దేశీ ఆవుపాలు అమృతం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన రమణారెడ్డి బీఎస్సీ వరకు చదువుకున్నాడు. ఒక స్వచ్ఛంద సంస్థలో అయిదేళ్లు పనిచేశాడు. ఆ తరువాత ఒక సహజ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు ఆవు గొప్పతనం తెలుసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి నిత్యం ఆవుపాలు తాగించడం వల్ల స్వస్థత చేకూరడంతో గోవులను అది కూడా దేశీ గోవులను పెంచాలని సంకల్పించాడు. గ్రామ శివార్లలో ఆయనకు ఆరెకరాల భూమి వుంది. దాన్ని గో పోషణ క్షేత్రంగా మార్చారు రమణారెడ్డి. 2016లో బ్యాంక్‌ నుంచి రూ. 12 లక్షల రుణం తీసుకున్నారు. గుజరాత్‌ రాష్ర్టానికి వెళ్లి అధిక పాలనిచ్చే ఎనిమిది గిర్‌ జాతి ఆవులను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. తన వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించి ఆవులను పోషించడం మొదలుపెట్టారు. మిగిలిన పొలంలో గోవుల కోసం పచ్చిగడ్డిని పెంచుతున్నాడు. ఎనిమిది ఆవులు సగటున ఏడు లీటర్ల చొప్పున పాలు ఇస్తుండగా రోజూ సుమారుగా 60 లీటర్ల పాలను, లీటర్‌కు రూ.80 చొప్పున విక్రయిస్తున్నాడు. పాలను లీటర్‌, అర లీటర్‌ ప్యాకెట్లలో నింపి విక్రయించడం ప్రారంభించారు. లీటరుకు 10 రూపాయల కమిషన్‌ ఇచ్చి ఇద్దరు యువకులను పంపిణీకి నియమించుకున్నారు. వరంగల్‌, కాజీపేట, హన్మకొండలో పలు కుటుంబాలకు స్వచ్ఛమైన దేశీ గోవు పాలను విక్రయిస్తున్నాడు. ఆవుల సంరక్షణకు బీహార్‌కు చెందిన ఇద్దరు యువకుల్ని నియమించుకున్నారు రమణారెడ్డి. వారికి ఒక్కొక్కరికి రూ.12వేల జీతం ఇస్తున్నారు. పాల విక్రయం ద్వారా రోజుకు అయిదు వేల ఆదాయం పొందుతున్నారు. గో మూత్రాన్ని సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు లీటరుకు 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. గోవుల పేడను ట్రాక్టరు రూ.2500 చొప్పున విక్రయిస్తున్నారు.
తల్లి పాలు అంతగా లభ్యంకాని శిశువులు, నెలల వయసున్న చిన్న పిల్లలకు తాగించడానికి పలువురు ఆవుపాలను ఎంచుకుంటున్నారు. కొందరు డైరీ ఫాం నిర్వహిస్తున్న వ్యక్తులు కూడా వారి కుటుంబాల కోసం తమ దగ్గర నుంచి ఆవుపాలను కొనుగోలు చేస్తున్నట్లు రమణారెడ్డి తెలిపారు. పాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం ఖర్చులకు పోతున్నది. ఆవుల పేడ, మూత్రం విక్రయాల వల్ల అదనపు ఆదాయం సమకూరుతున్నట్లు ఆయన తెలిపారు. యజ్ఞ, యాగాదులకు అవసరమైన అగరబత్తులను, పిడకలను తయారుచేయాలని ఆలోచనతో ఉన్నట్లు రమణారెడ్డి వివరించారు.
ఆవు మూపురంలో వున్న గల సూర్య కేతునాడి ఎండ నుంచి శక్తిని గ్రహించి పాలలో, పేడలో, మూత్రంలో పోషకాలను కలిగిస్తుంది. ఆక్సిజన్‌ను పీల్చుకొని, ఆక్సిజన్‌ను బయటికి వదిలేది ఆవు ఒక్కటే. ఆవు ఇంటి ముందుంటే దాని ఉచ్వాస, నిశ్వాసలతో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుం దంటున్నారు రమణారెడ్డి.
Credits : andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *