సేంద్రియ సాగులో సాఫ్ట్‌వేర్‌ హరికృష్ణ

ఇంజనీరింగ్‌ చదివి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా కాలం గడిపే అవకాశం వున్నా, వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని వదలకూడదనుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన దేవరపల్లి హరికృష్ణ. సేంద్రియ సేద్యం చేస్తూ రైతులోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ యువ రైతు విజయగాథ.
సర్వత్రా సేంద్రియం
రైతులు తమ కుటుంబాలకు అవసరమైన మేరకైనా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలి. బియ్యం, కూరలు సేంద్రియంగా పండిస్తే క్రమంగా రాష్ట్రమంతా సేంద్రియ సేద్యం విస్తరిస్తుంది. పుడమితల్లితో పాటు ప్రజలు కూడా ఆరోగ్యంగా వుంటారు. నేను నా పొలంలో సేంద్రియంగా పండించిన వాటినే హైదరాబాద్‌ తెచ్చుకుంటాను. సేంద్రియంతో ఖర్చులు తగ్గడంతో పాటు లాభాల కూడా పుష్కలంగా వుంటాయి.
– హరికృష్ణ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, సేంద్రియ రైతు
హైదరాబాద్‌లో మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు హరికృష్ణ. శుక్రవారం ఆఫీసు పని పూర్తయిన మరుక్షణం నుంచి ఆయన ధ్యాసంతా స్వగ్రామంలోని పొలం మీదే వుంటుంది. ఆయన అడుగులు చకచకా అటువైపు పడతాయి. పొలం చేరుకుని పైరుపచ్చల్ని చూస్తే ఆయనలో నవజీవం తొణికిసలాడుతుంది. మిగిలిన వారిలా కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనుకున్నారాయన. నేలతల్లిని కాపాడుకుంటూ లాభసాటిగా సాగు చేసేందుకు సేంద్రియమే ఏకైక మార్గమని గ్రహించారు. జిల్లాలోనే తొలిసారిగా సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. తాను పండిస్తున్న వరి, కొబ్బరి, కో-కో, పామాయిల్‌ సాగుకు పూర్తిస్థాయిలో సేంద్రియ ఎరువులను, క్రిమిసంహారకాలనే వినియోగిస్తున్నారు. సేంద్రియ సాగు కోసం దేశీ ఆవులను పెంచుతున్నారు. దేశీ ఆవుపాలతో మనం, ఆవు వ్యర్ధాలతో చేసే ఎరువులు, క్రిమిసంహారక మందులతో నేలతల్లి ఆరోగ్యంగా వుంటారంటారు హరికృష్ణ.
రైతులకు కామధేనువులు
రెండు మూడు దేశీ ఆవులతో సుమారు 25-30 ఎకరాలు వ్యవసాయం చేయవచ్చు. ఇవి ఇచ్చే పాలపై వచ్చే ఆదాయం ఆవుల పోషణకు సరిపోతుంది. దేశీ ఆవులు సేంద్రియ సాగుకు ఉత్తమం. మోపురం, గంగడోలు ఉండే జాతులు యోగ్యమైనవి. సేంద్రియ సాగులో గో మూత్రం, ఆవుపేడలను నిర్ణీత ప్రమాణాల్లో వినియోగించాలి. వీటి ద్వారా జీవామృతం, ఘనామృతం, కొన్ని రకాల ఆకులు, అలములతో క్రిమిసంహారక మందులను తయారు చేసుకోవాలి. దశాబ్దాలుగా రసాయనాల వినియోగం వల్ల భూములు నిస్సారం అయ్యాయి. ఆ పంటలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతోపాటు సాగు ఖర్చులు భారీగా పెరిగిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. సేంద్రియ ఎరువులతో నిస్సారమైన భూమిలో కూడా సిరులు పండుతాయి. క్రిమి సంహారకాల స్థానంలో గో మూత్రానికి, వివిధ రకాల ఆకులు, కాయలు కలిపి తయారుచేసిన కషాయాన్ని పంటలపై పిచికారీ చేసి చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చంటున్నారు హరికృష్ణ. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో పాటు సాగులో యంత్రాలను ఉపయోగిస్తూ కూలీల సమస్యను అధిగమిస్తున్నారు ఈ రైతు. సొంతంగా తయారుచేసుకున్న జీవామృతాన్ని ఫిల్టర్‌ బెడ్‌ల ద్వారా శుద్ధిచేసి డ్రిప్‌ ద్వారా కొబ్బరి, కో-కో, పామాయిల్‌ పంటలకు అందిస్తూ అద్భుతాలు చేస్తున్నారు ఈ యువరైతు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు చేతుల మీదుగా హరికృష్ణ సేంద్రియ సాగులో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్నారు. లాభసాటిగా సాగు చేస్తూ రైతులకు, నవ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయనకు రైతునేస్తం పురస్కారం కూడా లభించింది.
Credits : Andhrajyothi

ఆర్గానిక్ హబ్.. ఆంధ్ర

 • 1.2 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు
 • డిసెంబర్‌ 31 నుంచి మళ్లీ పాలేకర్‌ శిక్షణా శిబిరం
వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేస్తున్నది. ఎరువులు, క్రిమి సంహారకాలు ఉపయోగించి చేసే సేద్యంతో దిగుబడులు పెరిగినా ప్రజల ఆరోగ్యం, నేలతల్లి ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయి. దాంతో దేశ ప్రజలంతా ఇప్పుడు సేంద్రియ ఆహారంపై దృష్టి సారించారు. ఫలితంగా సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరగడంతో రైతులు సేంద్రియ సేద్యం వైపు మళ్లుతున్నారు. ఆహార పంటలైన వరి, మిర్చి, జొన్న, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, మినుము, పెసర, కంది వంటి అపరాల పంటలతో పాటు కూరగాయలు, ఉద్యాన పంటలన్నీ సేంద్రియంగా పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నడుంకట్టింది.
సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేస్తే తప్ప వ్యవసాయానికి మంచి భవిష్యత్తు వుండదని భావించిన ప్రభుత్వం జీరో బడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ చేపట్టింది. దీని అమలుకు ప్రకృతి సేద్య నిపుణుడు సుభాష్‌ పాలేకర్‌ను సలహాదారుడిగా నియమించింది. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసింది. మొదటి విడతలో భాగంగా 2016 – 2022 మధ్య రాష్ట్రంలోని 2వేల గ్రామాల్లో 5 లక్షల రైతులతో 5 లక్షల హెక్టార్లలో నూరుశాతం సేంద్రియ సేద్యం సాధించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా సన్న, చిన్నకారు రైతులకు కనీసం రూ.50 వేల వార్షికాదాయం లభించాలని నిర్దేశించారు.
గత ఏడాది రాష్ట్రంలో జీరో బడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ ఆచరించిన పంటల్లో పంట కోత ప్రయోగాలు నిర్వహించగా, వరి, మినుము, మిర్చి, మొక్కజొన్న 27 శాతం నుంచి 32 శాతం అధిక దిగుబడులు నమోదైనట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ప్రకృతి సేద్యం చేసిన కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు గతేడాది కరవు పరిస్థితులు నెలకొన్నా, నెల రోజుల్లో వర్షాభావ పరిస్థితులను అధిగమించామని అంటున్నారు.
వర్షాభావం, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని, సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం రైతుకు మంచి ఫలితాలు ఇస్తుందని అనేక మంది రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫిలాంద్రఫిక్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇందుకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. అలాగే కేంద్ర, రాష్ట్ర సంస్థల ద్వారా మరో రూ.700 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌కు కేవలం సాంకేతిక సహకారమే కాకుండా సేంద్రియ పదార్థాల తయారీకి తగిన వస్తువులను ఇవ్వాలని అనేకమంది రైతులు కోరుతున్నారు.
సేంద్రియ వేదికగా…
సేంద్రియ సేద్యం ద్వారా రానున్న 8 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్గానిక్‌ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనలో గతేడాది 704 గ్రామాల్లో 61వేల హెక్టార్లలో 40,656 మంది రైతులు ప్రకృతి సేద్యం వైపు దృష్టి మరల్చారు. ఈ ఏడాది 972 గ్రామాల్లో ఈ పద్ధతి అమలవుతున్నది. ఇప్పటికి లక్షా 20వేల ఎకరాల్లో లక్షా 39 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
దీని అమలు కోసం 399 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌కు ఇద్దరు కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్లు, ఒక క్లస్టర్‌ యాక్టివిస్ట్‌లను నియమించింది. సేంద్రియ వ్యవ సాయాన్ని ఆచరించి, అనుభవం గడించిన రైతులనే క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్స్‌గా రైతు సాధికార సంస్థ నియమించింది. మరో 8వేల మంది రైతులకు డిసెంబరు 31 నుంచి జనవరి 8 వరకు గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి సేద్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులు డ్వాక్రా తరహాలో స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడడం విశేషం. ప్రస్తుతం 4800 గ్రూపులు రూ.1.8 కోట్లు పొదుపు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Credits : Andhrajyothi

