ఖర్చు స్వల్పం.. రాబడి అధికం

  • పందుల పెంపకంపై పెరుగుతున్న ఆసక్తి
తక్కువ పెట్టుబడి, శ్రమతో అధికం ఆదాయం వచ్చే అవకాశం వుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పందుల పెంపకంపై పలువురు దృష్టి సారిస్తున్నారు. అధిక పోషక విలువలున్న పంది మాంసానికి మంచి గిరాకీ వుందంటున్నారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని లాం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార, పౌష్టికాహార భద్రత సాధించడానికి పశుపోషణ దోహదపడుతున్నది. కోళ్లు, మేకల తరహాలో పందుల పెంపకం ద్వారా ఎంతోమంది ఉపాధి, అదనపు ఆదాయం పొందుతున్నారు. ధాన్యాలు, గడ్డిపరకలు, వ్యర్ధ దాణా ఆహారంగా తీసుకుని పందులు పెరుగుతాయి. పైగా పంది త్వరితగతిన ఎక్కువ పిల్లలను పెడుతుంది. ఈతకు 6-12 పిల్లలు పుడతాయి. పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 65-80 శాతం నికర మాంసం లభిస్తుంది. పంది మాంసం ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వల్ల అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం. ధమరిన్‌, నియాసిన్‌, రైబోప్లేవిన్‌ వంటి విటమిన్లు పంది మాంసంలో అధిక మోతాదులో ఉంటాయి. వీటి కొవ్వును కోళ్ల దాణా, సబ్బుల తయారీ, రంగులు, రసాయనాల్లో వినియోగిస్తున్నారు. 6-8 నెలలకే ఇవి బాగా ఎదుగుతాయి. వీటి నుంచి వచ్చే మాంసం, బేకన్‌హన్‌, సాసేజన్‌, లార్డ్‌ వంటి ఉత్పత్తులకు మార్కెట్‌లో గిరాకీ ఉంది. ఈ అంశాలన్నీ పందుల పెంపకంపై ఎక్కువమంది దృష్టి సారించేలా చేస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య జాతులైన లార్డ్‌ వైట్‌, యార్క్‌షైర్‌ లాంగ్‌రేస్‌ రకాలతో పాటు సంకరజాతి పందులు కూడా మన వాతావరణానికి అనుకూలం అని నిపుణులు చెబుతున్నారు.
          గాలి, వెలుతురు బాగా వున్న చోట షెడ్లు నిర్మించాలి. వాటి ద్వారా వ్యాపించే రోగ కారక సూక్ష్మక్రిములను అరికట్టాలి. వీటి గర్భధారణ 114 రోజులు. కట్టినప్పటి నుంచి సమీకృత మిశ్రమ దాణా రోజుకు రెండు కిలోల వరకు అందించవచ్చు. రెండు నెలల చూడి తర్వాత 500 గ్రాములు అదనంగా ఇవ్వాలి. ఈనటానికి అనువైన గదిలోకి తోలాలి. ఈతకు 24 గంటల ముందు మామూలు దాణాలో 500 గ్రాముల గోధుమ పొట్టును కలిపి ఇవ్వాలి.
          తర్వాత మామూలుగానే దాణా అందించవచ్చు. ఈనిన గది శుభ్రం చేసి, పిల్లలను తల్లి దగ్గర వదలాలి. ఒక్కో పిల్లలకు 250 గ్రాముల దాణా చొప్పున, తల్లికి అదనంగా ఇవ్వాలి. 3, 5 రోజులకు పిల్లలకు యాంటీబయాటిక్స్‌ మందు తాగించాలి. పుట్టిన 14వ రోజున ఇంఫ్రాన్‌, విటమిన్‌-ఏ ఇంజక్షన్లు చేయించాలి. 42 రోజుల తర్వాత నులి పురుగుల మందు తాగించాలి. పిల్లల సైజును బట్టి పరాన్నజీవుల నిర్మూలనకు, నట్టల నివారణ మందు దాణాలో కలిపి అందించాలి. మేతకు హోటళ్లు, కూరగాయ మార్కెట్ల వ్యర్ధ్యాలను ఉపయోగించుకోవాలని లాం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. యుగంధర్‌ కుమార్‌ తెలిపారు.
Credits : andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *