
ఈ భూమిపై మనుషుల కంటే ముందే ప్రకృతి ఉంది. చెట్టు, చేమ, పుట్ట, నీరు, నిప్పు, గాలి.. ఇలా ప్రకృతిలో మిళితమై మనిషిని భూమ్మీద బతికేలా చేస్తున్నాయి. ప్రకృతిలో మానవుడితో పాటు చెట్లకు కూడా ప్రతిస్పందించే గుణం ఉంది. ఇటీవల వచ్చిన ‘అ!’ సినిమాలో ‘చెట్లకు వీపుండదా?.. వాటికి దురదుండదా?’ అనే డైలాగ్ కూడా వినే ఉంటారు. వాటికి దురద ఉంటుందో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే మనిషి చేసే చర్యలకు వాటి నుంచి స్పందనలు వస్తుంటాయి. అయితే మొక్కలను పూర్తీగా అర్థం చేసుకున్న కొంతమంది మాత్రమే వాటి స్పందనలను గ్రహించగలుగుతారు. అవి అడగకముందే వాటికి నీళ్లు పోస్తారు. ఒకరకంగా చెప్పాలంటే అలాంటి ప్రకృతి ప్రేమికులు వాటిని కూడా తమ సొంతవాళ్లలాగే భావిస్తారు. వాటితో ముచ్చటిస్తూ ఆలనాపాలనా చూస్తారు. అయితే ప్రకృతి ప్రేమికులను చూసి మరికొంతమంది కూడా ప్రభావితమవుతున్నారు. వాళ్లలా తాము కూడా మొక్కలతో మమేకమవ్వాలని తాపత్రపడుతున్నారు. అలాంటి వాళ్ల కోసమే మార్కెట్లోకొచ్చింది ఓ కొత్త మొక్క.

‘సర్.. మేడమ్.. ప్లీజ్! నీరు లేక ఎండిపోతున్నా! కొన్ని నీళ్లు పోసి నన్ను రక్షించండి! స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుతా..’ అంటూ ఆ మొక్క చిలక పలుకులు పలుకుతోంది! తన ఆవేదనను అర్థం చేసుకొమ్మంటూ వేడుకుంటోంది. హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ఇటీవల జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ‘మాట్లాడే మొక్క’ అందరిని ఆలోచింపజేసింది. సిరిసిల్లకు చెందిన బుధవారపు మల్లేశం అనే వ్యక్తి ‘వాటర్ ఆస్కింగ్ సెన్సర్’తో ఈ మాట్లాడే మొక్కను రూపొందించారు. ఈ మొక్కకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. చాలామంది ఆ మొక్కను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Credits : Andhrajyothi
02-03-2018
02-03-2018