నారుమడిలో కలుపు నివారణ

రబీలో వరి పంటకి నారుమడి తయారీ, కలుపు నివారణకు ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రైతాంగానికి ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
 • నారుమడిని వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు దమ్ము చేసి చదును చేయాలి.
 • నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు తయారు చేసుకోవాలి.
 • ఆఖరి దమ్ములో ఐదు సెంట్లు నారుమడికి 2.2 కిలోల యూరియా, 6.25 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేటు, 1.7 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి.
 • విత్తిన 10-15 రోజుల తర్వాత పైపాటుగా 2.2 కిలోల యూరియాను నారుమడిలో చల్లుకోవాలి.
 • మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 4 నుంచి 5 కిలోల చొప్పున ఎకరానికి 20-25 కిలోలు చల్లుకోవాలి. ఆకులు బయటికి వచ్చేసరికి నారుమడికి ఆరుతడులు పెట్టి తర్వాత నీరు నిలిచేట్టు చూడాలి.
 • విత్తిన 7-9 రోజులకు ఐదు సెంట్లు నారుమడికి 75 మిల్లీలీటర్లు బెం థియోకార్బ్‌ లేదా 80 మిల్లీలీటర్లు బ్యూటాక్లోర్‌ కలుపు మందుల్లో ఒక దాన్ని నారుమడిలో నీటిని తీసివేసి 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

Credits : Andhrajyothi

ఈ యంత్రం కథే వేరు!

 • 15 పంటలు కోసే కంబైన్డ్‌ హార్వెస్టర్‌
 • తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన కంబైన్డ్‌
హార్వెస్టర్‌ రైతులను అమితంగా ఆకర్షిస్తున్నది. 15 రకాల పంటలను కోసేందుకు వీలుగా ఈ కొత్త యంత్రాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో గింజ నాణ్యతకు నష్టం కలగకుండా పంటను కోయడం దీని ప్రత్యేకత.
ఇప్పటివరకు వరి, మొక్కజొన్న వంటి పంటలు కోసేందుకు వేరు వేరు కోత యంత్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అయితే 15 పంటలను కోసేందుకు అనువుగా నూతన టెక్నాలజీతో రూపొందించిన కంబైన్డ్‌ హార్వెస్టర్‌ ఇప్పుడు రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఇది మొక్కజొన్న వంటి పంటలను కోసి, మొక్కజొన్న కంకులను నూర్పిడి చేసి మొక్కజొన్న గింజలను బయటకు తీసుకువస్తుంది. దీనివల్ల రైతులకు సమయం ఆదా కావడంతో పాటు కూలీల కొరతను అధిగమించే వీలుంది. కోతల సమయంలో పంట నష్టం కూడా చాలా తక్కువగా ఉండటం ఈ యంత్రం ప్రత్యేకత.
అడ్వాన్స్‌డ్‌ ఇంజిన్‌తో రూపొందించిన ఈ యంత్రంలోని బీటర్‌, బీటర్‌ గ్రేట్‌ అనే టెక్నాలజీ చెత్తాచెదారాన్ని ఏమాత్రం ధాన్యంలో కలవకుండా వేరు చేస్తుంది. 100 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌తోపాటు 14 అడుగుల వెడల్పుతో బ్లేడ్‌లను ఏర్పాటు చేశారు. గింజలను నిల్వ చేసుకునే ట్యాంక్‌ సామర్ధ్యం 1800 కిలోలు. ఎకరం మొక్కజొన్న పంటను కేవలం 45 నిమిషాల్లో కోసి ధాన్యం మన ముందుంచుతుంది.
వరి, మొక్కజొన్న సోయాబీన్‌, క్లస్టర్‌ బీన్‌, గోధుమలు, కందులు, శనగలు, జొన్నలు, సజ్జలు, ఆవాలు, బఠాణీలు, బార్లీ, పొద్దుతిరుగుడు, కొత్తిమీర వంటి పంటలను కోసే విధంగా ఈ మిషన్‌ను రూపొందించారు.
ఈ యంత్రాన్ని పూర్తిగా జీపీఎస్‌ టెక్నాలజీని వినియోగించి రూపొందించారు. దీంతో ఈ యంత్రం యజమాని ఇంట్లో కూర్చొనే మిషన్‌ ఎక్కడ నడుస్తుంది? ఎంతసేపు నడిచింది? ఎంత విస్తీర్ణంలో పంట కోత చేసింది? తదితర వివరాలను స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. దీని ధర రూ. 27 లక్షలు. సాధారణంగా కూలీలతో ఒక ఎకరం మొక్కజొన్న పంటను హార్వెస్టింగ్‌ చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చువుతుంది. ఈ యంత్రంతో కేవలం 45 నిమిషాల్లో పంట చేతికి వస్తుంది. కేవలం మూడు వేల నుంచి 3,500 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది.
Credits : Andhrajyothi

