కళ తప్పుతున్న నూజివీడు మామిడి

  • తగ్గుతున్న సాగు విస్తీర్ణం తెగుళ్లు..
  • కార్బైడ్‌ నిషేధం.. జీఎస్‌టీతో షాక్‌
 
యావత్‌ భారతానికి మధురమైన మామిడి రుచులు పంచే ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. పూత ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది మామిడి దిగుబడులు తగ్గే అవకాశం వుంది. కార్బైడ్‌ వినియోగంపై నిషేధం, జీఎస్‌టీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడం మామిడి రైతులకు శాపంగా మారింది.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నూజివీడు:మామిడి దిగుబడిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 4.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతున్నది. సాలీనా 38.60 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. నూజివీడు ప్రాంతంలో మామిడి అధికంగా సాగవుతున్నది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడం మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మామిడి కాయను మగ్గించటానికి ఉపయోగించే కార్బైడ్‌ నిషేధం వల్ల రైతులు నిస్సహాయ పరిస్థితుల్లో పడ్డారు. జీఎస్టీ కారణంగా ఇతర ప్రాంత వ్యాపారులు మామిడిని దిగుమతి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ అంశాల ప్రభావంతో రాష్ట్రంలో మామిడి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతున్నది.
గత సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 38.65 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుబడి రాగా, ప్రస్తుత సీజన్‌లో మామిడిపూతను గమనిస్తే అందులో 50 శాతం దిగుబడి రావడం కూడా కష్టమంటున్నారు శాస్త్రవేత్తలు. డిసెంబర్‌లో రావాల్సిన మామిడిపూత, ఫిబ్రవరి మొదటి వారానికి వచ్చింది. దీనివల్లే దిగుబడి భారీగా తగ్గే అవకాశం వుంది. మామిడికాయను మగ్గించటానికి ఉపయోగించే కార్బైడ్‌ని ప్రభుత్వం ప్రత్యామ్నాయం సూచించకుండా నిషేధించింది. దీనివల్ల ముఖ్యంగా బంగినపల్లి కాయను కొనుగోలు చేయటానికి ఇతర రాష్ర్టాల వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో పండిన పంటను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగదురహిత లావాదేవీలు జరపాలనే ప్రభుత్వ ఆదేశాలు కూడా మామిడి రైతుల్ని దెబ్బతీశాయి. సాధారణంగా మామిడి వ్యాపారం నగదుతోనే చేస్తారు. పంట తీసుకువెళ్లాక బ్యాంకుల్లో డబ్బు జమచేయకపోతే తీవ్రంగా నష్టపోతామనే భయంతో రైతులు వ్యాపారులకు పంట విక్రయించడం లేదు
నూజివీడులోని మామిడి తోటలకు కొన్నేళ్లుగా రాతిమంగు, బూడిద తెగులు, ముడ్డిపుచ్చు తెగులు తదితర చీడపీడల ఉధృతి పెరిగింది. ఫలితంగా కాయల నాణ్యత దెబ్బతింటోంది. నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం వున్నా అది నామమాత్రంగా మారింది. మామిడి పంటపై ఎలాంటి పరిశోధనలు జరగకపోవడం, తెగుళ్లను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయకపోవడం, తెగుళ్ళను అరికట్టడంలో రైతులకు మార్గదర్శనం చేయడంలో విఫలం కావడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు.
నూజివీడు రైల్వేస్టేషన్‌ నుంచి ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాలకు 1999 నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి. 1999లో 29 ర్యాక్‌ల ద్వారా 7,498 టన్నుల మామిడి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అయింది. 2000 సంవత్సరంలో 24 ర్యాక్‌ల ద్వారా 18,298 టన్నులు, 2004లో అత్యధికంగా 50 ర్యాక్‌ల ద్వారా 48,658 టన్నులు, 2014లో 21 ర్యాక్‌ల ద్వారా 35వేల టన్నులు, 2015లో 25 ర్యాక్‌ల ద్వారా 14వేల టన్నుల మామిడి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అయింది. 2016 నుండి ఇప్పటిదాకా ఎగుమతులు జరగలేదు. ఏటా సరాసరి రూ.5 కోట్ల వరకు రైల్వేకు సెస్‌ ద్వారా ఆదాయం లభించింది.
తక్షణ సాయం లేదంటే మామిడిమాయం!
నూజివీడు ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు, సాగునీటి కొరతను దృష్టిలో వుంచుకుని మామిడి రైతులందరికీ 90 శాతం సబ్సీడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం కల్పించాలి. సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించేలా రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ పురుగుమందులు, ఎరువులు లేకుండా మంచి వాటిని సబ్సిడీపై ప్రభుత్వమే రైతులకు అందించాలి. కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా, మామిడికాయను మగ్గించటానికి అవసరమైన పద్ధతులను రైతులకు చూపాలి. రైతుకు పంటను అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి, కొనుగోలుదారుల నుండి పంట సొమ్ము రైతులకు చేరేలా ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
Credits : andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *