అడవి పల్చబడిపోవటం వల్ల వ్యవసాయం కూడా దెబ్బతింటున్నది. అడవిలో మానులు నరికివేతకు గురవడంతో అడవి జంతువులు, పక్షులకు ఆహారం దొరకడం లేదు. దాంతో అవి ఆకలి తీర్చుకోవడానికి రైతుల పంట పొలాలపైకి దాడి చేస్తున్నాయి. ఇందువల్లనే అడవి పందులు, కోతుల వంటి జంతువుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులకు జరుగుతున్న పంట నష్టం ఏటేటా పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. అయితే, ఈ సమస్యపై పాలకులు అంతగా దృష్టి పెట్టకపోవటంతో రైతులకు కష్టనష్టాలే మిగులుతున్నాయి.

∙మన దేశంతోపాటు బర్మా, అమెరికా, రష్యా తదితర దేశాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో వీటిని కాల్చి లేదా విషం పెట్టి చంపుతున్నారు. కానీ, మన దేశంలో వివిధ కారణాల వల్ల వన్యప్రాణి సంరక్షణకే అధికంగా మొగ్గు చూపుతున్నాం

► అడవి పందులు సామాన్యంగా వర్షాకాలం ముగిసిన తర్వాత పంట పొలాలపై ఎక్కువగా దాడి చేస్తుంటాయి. గడ్డి భూములు, అటవీ పరిసర ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, పంట పొలాల సమీపంలో రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉంటాయి

► అనేక రకాల పంటలు, దుంపలు, మట్టిలోని వేరు పురుగులు, పాములు, చిన్న జంతువులను తింటాయి. కలుపు మొక్క తుంగ గడ్డలను ఇష్టపడతాయి

► పరిపక్వ దశలోని మొక్కజొన్నకు 23–47%, వేరుశనగకు 20–48%, చెరకుకు 18–36%, వరికి 11–30%, జొన్నకు 10–20% చొప్పున పంట దిగుబడి నష్టం కలిగిస్తాయి. కంది, పెసర, వరి, శనగ, కూరగాయ పంటలకు కూడా అడవి పందులు నష్టం చేస్తాయి

► ఘాటైన వాసనను వెదజల్లే పసుపు, అల్లం, వాము, ఆవాలు.. ముళ్లను కలిగి ఉండే వాక్కాయ, కుసుమ, ఆముదం పంటల జోలికి అడవి పందులు రావు

► పంటలకు నష్టం కలిగించడంతోపాటు వైరస్‌ సంబంధమైన జబ్బులను ఇతర జంతువుల్లో వ్యాపింప చేస్తాయి

► అడవి పందుల్లో వాసన పసిగట్టే గుణం ఎక్కువ. కాబట్టి, దూరం నుంచే ఎక్కడ ఏ పంట ఉందో గ్రహిస్తాయి. చూపు, వినికిడి శక్తి తక్కువ

► ఆహార సేకరణకు 15–35 వరకు కలసి గుంపులుగా సంచరిస్తాయి. ఆడ పందులు నాయకత్వం వహిస్తాయి

► అడవి పందులు వర్షాకాలంలో 4–12 పిల్లలను కంటాయి ∙అడవి నుంచి బయటకు వచ్చిన అడవి పందులు సర్కారు తుమ్మ చెట్లలో నివాసం ఏర్పాటు చేసుకొని.. రాత్రుళ్లు పంటల పైకి దాడి చేస్తున్నాయి.

ఆర్తనాదాల యంత్రంతో అడవి పందులకు చెక్‌
అడవి పందులను సమర్థవంతంగా పారదోలేందుకు శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను రూపొందించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినది ‘ఆర్తనాదాల యంత్రం’(బయో అకౌస్టిక్స్‌). బెంగళూరుకు చెందిన గ్రుస్‌ ఎకోసైన్సెస్‌ సంస్థతో కలసి దీన్ని రూపొందించారు. గత మూడేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో 155 మంది రైతుల క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. రైతుల అనుభవాలు, సూచనలకు అనుగుణంగా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచారు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున త్వరలో కంపెనీతో అవగాహన ఒప్పందం జరగబోతోంది.

పులి, అడవి పంది తదితర అటవీ జంతువులు ఆపదలో ఉన్నప్పుడు బిగ్గరగా అరిచే ఆర్తనాదాలను 33 నిమిషాలపాటు రికార్డు చేశారు. ప్రతి జంతువు ఆర్తనాదాలకు మధ్యలో కొద్ది నిమిషాలపాటు.. ఇవి నిజమైన ఆర్తనాదాలేనని భ్రమింపజేయటం కోసం.. విరామం ఇచ్చారు. ఆర్తనాదాల యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి లేదా మరేదైనా కర్రకు బిగించవచ్చు. విద్యుత్‌తో నడుస్తుంది. కరెంట్‌పోతే సౌరశక్తితో నడుస్తుంది. బ్యాటరీ 12–14 గంటలు పనిచేస్తుంది. జీఎస్‌ఎం సిమ్‌ టెక్నాలజీని వాడారు. రైతు పొలానికి వెళ్లకుండానే సెల్‌ ద్వారా ఆన్‌/ ఆఫ్‌ చేయొచ్చు. అరుపులు బాగా బిగ్గరగా (42–37 డెసిబుల్స్‌) 10–15 ఎకరాల వరకు వినిపిస్తాయి.

అడవి పందులను అరికట్టే జీవకంచెలు: మొక్కజొన్న, జొన్న పంటల చుట్టూ ఆముదం మొక్కలను 4 వరుసలు దగ్గర దగ్గరగా విత్తుకొని అడవి పందులు లోపలికి రాకుండా చూడవచ్చు. ఆముదం పంటపై ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. వేరుశనగ పొలానికి చుట్టూ కుసుమ పంటను 4 వరుసలు వత్తుగా విత్తుకోవాలి. పొలం చుట్టూతా దగ్గర దగ్గరగా వాక్కాయ చెట్లు పెంచటం ద్వారా పొలంలోపలికి అడవి పందులు రాకుండా అడ్డుకోవచ్చు. వాక్కాయ చెట్టుకు ఉండే ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. ఈ పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది.

ఇనుప ముళ్ల కంచెలు: చిన్న కమతాల్లో పంటలు పండించుకునే రైతులు ముళ్ల కంచెలు వేసుకోవడం ద్వారా అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. బార్బ్‌డ్‌ వైర్‌తో 3 వరుసలుగా పంట చుట్టూ కంచెగా నిర్మించాలి. 2 అడుగుల గుండ్రటి కంచెను పంట చుట్టూ వేయాలి. దీన్నే పోలీస్‌ కంచె అని కూడా అంటారు.

చైన్‌ లింక్‌ ఫెన్స్‌ను పొలం చుట్టూ వేసుకొని పంటను రక్షించుకోవచ్చు. భూమి లోపలికి 9 అంగుళాల మేరకు దీన్ని పాతాలి. లేకపోతే కంచె కింద మట్టిని తవ్వి.. కంత చేసుకొని పొలంలోకి పందులు వస్తాయి. హెచ్‌.డి.పి.ఇ. చేపల వలను పొలం చుట్టూ వేసుకోవచ్చు. 3 ఇంచుల కన్ను ఉండే వలను వాడాలి. 3 అడుగుల ఎత్తు, 2 అడుగుల వలను భూమి మీద పరచి.. మేకులు కొట్టాలి. ఈ వలలో అడవి పందుల గిట్టలు ఇరుక్కుంటాయి.

కందకాలు: పొలం చుట్టూ కందకాలు తవ్వటం ద్వారా అడవి పందులను అడ్డుకోవచ్చు. కందకం 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు ఉండాలి. పొలం చుట్టూతా ఒకటే కందకం తవ్వాలి. ఎక్కడా గట్టు వదలకూడదు. పొలం గట్టుకు అడుగు దూరంలో తవ్వాలి. పందులు దూకి రాలేవు. వాన నీటి సంరక్షణ జరుగుతుంది. పక్క పొలాల నుంచి పురుగులు కూడా మన పొలంలోకి రావు.

విషగుళికలు: పొలం చుట్టూ కర్రలు పాతి ఫోరేట్‌ గుళికలను గుడ్డ మూటల్లో వేలాడగట్టాలి. 200 గ్రా. గుళికలను కిలో ఇసుకలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 100 గ్రా. చొప్పున తీసుకొని చిన్న, చిన్న రంధ్రాలు పెట్టినగుడ్డలో మూట గట్టాలి. 3 – 5 మీటర్ల దూరంలో కర్రలు పాతి వాటికి వేలాడ గట్టాలి.ఈ గుళికల ఘాటు వాసన పందులు పంట వాసనను పసిగట్టకుండా గందరగోళపరుస్తాయి. కాబట్టి పొలంలోకి రావు.

కోడిగుడ్డు ద్రావణం పిచికారీ: పంట చుట్టూ అడుగు వెడల్పున నేలపై గడ్డిని తవ్వేసి.. కోడిగుడ్డు ద్రావణాన్ని పిచికారీ చేస్తే పొలంలోకి పందులు రావు. కుళ్లిన లేదా మామూలు కోడిగుడ్లను పగలగొట్టి ఒక పాత్రలో పోసుకోవాలి. 25 మి.లీ. కోడిగుడ్డు ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పొలం చుట్టూ పిచికారీ చేయాలి.

పంది కొవ్వు + గంధకం పూత: పొలం చుట్టూ 3 వరుసల నిలువు కంచె మాదిరిగా కొబ్బరి తాళ్లు కట్టాలి. పంది కొవ్వులో గంధకాన్ని 3:1 నిష్పత్తిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని తాళ్లకు పూయాలి. పందులైనా ఇతర జంతువులైనా ఒక గుంపు ఉన్న చోటకు మరొక గుంపు రావు. పంది కొవ్వు–గంధకం వాసన తగలగానే ఇక్కడ వేరే గుంపు ఉందని భ్రమపడి పందులు వెళ్లిపోతాయి.

వెంట్రుకలు: మనుషులు క్షవరం చేయించుకున్నప్పుడు రాలే వెంట్రుకలు తీసుకువచ్చి.. పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పున వేయాలి. గడ్డిని చెక్కి శుభ్రం చేసిన నేలపై వెంట్రుకలు వేయాలి. అడవి పందులు ముట్టెతో వాసన చూసినప్పుడు ఈ వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి గుచ్చుకుంటాయి. దాంతో వెనుదిరిగి వెళ్లిపోతాయి.

కోతులకు తిండి పెట్టటం మానితే 30% పంట నష్టం తగ్గుతుంది!
తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు అడవి పందులతోపాటు కోతుల బెడద ఎక్కువగా ఉంది. వీటి సంతతి వేగంగా పెరుగుతుండటంతో పంట నష్టం ఏటేటా పెరుగుతున్నది. అడవుల్లో, రోడ్ల పక్కన వివిధ రకాల పండ్ల చెట్లను అభివృద్ధి పేరిట నరికివేస్తుండటం వల్ల కోతులు ఆహారం కోసం పంటల మీదకు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రజల్లో కొన్ని రకాల సెంటిమెంట్ల కారణంగా కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తినిపించడం కూడా కోతుల సంతతి తామరతంపరగా పెరిగి సమస్యాత్మకంగా తయారవుతున్నదన్నది నిపుణుల మాట. కోతులకు మనుషులు ఆహారం వేయటం మానేస్తే వీటి మూలంగా జరుగుతున్న పంట నష్టం 30% మేరకు తగ్గిపోతుందని గత రెండేళ్లుగా ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్న ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యశాస్త్రవేత్త డా. వాసుదేవరావు చెప్పారు.

మన ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కోతులకు తోక పొట్టిగా, ముడ్డి ఎర్రగా ఉంటుంది. ఆగస్టు – అక్టోబర్‌ నెలల మధ్య ఇవి పిల్లలను పెడుతూ ఉంటాయి. ఆడ కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వీటి సంతతి వేగంగా పెరగటానికి ప్రధాన కారణమవుతోంది. సాధారణంగా ఒక మగ కోతికి 2.8 ఆడ కోతుల చొప్పున ఉండాలి. కానీ, తాము నిర్వహించిన సర్వేలో ప్రతి మగ కోతికి 6.7 ఆడకోతులు ఉన్నాయని తేలినట్లు డా. వాసుదేవరావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

కోతులు తినని పంటలు: కోతుల బెడద బాగా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాటికి నచ్చని పంటలను సాగు చేయటం మేలని డా. వాసుదేవరావు సూచిస్తున్నారు. పసుపు, అల్లం, కంద, చేమగడ్డ, బంతి, మిర్చి, ఆవాలు, సజ్జ వంటి పంటల జోలికి కోతులు రావని ఆయన తెలిపారు. ఇతర పంటలను సాగు చేసే రైతులు కోతులు తినని పంటలను సరిహద్దు రక్షక పంటలుగా వత్తుగా కొన్ని సాళ్లు వేసుకోవటం వల్ల ప్రయోజనం ఎంత వరకూ ఉంటుందన్న కోణంలో అధ్యయనం జరుగుతోంది.

రోడ్ల వెంట చెట్ల నరికివేతతో సమస్య తీవ్రం..: మన పూర్వీకులు రోడ్లకు ఇరువైపులా నేరేడు, చింత, మద్ది, రావి తదితర పండ్ల జాతులు, మోదుగ, బూరుగ వంటి మకరందాన్ని అందించే పూల చెట్లను ఎంతో ముందు చూపుతో నాటేవారు. ఆ చెట్లపై ఆధారపడి కోతులు ఆకలి తీర్చుకుంటుండేవి. అయితే, రోడ్ల విస్తరణలో భాగంగా మన ముందు తరాల వారు నాటిన పెద్ద చెట్లన్నిటినీ నరికేశాం. అదే విధంగా అడవిలో కూడా పెద్ద మాన్లు నరికివేతకు గురయ్యాయి. చిన్న చెట్లతో కూడిన అడవులే పల్చగా మిగిలాయి. దీంతో కోతులకు చెట్ల ద్వారా ఆహారం లభించక పంటల మీదే ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి వచ్చిందని డా. వాసుదేవరావు అంటున్నారు.

హరితహారం, సామాజిక అడవుల పెంపకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతర పరాయి ప్రాంతపు వృక్ష జాతులకు బదులు సంప్రదాయక పండ్ల జాతుల మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన సూచిస్తున్నారు. వాణిజ్యదృష్టితో టేకు, యూకలిప్టస్‌ వంటి మొక్కలను నాటడం కన్నా పండ్లు, పూల జాతి చెట్లను ఎక్కువగా పెంచి, కోతులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. ప్రణాళికలన్నీ మనుషుల ఆర్థిక అవసరాలు, సౌలభ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచిస్తున్నారని.. సకల జీవరాశి మనుగడను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ఆయన సూచన.

సోలార్‌ ఫెన్సింగ్‌: కోతులు, అడవి పందులు పంటను పాడు చేయకుండా పొలం చుట్టూ జీఏ వైరుతో సోలార్‌ ఫెన్సింగ్‌ వేసుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న పొలాలకు ఇది ఉపకరిస్తుంది. ఇది షాక్‌ కొడుతుంది, అయితే చనిపోయే అంత తీవ్రత ఉండదు. కాబట్టి, జంతువులు బెదిరి పారిపోతాయి. ఎకరానికి రూ. 15 వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్తనాదాల యంత్రాన్ని కూడా ఈ సోలార్‌ ఫెన్సింగ్‌కు అనుసంధానం చేసే యోచన ఉందని డా. వాసుదేవరావు తెలిపారు.

కోతులను, పక్షులను పారదోలే గన్‌: కోతులను, పక్షులను బెదరగొట్టి పారదోలటానికి నల్లని పెద్ద తుపాకీని డా. వాసుదేవరావు రూపొందించారు. అనేక పరీక్షల అనంతరం, ప్రయోగాత్మకంగా వాడి చూసిన రైతుల అనుభవాలను బట్టి దీన్ని మెరుగుపరుస్తున్నారు. కోతుల మీదకు ఈ తుపాకీతో పేపర్‌ బాల్స్‌ను ప్రయోగిస్తే.. దాని నుంచి పెద్ద శబ్దం వస్తుంది. బాల్స్‌ దెబ్బ తిన్న కోతులు మళ్లీ ఆ పొలం వైపు రావని చెబుతున్నారు. ప్రయోగాలు పూర్తయిన తర్వాత రైతులకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.

అడవి పందులు కోతుల లెక్కలు తీయాలి
అడవి పందులు, కోతులు తదితర అటవీ జంతువులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం మనుషులమే. కాబట్టి వాటి ఆవాస ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ ఆహార పంటలను పండిస్తూ వన్య జీవుల పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా గుర్తించి నిర్వర్తించటం మన కర్తవ్యం. జంతువులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలే పద్ధతులపై పరిశోధనలు చేపట్టాం. వన్య ప్రాణులకు ముప్పు కలిగించని పర్యావరణ హిత పద్ధతులను రూపొందిస్తున్నాం. వాటికి పునరావాస ప్రాంతాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా వివిధ వన్యజాతులు మనుగడ సాగించడానికి అనువైన పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా రైతులోకానికి కూడా మేలు జరుగుతుంది. అభివృద్ధి పేరిట వన్యజీవుల ఆవాసాలలోకి చొచ్చుకొని పోయిన మానవులు వన్య జీవుల ఉనికిని ప్రశ్నిస్తున్నారు. సమస్త జీవకోటికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కును కాలరాసే అధికారం మానవునికి నిక్కచ్చిగా లేదు. మానవజాతి ఇప్పటికైనా వన్యజీవుల ఆవాస ప్రాంతాలను ధ్వంసం చెయ్యకుండా.. వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలి.. అడవి పందులు, కోతులు ఎన్ని ఉన్నాయి? వీటి వల్ల పంటలకు జరుగుతున్న నష్టం ఎంత? వంటి విషయాలపై ఇప్పటి వరకు అధికారిక అంచనాలు అందుబాటులో లేవు. ప్రభుత్వాలు పూనికతో కచ్చితమైన గణాంకాలను సేకరిస్తే.. అడవి పందులు, కోతుల బారి నుంచి పంటలను పూర్తిగా కాపాడుకోవటం సాధ్యమవుతుంది. అడవిలో పులులు, చిరుత పులుల మాదిరిగా అడవి పందులు, కోతుల కచ్చితమైన గణాంకాల సేకరణ అసాధ్యమేమీ కాదు. గణాంకాలు సేకరిస్తే.. పంట నష్టాలను పూర్తిగా నివారించటం సాధ్యమవుతుంది.

 

ఆర్తనాదాల యంత్రం వరి పంటను కాపాడింది!
4 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశాను. పంట వేసిన 30 రోజుల తర్వాత ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదం యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి బిగించాను. అడవి జంతువుల ఆర్తనాదాలను వినిపించటం ద్వారా అడవి పందులు పంట జోలికి రాకుండా ఇది కాపాడింది. ఈ యంత్రం లేకపోతే ఎకరానికి కనీసం రూ. 5 వేల పంట నష్టం జరిగి ఉండేది.  పదేళ్ల నుంచి అడవి పందులతోపాటు కోతుల సమస్య కూడా బాగా పెరిగిపోయింది. మూసీ నదికి అటూ ఇటూ ఉన్న గ్రామాల్లో సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోవటానికి కూడా కోతుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉప్పు చేపల వాసనకు కోతులు పరారీ!
మా ఇంటి పెరట్లో జామ, మామిడి, సీతాఫలం, నిమ్మ వంటి అనేక పండ్ల చెట్లున్నాయి. కాయలను కోతులు బతకనివ్వటం లేదు. ఐదారు ఉప్పు చేపలను గుడ్డలో మూటలు కట్టి నెల క్రితం 6 చోట్ల వేలాడదీశాను. కోతులు ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయో అక్కడ కట్టాను. అప్పటి నుంచి కోతులు ఆప్రాంతానికి వచ్చినా మా చెట్ల మీదకు రాలేదు. ఉప్పు చేపల వాసనతో తమకు ముప్పు పొంచి ఉందని భీతిల్లి కోతులు వెళ్లిపోతున్నాయి. ఈ చేపలను వాసన తగ్గిపోయిన తర్వాత రెండు నెలలకోసారి మార్చాలి. వర్షాకాలంలో నెలకోసారి మార్చాలి… మా తోటకు అడవి పందుల బెడద ఉంది. పంది కొవ్వు+గంధకం మిశ్రమంలో తాడును ముంచి.. ఆ తాళ్లను వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న ముళ్ల కంచెకు కట్టాం. తల వెంట్రుకలను సేకరించి పొలం చుట్టూ వేసిన తర్వాత అడవి పందులు రావటం లేదు.

అడవి పందులు పంటలను బతకనివ్వటం లేదు..
ఎమ్మే, బీఈడీ చదివా. ఉద్యోగం రాలేదు. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఐదారేళ్ల నుంచి అడవి పందుల సమస్య పెరుగుతూ వచ్చింది. అడవిలో తినటానికి గడ్డల్లేక పొలాల మీదకు వస్తున్నాయి. ఏ పంట వేసినా కష్టంగానే ఉంది. మొదట్లో మొక్కజొన్న కంకులను మాత్రమే తినేవి. ఇప్పుడు వరి కంకులను, చివరికి పత్తి కాయలను కూడా నమిలేస్తున్నాయి. అన్ని ఊళ్లలో వీటి సంఖ్య బాగా పెరిగిపోయింది. సంవత్సరం క్రితం శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదాల యంత్రాన్ని 8 ఎకరాల వరి పొలంలో పెట్టా. అడవి పందులు రాలేదు. పొలం చుట్టూ వేసుకోవటానికి ఫెన్సింగ్‌ జాలీని ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వాలి. కొరకరాని కొయ్యలుగా మారిన అడవి పందులను చంపటమే శాశ్వత పరిష్కారం.

Credits : https://www.sakshi.com/news/family/wild-pigs-and-monkeys-get-sick-946246

నారు నాణ్యతే రైతుకు రొక్కం!

Technical Visit to Centre Of Excellence, Jeedimetla, Telangana

జీడిమెట్లలోని ఉద్యాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా రైతాంగానికి విశిష్ట సేవలు

నెలకు 12 లక్షల వైరస్‌ బెడద లేని నారు సరఫరా

పాలీహౌస్‌లు, షేడ్‌నెట్‌హౌస్‌ సాగుపై రైతులు, అధికారులకు శిక్షణ

వేస్ట్‌ డీకంపోజర్‌తో నులిపురుగుల సమస్యకు చెక్‌

ఇంటిపంటల సాగుదారులకూ సేవలు

సాగు పద్ధతి ఏదైనప్పటికీ రైతు మంచి ఉత్పాదకత, అధిక నికరాదాయాన్ని ఆర్జించాలంటే.. విత్తనం.. ఆ విత్తనంతో తయారైన నారు కూడా అత్యంత ఆరోగ్యవంతంగా ఉండాలి. వైరస్‌ వంటి రుగ్మతల్లేని నారును సమకూర్చుకోవటం ప్రాథమిక అవసరం. ఈ అవసరాన్ని తీర్చే ఉదాత్త లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ హైదరాబాద్‌ శివారులో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను నెలకొల్పింది. గత పది నెలలుగా లక్షలాది సంఖ్యలో పూలు, కూరగాయ పంటలకు సంబంధించి నాణ్యమైన నారును రైతులకు అందించింది. వందలాది మంది రైతులు, అధికారులు శిక్షణ పొందారు.  కూరగా యలు, పూల సాగులో ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని రైతులకు అందిస్తున్న అరుదైన నైపుణ్య కేంద్రంపై ప్రత్యేక కథనం..

తెలంగాణ ఉద్యాన శాఖ హైదరాబాద్‌ శివారులో (జీడిమెట్ల గ్రామం పైపుల రోడ్డులో) పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’ పది నెలలుగా ఉద్యాన రైతులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నది. 8 పాలీహౌస్‌లు, 6 వాకింగ్‌ టన్నెల్స్, షేడ్‌నెట్‌ హౌస్‌లు ఉన్నాయి. వీటిలో జెర్బర, కార్నేషన్, ఆర్కిడ్స్‌ తదితర ఖరీదైన పూలు, క్యాప్సికం, టమాటో, కీరదోస, బ్రకోలి, చెర్రీ టమాటోలు, ఆకుకూరలను అత్యాధునిక రసాయనిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కొన్ని పంటలను పురుగుమందులు చల్లకుండా సాగు చేస్తున్నారు.

నెలకు 12 లక్షల నారు సరఫరా
2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన స్వయం నియంత్రిత హరితగృహం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్లగ్లింగ్స్‌ నర్సరీ పద్ధతిలో చీడపీడలు, వైరస్‌ సోకకుండా అత్యాధునిక సదుపాయాల మధ్య నెల రోజులు పెంచిన నాణ్యమైన నారును రైతులకు అందిస్తున్నారు. రసాయనిక/సేంద్రియ పద్ధతుల్లో లేదా పాలీహౌస్‌లు/షేడ్‌నెట్‌ హౌస్‌లు, సాధారణ పొలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఈ నారును తీసుకెళ్తు్తన్నారు. నెలకు 12 లక్షల నారును అందించే సామర్థ్యం ఉంది. దీన్ని 15 లక్షలకు పెంచే సన్నాహాలు చేస్తున్నారు.

ముందే చెల్లించాలి
ఈ హైటెక్‌ ఆటోమేటెడ్‌ గ్రీన్‌హౌస్‌లో పెంచిన నారును రెండు పద్ధతుల్లో రైతులకు అందిస్తున్నారు. క్యాప్సికం, బంతి, టమాటో పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు తెచ్చి ఇచ్చి, మొక్కకు 60 పైసల చొప్పున సర్వీసు చార్జిగా చెల్లిస్తే.. నెల రోజులు పెంచిన రోగరహితమైన నాణ్యమైన నారును సరఫరా చేస్తారు. సేంద్రియ, రసాయనిక సేద్యం చేసే రైతులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సాధారణ రకాల నారు కావాలనుకునే రైతులు విత్తనాలు తెచ్చి ఇవ్వనవసరం లేదు. మొక్కకు 75 పైసల చొప్పున డబ్బు చెల్లించి తమకు కావాల్సిన రకం నారును నెల రోజుల తర్వాత నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి వచ్చి తీసుకెళ్లవచ్చు. టమాటో, వంగ, పచ్చిమిరప, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యాప్సికం, కాకర, బీర తదితర కూరగాయ పంటలకు సంబంధించిన మేలైన నారు మొక్కలను రైతులు పొందడానికి అవకాశం ఉంది. పాలీహౌస్‌లు, షేడ్‌నెట్‌ హౌస్‌లలోనే కాదు.. ఆరుబయట పొలాల్లో పంటలు సాగు చేసే రైతులు సైతం ఈ మొక్కలను వాడుతుండటం విశేషం.

వేస్ట్‌ డీకంపోజర్‌తో నులిపురుగులకు చెక్‌!
కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం రూపొందించిన వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో పంటలకు వాడుతున్నారు. ఈ కేంద్రంలో వంద మంది రైతులకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చారు. మట్టి ద్వారా పంటలకు సోకే తెగుళ్లను ఇది నివారిస్తున్నదని, నులిపురుగుల (నెమటోడ్స్‌)ను ఇది నూటికి నూరు శాతం నివారిస్తుందని రాజ్‌కుమార్‌ తెలిపారు. వేరుకుళ్లు, బూజు తెగులును నిరోధిస్తుందని, వానపాముల వృద్ధికి అనువైన సూక్ష్మ వాతావరణం కల్పిస్తుందన్నారు. కూరగాయల బెడ్‌ తయారీలోనూ వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణం ఉపకరిస్తోందన్నారు.

ఇంటిపంటల సాగుదారులకు చేదోడు
ఇళ్ల మీద సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి సైతం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సేవలందిస్తున్నది. మేడలపైన సిల్పాలిన్‌ బెడ్స్‌లో సేంద్రియ ఇంటిపంటల సాగు డెమోను ఈ కేంద్రం భవనం పైన ఏర్పాటు చేశారు. గార్డెనింగ్‌ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్యాప్సికం(మొక్క రూ.2), వంగ, టమాటో, క్యాబేజీ నారు(మొక్క రూ.2)ను, బంతి, చామంతి నారును విక్రయిస్తున్నారు. పనస, దొండ, బొప్పాయి (రెడ్‌లేడీ) మొక్కలను రూ. 20కి అమ్ముతున్నారు. కుండీలు, మట్టి+ఎరువు మిశ్రమాన్ని కూడా అందుబాటులో ఉంచారు.