వరి కోత సమస్య తీరేదెలా?

వరిని కోసి, కళ్లంలో నూర్చడం ఖర్చుతో కూడుకున్న పని. వరి కోసి, ధాన్యాన్ని నేరుగా అందించే యంత్రం వున్నా దాని ధర సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులో లేదు. ఐదు లక్షలకు పైగా ఖరీదు చేసే ఆ యంత్రాన్ని చిన్నరైతులు కొనడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో వరి పండించే సన్న, చిన్నకారు రైతులకు వరికోసే ఆఽధునిక యంత్రాన్ని అద్దెకు ఇస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఆధునిక యంత్రాన్ని అద్దెపై అందించే ప్రతిపాదనలు ఏమైనా వున్నాయా?
– ఎ సన్యాశిరావు, గుమడాం, విజయనగరం
అద్దెకు ఆధునిక యంత్రం : లీలావతి, జెడీ, వ్యవసాయ శాఖ
నియోజకవర్గం స్థాయిలో ఆధునిక వరి కోత యంత్రాన్ని అందుబాటులో వుంచి, దాన్ని రైతులకు అద్దెకు ఇచ్చే అంశం పరిశీలనలో వుంది. ఈ విధానం అమలయితే సన్న, చిన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. శ్రమ తగ్గుతుంది. నాట్లు వేయటం, దక్కి దున్నటం, దమ్ముపట్టడం, కోత, నూర్పిడి పనులు పూర్తి చేయటం ఇలా అన్ని వ్యవసాయ పనులకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం యాంత్రీకరణను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా మొదట నియోజకవర్గ స్థాయిలో ఆ తరువాత మండల స్థాయిలో దశల వారీగా ఆధునిక వరికోత యంత్రాన్ని అందుబాటలోకి తెచ్చే ప్రతిపాదనలున్నాయి.
Credits : Andhrajyothi

లక్క.. లాభాలు ఎంచక్కా!

 • లక్షన్నర పెట్టుబడి.. 4 లక్షల రాబడి
 • ఉద్దానంలో ఊపిరి పోసుకున్న లక్కసాగు
శ్రీకాకుళం జిల్లా కవిటికి చెందిన రాజారావు ఉన్నతస్థాయి ప్రభు త్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. సేద్యంపై ఆసక్తితో అందరిలాగానే వరి, కొబ్బరి సాగు చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాల కారణం గా నష్టాలపాలై ప్రత్యామ్నాయంగా లక్క వైపు దృష్టి సా రించారు. కుమారుడు సాయిరాజ్‌తో కలిసి గత ఏడాది తొలి పంట తీశారు. మరో నెలలో రెండో పంటను విక్రయించనున్నారు. ఈ రైతులు జార్ఖండ్‌లోని రాంచీ నుంచి అధిక దిగుబడి ఇచ్చే శ్యామలత రకం విత్తనం తెచ్చారు. విత్తనాలను 45 రోజులు కవర్లలో వుంచితే మొక్కలు వచ్చాయి. 6 నెలలకు ఒక్కో మొక్క కు 6 కొమ్మలు వచ్చాయి. అప్పుడు చెట్టులో మూడు కొమ్మలకు గుడ్డు (బ్రూడింగ్‌) క ట్టారు.
ఈ బ్రూడింగ్‌ను రాంచీలో కొన్నా రు. అలా ఒక్కో చెట్టుకు 50 గ్రాముల చొప్పున గుడ్డు కట్టుకున్నారు. మొత్తం ఎకరాకు అయిదు వేల చెట్లు నాటి అన్నింటికీ ఇదే పద్ధతి అమలు చేశారు. ఈ గుడ్డును జనవరి-ఫిబ్రవరి, జూన్‌ -జూలై నెలల్లోనే కట్టాలి. ఇలా గుడ్డు కట్టిన పదిరోజుల తర్వాత అందులోంచి పురుగులు బయటకు వస్తాయి. అప్పుడు ఆ గుడ్డును విప్పాలి. అలా బయటకు వచ్చిన ఆడ, మగ పురుగులు మొక్క అంతటా విస్తరిస్తాయి. అప్పుడు లక్క తయారౌతుంది.
జూలైలో గుడ్డు కడితే డిసెంబరు లో లక్క పంట కోతకు వస్తుంది. సాగు మొదలుపెట్టిన తొలి ఏడాది వీరికి 3 లక్షలు ఖర్చయింది. ఖర్చులు పోను లక్షకు పైగా లాభం పొందారు. రెండో ఏడాది దిగుబడి రెట్టింపు అయింది. ఖర్చులన్నీ పోగా రూ.4 లక్షలు మిగిలింది. ఒకసారి మొక్క నాటితే పన్నెండేళ్ల వరకు పంట పండుతుంది. లక్క పంటను కోసిన తర్వాత దాన్ని సేకరించిన ఈ రైతులు జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌లోని బలరాంపురంలో విక్రయించారు. శుద్ధి చేయని కిలో లక్క ధర రూ. 200 వుంది.
బాడీ స్ర్పే.. నెయిల్‌ పాలిష్‌లో
మనం వాడే మాత్రలు ఎక్స్‌పయిరీ డేట్‌లోగా పాడవకుండా, ఫంగస్‌ ఏర్పడకుండా కాపాడడంలో లక్క పూత కీలకం. నాణ్యమైన లక్కను మాత్రలపై పూతగా వేస్తారు. కొన్ని దేశాల్లో ఆహారపదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి తింటారు. అవి పాడవకుండా లక్క రంగు కలిపి పూత వేస్తారు. గోళ్ల రంగు, బూటుపాలిష్‌లోను వాడతారు. సిల్క్‌ వస్త్రాల తయారీలోను లక్క వినియోగిస్తారు. రెడీమేడ్‌ బంగారు ఆభరణాలు, బాడీ స్ర్పేల్లో లక్కను వినియోగిస్తున్నారు. మనం బాడీ స్ర్పేను కొట్టుకుంటే ఆ రసాయనాలు ఒంటిపై పడి చర్మానికి హాని కలగకుండా చేయడానికి అందులో లక్క కలుపుతారు.
40 ఎకరాల్లో సాగు
40 ఎకరాల్లో లక్క పంట సాగుచేస్తున్నాం. మొదట్లో చాలా కష్టంగా వున్నా క్రమంగా అవగాహన పెంచుకున్నాం. ఖర్చులన్నీ పోగా మొదటి పంటలో రూ.లక్ష, రెండో పంటలో రూ.4 లక్షల వరకు మిగులు కనిపిస్తోంది. మా సమీప పొలాల రైతుల్లో చైతన్యం తెచ్చి వారితో సాగు చేయించి 250 ఎకరాల వరకు సాగు జరిగేలా ప్రణాళికలు వేస్తున్నాం.
– పిరియా రాజారావు, లక్క రైతు
Credits : Andhrajyothi

గోమూత్రం.. పెట్రోలు కంటే ప్రియం!

 • క్యాను రూ.500 పైమాటే
పల్నాడు పల్లెలు పచ్చదనాలకు నిలయాలు. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పత్తి, మిరప పంటలే సాగు చేస్తున్నారు. పంట మార్పిడి అలవాటు లేకపోవడంతో ఆ పంటలకు విపరీతంగా తెగుళ్లు ఆశిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆ పంటలకు పురుగుల మందులు వాడటం వల్ల తెగుళ్లు, పురుగుకు రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగింది. ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండడం లేదు. ఆకుముడత, బొబ్బర తెగులు, రసంపీల్చు పురుగు, కాయతొలుచు పురుగులు పంటలను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
దీంతో రైతుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతున్నది. ఒకరిద్దరు రైతులు ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధించడంతో మండలంలోని పలువురు రైతులు ఆ బాటన పట్టారు. దేశీ ఆవుల పంచకం చల్లితే తెగుళ్లు దరిచేరవని రైతులు గ్రహించారు. యర్రబాలెంలోని ఒక దేవాలయం ఆధీనంలో ఉన్న గోశాల నుంచి గోమూత్రం సేకరించి కొందరు రైతులు సత్ఫలితాలు సాధించారు.
ఆ నోటా ఈ నోటా గోమూత్రం విలువ తెలుసుకున్న పలువురు రైతులు యర్రబాలెం బాట పట్టారు. అక్కడ 20 ఆవులు మాత్రమే ఉన్నాయి. రోజంతా గోమూత్రం సేకరించినా 20 లీటర్లకు మించి రావడం లేదు. రెంటచింతల, దుర్గి, మాచర్ల మండలాలకు చెందిన పదికి పైగా గ్రామాల రైతులు క్యూ కట్టడంతో గోమూత్రం సరిపోవడం లేదు. క్యాను గోమూత్రం ధరను 500 రూపాయలుగా నిర్ణయించారు. అయినా రైతులు ఆ డబ్బు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు.
గో మూత్రంలో 24 ధాతువులు :వెంకటేశ్వర్లు, ఆత్మ బీటీఎం
గోమూత్రంలో 24 రకాల ధాతువులుంటాయి. అమ్మోనియం, రాగి, నత్రజని, గంధకం, పొటాషియం, మెగ్నిషియం వంటి ధాతువులన్నీ మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. గోవు విసర్జనలో భూమికి ఉపయోగపడే 300 నుంచి 500 కోట్ల జీవరాశులు వుంటాయి. గోమూత్రం, పేడ రైతుకు వరాలు.
Credits : Andhrajyothi

వరి సాగులో లాభాలు ఎలా?

వరి సాగు ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. రైతులను సంక్షోభంలో పడేస్తున్న ఈ సమస్యను అధిగమించడమెలా?
– పోలిశెట్టి వీరన్న, రైతు
చీడపీడలు తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు రైతులకు అందుబాటులో వున్నాయి. సార్వాలో ఎకరాకు 45 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. దాళ్వాలో 50 బస్తాల వరకు దిగుబడి సాధించారు. ఇందుకు ఎంటీయూ 1156, ఎమ్‌టీయూ 1120 వంటి నాణ్యమైన అధిక దిగుబడులను ఇచ్చే విత్తన రకాలను వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు సూచించిన రీతిలో అవసరమైన మేరకే ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల రైతులు ఖర్చులు అదుపులో వుంచుకుంటే లాభాలు పెరుగుతాయి.
– సి. భవాని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, విత్తన పరిశోధన కేంద్రం
Credits : Andhrajyothi

