
ఆముదం సాగులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ కె రాజారెడ్డి వివిధ సూచనలు ఇచ్చారు. వాటి వివరాలు…
రబీ ఆముదములో ఫిబ్రవరి నెల నుంచి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని 8-10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. బోదెలు, కాలువల ద్వారా నీరు ఇవ్వడం వల్ల నీరు వృథా కాకుండా ఉంటుంది. డ్రిప్పు ద్వారా మూడు రోజులకొకసారి నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సూక్ష్మనీటి సేద్య పద్ధతుల ద్వారా డ్రిప్పు, స్ప్రింకర్ల ద్వారా ఇస్తే 15-20 శాతం నుండి 40 శాతం దిగుబడి పెరుగుతుంది. మొక్కలు పుష్పించే దశ, కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి.
కొమ్మ, కాయతొలిచే పురుగు : ఈ పురుగు ఉధృతి పంట పుష్పించే దశ నుంచి మొదలై పంట పూర్తికాలం వరకూ ఉంటుంది. తొలిదశలో పురుగు కొమ్మలపై, కాయలపై ఉన్న పత్రహరితాన్ని గీకి తింటుంది. పుష్పించే దశలో కొమ్మలోకి పోవడం వల్ల కొమ్మ ఎండిపోతుంది. తర్వాత దశలో కాయలోకి చొచ్చుకొనిపోయి కాయలను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతదశలో ఒకసారి, 20 రోజులకు మరొకసారి మోనోక్రొటోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇండ్సాకార్బ్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పంటకోత-నిల్వ : ఆముదం పంట అంతా ఒకేసారి కోతకు రాదు. 3-4 సార్లు కోయాల్సి వస్తుంది. విత్తిన 90-95 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది. గెలలో 80 శాతం వరకూ కాయలు ముదిరి, ఆకుపచ్చ రంగు నుంచి లేత పసుపు రంగుకు మారినపుడు ఆ గెలను కోసుకోవాలి. కాయలను ఎండబెట్టి వేరుశనగ నూర్చి, యంత్రంతోనే జల్లెడ మార్చుకొని వాడుకోవచ్చు. గింజల్లో 9-10 శాతం తేమ ఉండేటట్లు బాగా ఎండబెట్టి, గోనె సంచుల్లో నిల్వ ఉంచుకోవాలి.
విత్తనోత్పత్తి : పూత దశలో గెల కింది భాగంలో ఒకటి లేదా రెండు గుత్తుల మగ పుష్పాలు మాత్రమే ఉన్న మొక్కలను ఉంచి, మిగిలినవి తీసివేయాలి. పూత దశ తర్వాత కాయల లక్షణాలు ఆధారంగా భిన్నంగా ఉన్న మొక్కల్ని పీకేయాలి.
ఆడ, మగ మొక్కల ద్వారా వచ్చే గెలలను వేరువేరుగా కోయాలి. ఆడ మొక్కల నుంచి వచ్చే విత్తనాలను హైబ్రీడ్ విత్తనంగా వాడుకోవాలి. మేలైన యాజమాన్యంతో ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ళ హైబ్రీడ్ విత్తనం తయారుచేయవచ్చు.
మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ లేదా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ను సంప్రదించండి.
రైతులు మరిన్ని సలహాల కోసం ఈ ఉచిత నంబరుకూ కాల్ చేయవచ్చు-1800 425 0430
డా. కె. రాజారెడ్డి,
విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయం, గుంటూరు – 522 034.
Credits : www.prajasakti.com