గాలులను తట్టుకునే షేడ్‌నెట్‌ హౌస్‌!
తీవ్రమైన గాలులను సైతం తట్టుకొని నిలిచే కొత్త తరహా షేడ్‌నెట్‌ హౌస్‌ను బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) రూపొందించింది. దీని పైకప్పు సమతలంగా ఉండదు. ఎగుడు, దిగుడుగా ఉంటుంది. మధ్యలో నుంచి గాలి, వెలుతురు పారాడుతూ ఉంటాయి. ఎండ ఏటవాలుగా దీని లోపలి మొక్కల పైకి ప్రసరిస్తూ ఉంటుంది. దీనికి 50% మోనో షేడ్‌నెట్‌ వాడటంతోపాటు, షేడ్‌నెట్‌ను ఫ్రేమ్‌కు క్లిప్పులతో అనుసంధానం చేయటం విశేషం. ఈ సరికొత్త షేడ్‌నెట్‌ హౌస్‌ను జీడిమెట్లలోని ఉద్యాన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేశారు. వేసవి పంటగా టమాటా సాగు చేయబోతున్నారు. దీంట్లో ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లలో పంటలు సాగు చేయవచ్చు. టమాటా, క్యాప్సికం, పచ్చిమిర్చి, పుచ్చ, మస్క్‌మిలన్, వంగ, కొత్తిమీర తదితర పంటలను సాగు చేయవచ్చని, నర్సరీ పెంపకానికి కూడా ఇది అనువుగా ఉంటుందని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌చార్జ్‌ రాజ్‌కుమార్‌ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. చ. మీ.కు రూ. 500 వరకు ఖర్చవుతుందన్నారు. మేడలపైన ఇంటిపంటల సాగుకూ ఇది అనువైనదే!

నాణ్యమైన కూరగాయ పంటల నారు రైతులకు ఇస్తాం!
కూరగాయలు, పూల సాగులో తెలంగాణ రైతులను రారాజులుగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో ప్రారంభమైన పంటల కాలనీలలో కూరగాయ పంటల రైతులకు సబ్సిడీపై ఇప్పటికే 25 లక్షల నాణ్యమైన, వైరస్‌ రహిత నారును అందించాం. ప్రస్తుతం నెలకు 12 లక్షల నాణ్యమైన నారును ఉత్పత్తి చేస్తున్నాం. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా 15 లక్షలకు పెంచబోతున్నాం. మంచి కూరగాయ పంటల నారు కావాలనుకున్న రైతులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా డబ్బు చెల్లించిన రైతులకు నెల రోజుల్లో నాణ్యమైన నారు అందిస్తున్నాం. సబ్సిడీపై నారు కావాల్సిన పంటల కాలనీల రైతులు అధికారుల ద్వారా లేఖ రాయించాలి.

– గాజుల రాజ్‌కుమార్, ఇన్‌చార్జ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు coejeedimetlahyd@gmail.com

Credits : https://www.sakshi.com/news/family/technical-visit-centre-excellence-jeedimetla-telangana-948163

కునప జలానికి కేరళ పెద్దపీట

Vrikshayurveda Organic Farming - Sakshi

‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్న కునపజలం ద్రావణాన్ని సేంద్రియ సాగులో వినియోగించమని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సిఫారసు చేస్తున్నది. గత ఏడాదిన్నర కాలంగా దీనిపై అధ్యయనం చేసి, సంతృప్తికరమైన ఫలితాలు పొందిన తర్వాత కేరళ శాస్త్రవేత్తలు దీని వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల గ్రేటర్‌ నోయిడాలో ముగిసిన ప్రపంచ సేంద్రియ మహాసభలో ఏర్పాటైన కేరళ ప్రభుత్వ స్టాల్‌ను సందర్శించిన వారికి కునపజలం గురించి ప్రత్యేకంగా వివరించడం విశేషం. కునప జలాన్ని రెండు పద్ధతుల్లో తయారు చేయవచ్చు. మాంసం/గుడ్లతో ‘నాన్‌ హెర్బల్‌ కునపజలం’.. పశువులు తినని కలుపు మొక్కల ఆకులతో ‘హెర్బల్‌ కునపజలం’ తయారు చేసి వాడుకోవచ్చని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది...

నాన్‌ హెర్బల్‌ కునపజలం
కావలసిన పదార్థాలు: మాంసం/చేపలు : 2 కిలోలు లేదా 25 కోడిగుడ్లు; ఎముకల పొడి : 1 కిలో; వరి పొట్టు : 1 కిలో; కొబ్బరి చెక్క : 1 కిలో; మొలకెత్తిన మినుములు: అర కిలో (మినుముల మొలకలు దొరక్కపోతే పెసల మొలకలు వాడొచ్చు); నీరు : 85 లీటర్లు; తాజా ఆవు పేడ (దేశీ ఆవు పేడ శ్రేష్టం) : 10 కిలోలు; దేశీ ఆవు మూత్రం : 15 లీటర్లు; తేనె : పావు కిలో; నెయ్యి : పావు కిలో ; బెల్లం : 2 కిలోలు; పాలు : 1 లీటరు

తయారీ పద్ధతి : ఐదు లీటర్ల నీటిలో మాంసం లేదా చేపలు లేదా కోడిగుడ్లు + ఎముకల పొడి + వరి పొట్టు + కొబ్బరి చెక్క + మొలకెత్తిన మినుములను వేసి ఉడకబెట్టాలి. ఇనప పాత్రను, ఇనప గంటెను వాడాలి. నీరు సగానికి తగ్గే వరకు ఉడకబెట్టాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దింపి, చల్లారబెట్టాలి. చల్లారిన ద్రావణాన్ని ఒక ప్లాస్టిక్‌ డ్రమ్ములోకి పోయాలి. తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం, తేనె, బెల్లం, నెయ్యి, పాలతోపాటు మిగిలిన 80 లీటర్ల నీటిని కూడా ప్లాస్టిక్‌ డ్రమ్ములో పోయాలి. ఈ ద్రావణాన్ని వెదురు కర్రతో రోజుకు మూడు సార్లు మూడేసి నిమిషాల పాటు కలియతిప్పండి. సవ్యదిశలో కొంత సేపు, వ్యతిరేక దిశలో మరికొంత సేపు తిప్పాలి. ఇలా 15 రోజులు ఇలా కలియతిప్పిన తర్వాత ‘నాన్‌ హెర్బల్‌ కునపజలం’ వాడకానికి సిద్ధమవుతుంది. లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల కునపజలాన్ని కలిపి.. ఆ ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేయాలి.

ప్రయోజనాలు: దీన్ని చల్లిన తర్వాత పంట మొక్కలకు, చెట్లకు వేరు వ్యవస్థ పటిష్టమవుతుంది. కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. పండ్ల చెట్లపై పిచికారీ చేస్తే పండ్ల రుచి పెరుగుతుంది. పండ్లు, కూరగాయల రుచి, వాసన, నాణ్యత మెరుగుపడతాయి. పూల రంగు మెరుగై, ఆకర్షణీయంగా అవుతాయి.
ఉపయోగించేదెలా? : పంటలు పిలక దశలో, పూత దశలో లీటరు నీటికి 50 ఎం.ఎల్‌. కునపజలాన్ని కలిపి పిచికారీ చేయాలి. తోటలపై ఇదే మోతాదులో ఏడాదికి ఆరుసార్లు పిచికారీ చేయాలి.