హైటెక్‌ రైతు దంపతులు

 • ఉద్యోగాలు వదిలి సాగుబాట
 • సేంద్రియం దిశగా అడుగులు
రైతులే వ్యవసాయం వదిలేసి పట్నాలకు తరలిపోతుంటే బెంగుళూరులో ఉద్యోగాలను, లక్షన్నర జీతాన్ని వదిలేసి స్వగ్రామంలో సేద్యం చేస్తున్నారు యువ దంపతులు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఉద్యోగాల కంటే సాగు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తామంటున్న ఆ హైటెక్‌ రైతు దంపతుల స్ఫూర్తి గాథ ఇది.
అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మారుమూల ప్రాంతం. ఈ గ్రామంలో పుట్టిన అభిలాష్‌, సుష్మ ఉన్నత చదువులు చదివారు. ఇద్దరూ బెంగుళూరులో 14 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేశారు. అభిలాష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. సుష్మ ఫార్మసిస్టు. ఇద్దరూ నెలకు రెండు లక్షల జీతం పొందేవారు.
కానీ వారి మనసు అక్కడ లేదు. క్షణం తీరికలేని ఉద్యోగాలు వద్దనుకున్నారు. ప్రశాంత జీవనానికి స్వగ్రామానికి మించిన వేదిక లేదనుకున్నారు. ఉద్యోగాలు వదిలేసి వారి స్వగ్రామమైన గుడిబండకు చేరుకున్నారు. అభిలాష్‌ తండ్రి ఓ సామాన్య రైతు. వారికి 26 ఎకరాల పొలం ఉంది. ఇందులో 12 ఎకరాలకు నీటి వసతి వుంది.
14 ఎకరాలు మెట్ట భూమి. ఇందులో చాలా భాగం పంట సాగుచేయలేక బీడుగా వదిలేశారు. అభిలాష్‌, సుష్మ ఆ నేలలో సిరులు పండించాలని సంకల్పించుకున్నారు. రెండు బోర్లు వేయించారు. ఒక బోరుకు విద్యుత్‌ మోటారును అమర్చారు. మరో బోరుకు సబ్సిడీతో సోలార్‌ సిస్టంను ఏర్పాటుచేసుకున్నారు. అలా ఆధునిక పద్ధతుల ద్వారా విద్యుత్‌ సమస్యను అధిగమించారు. 15 ఎకరాలలో మామిడి, నిమ్మ, జామ, అంజురా, అల్ల నేరేడు మొక్కలు నాటారు. అందులో అంతర పంటలుగా కంది, వేరుశనగ, మునగ వంటివి సాగు చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల నేలకు, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గమనించారు అభిలాష్‌. ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గు చూపారు.
వివిధ ప్రాంతాలలో పర్యటించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. సుభాష్‌ పాలేకర్‌ వ్యవసాయ విధానాన్ని పుస్తకాల ద్వారా చదివి లాభదాయక సాగు వైపు నడక ప్రారంభించారు. ఇంటర్నెట్‌లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అధ్యయనం చేస్తూ, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులు తెలుసుకున్నారు. తుంపరసేద్యం చేపట్టారు. ఒకే పంట మీద ఆధారపడకుండా బహుళ పంటల సాగు చేపట్టారు. పండిన ఉత్పత్తులకు లాభసాటి ధరలు కల్పించే సంస్థల వివరాలను సేకరించారు. తొలుత అంజురా, మామిడి ద్వారా ప్రారంభంలో రూ.1.50 లక్షల ఆదాయం సంపాదించారు.
కుటుంబ ఆరోగ్యంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఆవుపేడ, గోమూత్రం మిశ్రమంగా చేసి ఎరువుగా వాడుతున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. సేంద్రియంగా పండించే పండ్లు, కూరగాయలు రిటైల్‌ సంస్థలకు విక్రయిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. తోట చుట్టూ రక్షణ కోసం కంచెను వేసుకున్నా వన్యమృగాలు, దొంగల బెడద లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
పొలం వద్ద కావలి కోసం నెలకు ఒక మనిషికి రూ.5వేలు ఇచ్చినా ఏడాదికి రూ.60 వేలు అవుతుందన్నారు. రూ.60వేలతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో చాలా సౌకర్యంగా ఉందంటున్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించుకునేందుకు వీలుంటుందని చెబు తున్నారు. ఏ ఉద్యోగం చేసినా రానటువంటి తృప్తి వ్యవసాయంలో లభిస్తోందని ఆ యువ దంపతులు చెబుతున్నారు.
సేద్యంతో సంతృప్తి
నగరంలో ఉద్యోగం చేస్తూ ఎంత సంపాదించినా రాని సంతృప్తి సేద్యం ద్వారా లభిస్తున్నది. అనంత రైతులు కేవలం వేరుశనగ మీదే ఆధారపడటం సరికాదు. బహుళ పంటల సాగు వల్ల రైతుల ఆదాయం ఎంతో పెరుగుతుంది. లాభసాటి అయితే నవతరం కూడా సేద్యం మీద దృష్టి సారిస్తుంది. బహుళ పంటల సాగు, బిందు సేద్యంలో సాటి రైతులకు సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ సేద్యంతో మనతో పాటు ముందుతరాలు కూడా ఆరోగ్యంగా వుంటాయి.
– అభిలాష్‌, సుష్మ
Credits : Andhrajyothi

కొత్త సంచుల్లో పాత విత్తనాలు!

