
మేలైన కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేసేందుకు 1991లో అశ్వారావుపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటైంది. దేశంలోని పలు రాష్ట్రాలకు మేలైన కొబ్బరి మొక్కలను ఎగుమతి చేసిన ఘనత ఈ క్షేత్రానిది.
కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో పాతికేళ్ల క్రితం కేరళలో లభించే మేలురకాలైన హైబ్రీడ్ కొబ్బరి రకాల మొక్కలను ఉత్పత్తి చేశారు. ఇందుకోసం కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో, అచ్యుతాపురం ఉద్యానశాఖ నర్సరీలోను ఈస్ట్‌కోస్టల్, అండమాన్ ఆర్డినరీ, లక్కడాల్ ఆర్డినరీ మదర్ప్లాంట్లను పెంచారు. ఈ ప్లాంటులోని స్టిక్స్‌ను కొత్తగా పెంచిన మేలురకాలైన పొట్టిరకం కొబ్బరి మొక్కలకు క్రాసింగ్ చేయడం ద్వారా మేలురకాలైన కొబ్బరి విత్తన ఉత్పత్తిని చేసేవారు.
పొట్టిరకాలు భేష్
ఈ క్షేత్రంలో కేరళలో దొరికే మేలురకాలైన పొట్టిరకం కొబ్బరి చౌఘాట్, ఆరంజ్ డ్వాప్(డీఓడీ), గంగ బొండాం, మలియన్ ఆరంజ్ డ్వాప్(ఎంవోడీ), మలియన్ గ్రీన్ డ్వాప్(ఎన్జీడీ), మలియన్ ఎల్లో డ్వాప్(ఎంవైడీ) లాంటి కొబ్బరి మొక్కలను 40 ఎకరాల్లో పెంచారు. ముందుగా పెంచిన మదర్ప్లాంట్లలోని కాయను, ఈ విత్తనానికి క్రాసింగ్ చేయడం ద్వారా గోదావరి గంగ, డీఎక్స్డీ, ఐఎక్స్‌డీ లాంటి మేలురకాల విత్తనాలను ఉత్పత్తి చేసేవారు. ఈ మొక్కలు ఒక్కోటి 150 నుంచి 180 వరకు దిగుబడిని ఇస్తాయి. ఈ రకాలను కేరళ, ఛత్తీ్‌సగఢ్, ఒడిసా, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ర్టాలలోని వివిధ జిల్లాలకు సరఫరా చేసేవారు. ఈ విత్తనం కేరళలో దొరికే నాణ్యత కలిగి, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే కొబ్బరి రకాలను ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం కొబ్బరి, మామిడి మొక్కల ఉత్పత్తి…
ఈ క్షేత్రం ఏర్పాటై 27 ఏళ్లు దాటింది. అప్పుడు నాటిన మొక్కలు బాగా పెద్దవి అయిపోయాయి. ప్రస్తుతం కొబ్బరి క్రాసింగ్ చేయడం లేదు. అయితే అప్పట్లో ఫార్మ్‌లో పెంచిన మేలురకాలైన చెట్టు నుంచి చౌఘాట్, గంగాబొండాం, మలియన్ ఆరంజ్ డ్వాప్, మలియన్ గ్రీన్ డ్వాప్, మలియన్ ఎల్లో డ్వాప్ వంటి మేలురకాలైన పొట్టిరకం విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు బంగినపల్లి, చిన్నరసం, పెద్దరసం, తోతాపురి, పునాస రకాలైన మామిడి అంట్లను ఈ క్షేత్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి మొక్క ఒక్కోదానిని రైతులకు రూ.35, మామిడి అంటును రూ.30లకు ఉద్యానశాఖ సరఫరా చేస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అంట్లు కట్టడం, విత్తనాన్ని నాటడం, మొక్కలను పెంచడంతో నాణ్యమైన మొక్కలు రైతులకు అందుబాటులో ఇవ్వగలుగుతుంది. ప్రైవేటు నర్సరీలలో ఒక్కో మొక్క రూ.300 నుంచి రూ.1000 వరకు వ్రికయిస్తున్నారు. అంతకంటే నాణ్యమైన మొక్కలను ఉద్యాన నర్సరీల్లో అందించడం విశేషం.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అశ్వారావుపేట
రైతులకు మేలురకం మొక్కలు
ప్రస్తుతం కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ద్వారా ఏటా రూ.33 లక్షల ఆదాయం వస్తోంది. తెలుగు రాష్ర్టాల మొత్తంలో ఉద్యానశాఖ ఆధ్వర్వంలో ఏర్పాటుచేసిన కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఇది ఒక్కటే. ఈ క్షేత్రం ద్వారా కొబ్బరి, మామిడి మేలురకాలైన మొక్కలను ఉత్పత్తి చేసి, అతి తక్కువ ధరకు రైతులకు సరఫరా చేస్తున్నాం.
కిషోర్, ఉద్యానశాఖ అధికారి,
కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్ర ఇన్చార్జ్
Credits : andhrajyothi