హెర్బల్‌ కునపజలం
పశువులు తినని జాతి మొక్కల ఆకులతో హెర్బల్‌ కునపజలం తయారు చేసుకోవాలి. ఆకులు తుంచినప్పుడు పాలు కారని జాతులు, గడ్డి జాతికి చెందని మొక్కల ఆకులు వాడాలి. వావిలి, రేల, కానుగ, అడ్డసరం, టక్కలి, కుక్క తులసి (అడవి తులసి), గాలి గోరింత, గిరిపుష్టం (గ్లైరిసీడియా) తదితర జాతుల మొక్కల ఆకులు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు : ఆకులు  : 20 కిలోలు; దేశీ ఆవు తాజా పేడ : 10 కిలోలు; మొలకెత్తిన మినుములు : 2 కిలోలు; బెల్లం : 2 కిలోలు; దేశీ ఆవు మూత్రం : 15 లీటర్లు ; నీరు : 180 లీటర్లు

తయారీ పద్ధతి : సేకరించిన ఆకులను కత్తిరించి ఈనెలను తీసేయండి. ఆకుల ముక్కలను, పైన చెప్పుకున్న పదార్థాలను ఒక డ్రమ్ములో నాలుగు, ఐదు పొరలుగా వేయండి. 180 లీటర్ల నీరు డ్రమ్ములో పోయండి. వెదురు కర్రతో రోజుకు రెండు సార్లు 3 నిమిషాల పాటు.. సవ్యదిశలో కొంత సేపు, అపసవ్య దిశలో మరికొంత సేపు కలియతిప్పండి.  15 రోజుల తర్వాత వాడకానికి హెర్బల్‌ కునపజలం సిద్ధమవుతుంది.

పిచికారీ పద్ధతి :  వార్షిక పంటలు పిలక దశలో, పూత దశలో లీటరు నీటికి 50 ఎం.ఎల్‌. చొప్పున కునపజలాన్ని కలిపి పిచికారీ చేయాలి. తోటలపై ఇదే మోతాదులో ఏడాదికి ఆరుసార్లు పిచికారీ చేయాలి.

గమనిక: కేరళ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, యువ రైతు అయిన సూరజ్‌ పప్పుధాన్యాల పిండితో తయారు చేసిన కునప జలాన్ని వాడుతున్నారు. మాంసం, గుడ్లు లేదా ఆకులకు బదులు పప్పుధాన్యాల పిండిని ఆయన వాడుతున్నారు. సూరజ్‌ను 085475 70865 నంబరులో సంప్రదించవచ్చు.

సేంద్రియ పంటలు..నిర్ధారిత సాగు పద్ధతులు!
సంపూర్ణ సేంద్రియ సేద్య రాష్ట్రంగా కేరళను తీర్చిదిద్దాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ దిశగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మాణాత్మక కృషి చేపట్టింది. వివిధ పంటల సేంద్రియ సాగు పద్ధతులపై విస్తృత పరిశోధనల అనంతరం ‘ప్యాకేజ్‌ ఆఫ్‌ ప్రాక్టీసెస్‌ రికమెండేషన్స్‌ (ఆర్గానిక్‌) క్రాప్స్‌ –2017’ పేరిట 328 పేజీల సమగ్ర సంపుటిని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసింది. వరి, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలు, కలప పంటలు, పత్తి సహా అనేక పంటల సేంద్రియ సాగుకు అనుసరించాల్సిన పద్ధతులు.. కషాయాలు, ద్రావణాల తయారీ, మోతాదు, వాడే పద్ధతులు.. సేంద్రియ పద్ధతుల్లో పశువుల పెంపకం.. మేడలు మిద్దెలపై సేంద్రియ ఇంటిపంటల సాగు తదితర అంశాలను సమగ్రంగా ఇందులో పొందుపరిచారు. గ్రేటర్‌ నోయిడాలో ఇటీవల జరిగిన ప్రపంచ సేంద్రియ మహాసభలో ఏర్పాటైన కేరళ ప్రభుత్వ స్టాల్‌లో ‘ప్యాకేజ్‌ ఆఫ్‌ ప్రాక్టీసెస్‌ రికమెండేషన్స్‌ (ఆర్గానిక్‌) క్రాప్స్‌ –2017’ పుస్తకాన్ని విక్రయించారు. ధర రూ. 300 (పోస్టేజీ అదనం). పోస్టు ద్వారా తెప్పించుకోదలచిన వారు సంప్రదించాల్సిన చిరునామా:

Director of Extention,
Kerala Agricultural University,
KAU Main Campus,
KAU P.O., Vellanikkara, NH- 47
Thrissur, Kerala – 680656
Phone No: 0487-2438011.

Credits : https://www.sakshi.com/news/family/vrikshayurveda-organic-farming-952397

భూమి బాగుంటేనే రైతు బాగుండేది!

The farmer would be good if the land was good! - Sakshi

నాలుగేళ్లుగా మామిడి తోటలో దుక్కి చేయలేదు

సొంత విత్తనంతోటే వరి సాగు

ప్రకృతి సేద్యంతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు రాములు

ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పెరుగుతున్న  పెట్టుబడులతో రైతులకు ఆదాయం రాక, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వ్యవసాయం అంటేనే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఉన్న వనరులతోనే అధిక నికరాదాయం పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయదారుడు మిట్టపెల్లి రాములు. భూమిని రసాయనాలతో పాడు చేయటం మాని.. జీవామృతంతో సారవంతం చేస్తే వ్యవసాయదారుడి జీవితం ఆనందంగా ఉంటుందని చాటిచెబుతున్నారు.

నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతు సంతోషంగా ఉంటాడనడానికి మిట్టపెల్లి రాములే నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌  మండలంలోని తుంగూర్‌ గ్రామమే రాములు స్వస్థలం. దుబాయ్‌ వెళ్లి 15 ఏళ్లు కార్మికుడిగా పనిచేసి 20 ఏళ్ల క్రితమే తిరిగి వచ్చారు. అప్పట్లోనే గ్రామంలో దాదాపు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిని చదును చేయించి, 10 ఎకరాల మామిడి తోటలో 600 చెట్లు నాటారు. రెండెకరాల్లో వరిని రసాయనిక పద్ధతిలో సాగు చేశారు. రెండు బావులు తవ్వారు.

బంగెనపల్లి, దశేరి, హిమాయత్, కేసరి వంటి మామిడి చెట్లతోపాటు ఉసిరి, జామ, బొప్పాయి, బత్తాయి, మునగ తదితర చెట్లు ఉన్నాయి. ‘సాక్షి సాగుబడి’ ద్వారా పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలుసుకొని, కరీంనగర్‌లో జరిగిన పాలేకర్‌ శిక్షణకు హాజరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి అక్కడ కొందరు రైతుల క్షేత్రాలను పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. నాలుగేళ్లుగా అనుసరిస్తున్నారు. మామిడి తోటలకు జీవామృతాన్ని వర్షాకాలం ప్రారంభం నుంచి నెలకోమారు ఇస్తుంటారు. దోమ ఎక్కువగా ఉన్నప్పుడు అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు.

దశపర్ణ కషాయాన్ని పూత దశకు ముందు పిచికారీ చేస్తారు. అలాగే, వరి సాగుకు ముందు.. జనుము పెంచి పొలంలో కలియ దున్నుతారు. బీజామృతం తయారు చేసి విత్తనాలను విత్తనశుద్ధి చేస్తారు. నాటు వేసే ముందు ఎకరానికి క్వింటాల్‌ ఘన జీవామృతం వేస్తారు. 20 రోజులకొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తుంటారు. ఇటీవల తయారు చేస్తున్న వర్మీవాష్‌ను లేత మామిడి మొక్కలకు అందిస్తున్నారు. గతంలో 2 ఆవులను కొన్నారు. ఇప్పుడు వాటి సంతతి 20కి పెరిగాయి. ఒక్కో ఆవును ఉదయం ఓ మామిడి చెట్టు నీడన, సాయంత్రం ఓ చెట్టు దగ్గర కట్టేస్తుంటారు.

చెట్ల చుట్టూ ఉండే పచ్చిగడ్డిని తినటంతోపాటు పేడ, మూత్రం విసర్జించటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాయి. నీటి నిల్వ కోసం గుంతను తవ్వారు. జీవామృతం నేరుగా డ్రిప్‌ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా ఏనాడూ మామిడి తోటను ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నలేదు. సొంత వరి విత్తనాన్నే వాడుతున్నారు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. మర ఆడించి నేరుగా వినియోగదారులకు బియ్యం అమ్ముతున్నారు. మామిడి కాయలను తోట దగ్గరే అమ్ముతున్నారు. ఎడాపెడా ఖర్చులు పెట్టాల్సిన పని లేకుండా.. హైరానా పడకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేస్తూ.. రసాయనిక అవశేషాల్లేని దిగుబడితోపాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.

రైతును నిశ్చింతగా బతికించేది ప్రకృతి వ్యవసాయమే!
ప్రకృతి వ్యవసాయం పరిచయం అయిన తర్వాత గత నాలుగేళ్లుగా రసాయనాలు వాడలేదు. ఈ ఏడాది అందరి వరి పొలాలకు దోమ పోటు వచ్చినా మా పొలానికి ఏ చీడపీడా రాలేదు. నాలుగేళ్లుగా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. నన్ను చూసి మా గ్రామంలో నలుగురు, ఐదుగురు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే రైతు నిశ్చింతగా బతకగలిగేది. తరచూ మా తోటను సందర్శిస్తున్న రైతులకు నా అనుభవాలను పంచుతున్నాను.

– మిట్టపెల్లి రాములు (81878 23316), తుంగూరు, బీర్‌పూర్‌(మం.), జగిత్యాల జిల్లా

Credit : https://www.sakshi.com/news/family/farmer-would-be-good-if-land-was-good-954471

మట్టే మన ఆహారం!

Earthworm is the pulse of the soil - Sakshi

భూమండలాన్నిభద్రంగా చూసుకోవటం..

మన కాలి కింది నేలతోనే ప్రారంభమవుతుంది!

మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్‌ మైక్రో బయాలజిస్ట్,      ఎకో సైన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (చెన్నై) అధినేత డా. సుల్తాన్‌ ఇస్మాయిల్‌.

రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్‌ సాయిల్‌) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.

► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్‌ కార్బన్‌) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది.

► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్‌ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్‌ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి.

► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం.

► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్‌/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్‌ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్‌/కంటెయినర్‌ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్‌. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి.

► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది.

► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి.

► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం.

► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్‌)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది.

► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి.

► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్‌) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్‌ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org.

Credits : https://www.sakshi.com/news/family/earthworm-pulse-soil-958293

పుట్టగొడుగులతో పూల బాట!

Flower bush with mushrooms! - Sakshiపుట్టగొడుగుల సాగు

రోజూ ఆదాయాన్ని అందించే పుట్టగొడుగుల సాగు

ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగానికి స్వస్తిచెప్పి 20 ఏళ్లుగా గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ

గ్రామీణ యువత వ్యవసాయానికి దూరం కాకుండా ఉండాలంటే అనుదినం ఆదాయాన్నందించే పుట్టగొడుగుల సాగుపై శిక్షణ ఇవ్వటం ఉత్తమమని తలచాడు తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. తాను ప్రభుత్వోద్యోగం చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రచారం చేయటం సరికాదని గ్రహించి.. ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు! పుట్టగొడుగుల సాగే తన జీవనాధారం చేసుకుని ఇరవయ్యేళ్లుగా ఉచితంగానే శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

వ్యవసాయానికి దూరమవుతున్న గ్రామీణ యువతకు నిరంతరం ఆదాయాన్ని అందించే జీవనోపాధి చూపాలన్న తపన సుందరమూర్తిని ఉద్యోగంలో నిలవనివ్వలేదు. తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని గూడపాక్కం గ్రామానికి చెందిన ఆయన ఎమ్యే పీహెచ్‌డీ పూర్తిచేసి.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, సర్వశిక్ష అభియాన్‌ సమన్వయకర్తగా పనిచేశారు. 22 ఏళ్ల క్రితం ఒక రోజు క్లాసులో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు కొత్త తరానికి వ్యవసాయంపై ఆసక్తి లేదని గ్రహించారు.

తక్కువ ఖర్చుతో నిరంతర ఆదాయాన్ని పొందేలా వ్యవసాయం చేసే మార్గాలను గ్రామీణ యువతకు తెలియజెప్పాలని తలపెట్టాడు. తాను చీకూ చింతా లేని ఉద్యోగం చేసుకుంటూ ఎదుటి వారికి వ్యవసాయం గురించి చెప్పటం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలో ఉద్యోగాన్ని కూడా వదిలెయ్యాలన్న ఆలోచన వచ్చింది. భార్య మీనాక్షికి చెప్పటంలో ‘పిల్లలు లేరు. ఆర్థిక భద్రత ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తానంటే ఎలా’ అని ఆమె ప్రశ్నించారు.

చివరికి ఆమెను ఒప్పించి.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే సాయంత్రం సమయంలో పుట్టగొడుగుల సాగుపై అవగాహన పెంచుకోవడంపై దృష్టి సారించారు. పట్టణవాసులు పుట్టగొడుగుల వాడకంపై ఆసక్తి కనపరుస్తున్నందున ఈ రంగాన్ని ఎంచుకోవచ్చని నిర్ధారణకు వచ్చి1997లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని సుందరమూర్తి వివరించారు. ప్రభుత్వ సబ్సిడీ పొంది రూ. 70 వేలతో రెండు ప్రత్యేక షెడ్‌లను ఏర్పాటు చేసుకుని.. అనుభవజ్ఞుల సాయంతో పుట్టగొడుగుల సాగులో మెళకువలను నేర్చుకున్నారు. ఎక్కువ డిమాండ్‌ వుండే పాలపుట్టగొడుగు, చిప్పి పుట్టగొడుగుల సాగు చేయడంతో పాటు విత్తనాలను ఉత్పత్తి చేసి విక్రయించారు. మరోవైపు యువతకు ఉచితంగానే శిక్షణ ఇచ్చారు.

చిప్పి రకం పుట్టగొడుగులు రుచి ఎక్కువగా వుంటుంది. మసాల పెద్దమొత్తంలో వేసినా వాటిని పీల్చుకునే శక్తి ఎక్కువ. మృదువుగానూ ఉంటుంది. ఈ రకమైన పుట్టగొడుగుల సాగు కోసం ప్రత్యేకంగా మరో  షెడ్‌ను ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లోనే చేస్తుండడంతో, తమ పుట్టగొడుగులను కొనడానికి  ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో వచ్చే ఆర్డర్‌లను తీసుకుని డోర్‌డెలివరీ కూడా ఇస్తుండటంతో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. భార్య మీనాక్షి తోడ్పాటుతో ప్రస్తుతం సుందరమూర్తి నెలకు 600 కేజీల నుండి 4 వేల కేజీల వరకు పుట్టగొడుగులను విక్రయిస్తున్నారు. నెలకు రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతుండటం విశేషం.