విత్తన కంపెనీలు అవకాశం వున్న అన్ని మార్గాల్లో రైతులను నయవంచన చేస్తున్నాయి. విత్తన పరీక్షా కేంద్రాల్లో చక్రం తిప్పి నాణ్యతలేని విత్తనాలను ఓకే చేయించుకుంటున్నాయి. కొత్త సంచుల్లో పాత విత్తనాలు నింపి రైతులకు అంటగడుతున్నాయి.
వ్యవసాయాధికారులు పరిశోధనా కేంద్రాల్లో తయారైన విత్తనాల శాంపిల్స్‌ను సేకరించాలి. వీటి మొలక శాతాన్ని పరిశీలించాలి. జెర్మినేషన్‌ టెస్ట్‌ (మొలక పరీక్ష) బాగుంటేనే ఆ విత్తనాలకు అనుమతులు ఇవ్వాలి.
మార్కెట్‌లో అమ్మకాలకు షాపులు, గిడ్డంగుల్లో సిద్ధంగా ఉంచిన సరుకులో నుంచి వ్యవసాయ శాఖ ఏవో, ఏడీలు శాంపిల్స్‌ సేకరించాలి. ఖరీదైన విత్తనాల నుంచి శాంపిల్స్‌ సేకరించడం లేదు. షాపు, కంపెనీ యజమానుల ఆదేశాలకు అనుగుణంగానే శాంపిల్స్‌ తీస్తున్నారు. నిబంధనల మేరకు ఆ షాపులో ఉన్న అన్ని రకాల విత్తనాలలో శాంపిల్స్‌ సేకరించాలి. సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షకు పంపాలి. అక్కడ నాణ్యత లేదని తేలితే ఆ విత్తనాల అమ్మకాలను నిలిపివేయాలి.
ఆ లాట్‌ నెంబర్‌ సరుకు ఎక్కడ ఉన్నా వెనకకు తెప్పించాలి. ప్రస్తుతం ఎక్కడైనా విత్తనాల పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే… కంపెనీ యజమానులు మరలా ఆ విత్తనాలను మరో పరీక్షా కేంద్రానికి పంపడానికి అధికారుల అనుమతులు తీసుకుంటున్నారు. ఈ అనుమతులతో ఆయా ల్యాబ్‌లలో ముందుగానే మేనేజ్‌ చేసుకొని నాణ్యత ఉన్నట్లు సర్టిఫై చేయించి ఆ సరుకు అంతా అమ్మే విధంగా వ్యూహరచన చేస్తున్నారు.
కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు తమ వద్ద ఉన్న పాత విత్తనాల నిల్వలను సొమ్ము చేసుకోవడానికి హైటెక్‌ పద్ధతులను అవలంబిస్తున్నాయి.
ఖరీఫ్‌, రబీలలో మిగిలిన సరుకును కోల్డ్‌ స్టోరేజ్‌లలో నిల్వ చేస్తున్నారు. ఆ సరుకును సీజన్‌ వచ్చిన తరువాత కొత్త సంచులలో నింపి మరలా మార్కెట్‌లో అమ్ముతున్నారు. కార్పొరేట్‌ కంపెనీల మాయాజాలానికి ప్రభుత్వ అధికారుల అండ దండిగా ఉంది. దీంతో నాణ్యత లేని విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు నట్టేట మునిగి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
 
విత్తన వ్యాపారులు పాటించాల్సిన సూచనలు..
 • వ్యవసాయ శాఖ రూల్స్‌ను అనుసరించి విత్తన లైసెన్సులు పొందినవారు మాత్రమే రైతులకు విత్తనాలు అమ్మాలి. విత్తన విక్రయ లైసెన్సును షాపులో, గిడ్డంగుల్లో గోడకు తగిలించాలి.
 • అమ్మకపు కేంద్రంలో గల విత్తన నిల్వలను, ధరలను సూచించే బోర్డును విధిగా ప్రదర్శించాలి. బోర్డును రోజూ సరి చేయాలి. విత్తన ప్యాకెట్‌లపై గల గరిష్ఠ అమ్మకపు ధరలకు మించి విక్రయించరాదు. గరిష్ఠ అమ్మకపు ధరలకు మించి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తే డీలర్‌ లైసెన్సును రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
 • విత్తన నాణ్యతపై రైతుల నుంచి వచ్చే సమస్యలను విత్తన తయారీదారు, అమ్మకపుదారులు వెంటనే పరిష్కరించాలి.
పర్యవేక్షణ కమిటీలు ఉండాలి
 • ఖరీఫ్‌, రబీలలో విత్తనాల నాణ్యత, ధర, ఇతర అంశాల పరిశీలన, పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేయాలి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఖరీఫ్‌, రబీలలో 2 నెలల పాటు 2 వారాలకొకసారి ఈ కమిటీల సమావేశాలు జరపాలి. నకిలీ, కల్తీలు వచ్చిన వెంటనే వాటిపై సరైన శిక్షలు పడే విధంగా చట్టాన్ని సవరించాలి.
 • మేకల లక్ష్మీనారాయణ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడు

Credits : Andhrajyothi