యువతకు శిక్షణ ఇవ్వడంలోనే సంతృప్తి!
ముళ్ళ బాటను దాటితేనే పూల బాట వస్తుంది. సవాళ్ళను ఎదుర్కోకుండానే సక్సెస్‌ ఎలా అవుతాం అని ప్రశ్నించుకున్నా. కష్టమో నష్టమో వ్యవసాయం చేయాలనుకుని ఉద్యోగం వదిలేశాక.. మళ్ళీ వెనుకడుగు వేయలేదు. మొదట్లో కొంత భయపడ్డా తరువాత కుదురుకున్నా. ప్రతి నెలా వందలాది మంది రైతులకు, యువకులకు ఇరవయ్యేళ్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. పుట్టగొడుగుల సాగు చేయడం కన్నా వేలాది మంది యువతకు శిక్షణ ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తున్నది.
– సుందరమూర్తి, గూడపాక్కం, తిరువళ్లూరు,
తమిళనాడు   sundar1967@gmail.com
(వివరాలకు – రాజపాల్యం ప్రభు, 9655880425)
– కోనేటి వెంకటేశ్వర్లు, సాక్షి, తిరువళ్లూరు, తమిళనాడు


సంచితో వుంచిన పుట్టగొడుగులవిత్తనాలు, పుట్టగొడుగు

credits : https://www.sakshi.com/news/family/flower-bush-mushrooms-960507

ఉద్యోగం కన్నా ప్రకృతి సేద్యం మిన్న

Nature Farming is better than job - Sakshiరేగుమొక్కల కాయలను పరిశీలిస్తున్న వేణుగోపాలనాయుడు

ప్రకృతి సేద్యపద్ధతిలో 4 ఎకరాల్లో పశుగ్రాసం, ఎకరంలో వరి,15 సెంట్లలో యాపిల్‌ బెర్‌ సాగు

తక్కువ ఖర్చుతో సంతృప్తికరమైన ఆదాయం

ఇంటికి దూరంగా వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం కన్నా ఇంటి పట్టునే ఉండి సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకోవడమే మిన్న అని భావించాడా యువకుడు. అతని పేరు కె. వేణుగోపాలనాయుడు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కె. సీతారాంపురం గ్రామం అతని స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణు మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన తర్వాత వైజాగ్‌లో ఆర్నెల్లు ఉద్యోగం చేశారు. ఈ లోగా తమ లచ్చయ్యపేటలోని చెరకు ఫ్యాక్టరీ ఆవరణలో సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు జరగడంతో తండ్రి రత్నాకర్‌తో కలసి ఆసక్తిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రికి తోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలని వేణు నిర్ణయించుకున్నారు.

ఆ విధంగా 9 నెలల క్రితం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 4 ఎకరాల్లో కో–4, కో–3 పశుగ్రాసం, ఎకరంలో వరి, 15 సెంట్లలో యాపిల్‌ బెర్‌ను సాగు చేయడం ప్రారంభించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం నుంచి సహాయం పొందారు. సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో పశుగ్రాసం నారును 4 నెలల క్రితం నాటారు. వారం, పది రోజులకోసారి స్వయంగా తానే తయారు చేసుకునే జీవామృతాన్ని డ్రిప్‌ ద్వారా అందిస్తున్నారు.  ఎకరంలో పెంచే పశుగ్రాసాన్ని ఇతర రైతులకు చెందిన 8 పాడి పశువులకు పచ్చిమేతగా కిలో రూ.1 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 9వేల కౌలు, రూ. 40 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తున్నదని తెలిపారు.

రెండేళ్ల వరకు ఇలా రైతులకు పచ్చిమేత ఇవ్వాల్సి ఉంటుందని, పదేళ్ల వరకు పచ్చిగడ్డి వస్తూనే ఉంటుందని వేణు తెలిపారు. తెలిసిన రైతు దగ్గర నుంచి 40 ఆపిల్‌ బెర్‌ మొక్కలు తెచ్చి ఎటు చూసినా 8 అడుగుల దూరంలో 15 సెంట్లలో నాటుకున్నారు. తొలి కాపుగా చెట్టుకు 3–5 కిలోల నాణ్యమైన ఆపిల్‌ బెర్‌ పండ్ల దిగుబడి వచ్చింది. జీవామృతం క్రమం తప్పకుండా డ్రిప్‌ ద్వారా ఇస్తున్నారు. పురుగు కనిపించినప్పుడు అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం పిచికారీ చేశారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ పండ్లు రుచిగా ఉన్నాయన్నారు. తొలి పంట కాబట్టి అందరికీ పంచిపెట్టానని తెలిపారు. నీలగిరి మొక్కల వల్ల పొలం పాడవుతున్నదని గ్రహించి, ఆ మొక్కలను పీకించి చెరువు మట్టి తోలించారు. ఎకరంలో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి పంట కావడంతో 18 (80 కిలోలు) బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని వేణు తెలిపారు. ఇతరులు ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7–8 వేలు ఖర్చు చేశారని, తనకు రూ. వెయ్యి వరకు ఖర్చయిందని తెలిపారు. మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం తొలి ఏడాది కూడా తమకు లాభదాయకంగానే ఉందని, మున్ముందు దిగుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు యువ రైతు వేణు(96403 33128) సంతృప్తిగా తెలిపారు.

– పోల కోటేశ్వరరావు, సాక్షి, సీతానగరం, విజయనగరం జిల్లా

Credits : https://www.sakshi.com/news/family/nature-farming-better-job-1038143

కళాత్మక వరి పొలం!

Artful rice field! - Sakshi

అగ్రి టూరిజం

చేస్తున్న పనికి కళను, సృజనాత్మకతను జోడిస్తే చాలు.. అద్భుతమైన కళాకృతులు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఈ సూత్రం కేన్వాసుకే కాదు.. పొలానికి కూడా వర్తిస్తుంది! వరి పొలానికి కళాకాంతులు అద్దితే.. అది సందర్శకులను ఆకర్షించే పర్యాటక స్థలంగా మారిపోతుంది. జపాన్‌లోని ఇనకటడె అనే గ్రామం రైస్‌ పాడీ ఆర్ట్‌కు పెట్టింది పేరు. డజన్ల కొద్దీ రంగు రంగుల దేశీ వరి వంగడాలను భారీ కళాకృతుల రూపంలో నాటి సాగు చేయడంతో పచ్చని వరి పొలాలు పర్యాటక స్థలాలుగా మారి కాసులు కురిపిస్తున్నాయి.

ఈ అగ్రి టూరిజం టెక్నిక్‌.. మహారాష్ట్రలోని దొంజె ఫట అనే గ్రామాన్ని సైతం పర్యాటక కేంద్రంగా మార్చి వేసింది. జపాన్‌లో సంచలనం సృష్టిస్తున్న పాడీ ఆర్ట్‌ గురించి ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకున్న.. పుణేకి చెందిన శ్రీకాంత్‌ ఇంగాల్‌హలికర్‌ అనే ఇంజనీర్‌ తన ఐదెకరాల వరి పొలంలో 40 మీటర్ల భారీ వినాయకుడు, తదితర కళాకృతులను రూపొందించారు. ఆకుపచ్చని వరి పొలంలో నల్లగా ఉండే వరి మొక్కలను నాటడం ద్వారా ఆహ్లాదకర దృశ్యాన్ని ఆవిష్కరించారు.

credits : https://www.sakshi.com/news/family/artful-rice-field-1043080