వేస‌విలో ప‌శుగ్రాసం

<span ‘times=”” new=”” roman’;=”” font-size:=”” medium;\”=””>                      వేసవి వస్తుందంటేనే పశుగ్రాసం లోటు అధికంగా కనిపిస్తుంది. అందుకే పశుగ్రాసాన్ని పండించుకోవడం ఎంత ముఖ్యమో.. మిగిలిపోయిన పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడమూ అంతే ఉపయోగకరం. అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతులలో నిల్వ చేయవచ్చు. దాన్ని పశుగ్రాస కొరత ఉండే ఎండాకాలంలో పశువులకు మేతగా ఉపయోగించుకోవచ్చు. పశుగ్రాసాన్ని నిల్వ చేసుకునే పద్ధతులూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశువైద్యాధికారులు ఇస్తున్న సూచనలు చూద్దాం.

పశుగ్రాసాన్ని నిల్వచేసే పద్ధతుల్లో ‘హే’ తయారీ, ‘సైలేజి’ తయారీ అని రెండు రకాలుంటాయి.

‘హే’ పద్ధతి:ఈ పద్ధతికి సన్నని మృదువైన కాండం కలిగిన పశుగ్రాసాలు అనుకూలం. ధాన్యపుజాతి గడ్డినీ, గడ్డిజాతి పంటలనూ, లేదా పప్పుజాతి పంటలనూ, పూతదశ కంటే ముందు దశలో కోసి, వాటిని ఎండబెట్టి, కొరత కాలంలో వాడుకోవడం ఈ పద్ధతిలో కనిపిస్తుంది. ‘హే’ గడ్డి లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు, కొమ్మలతో తడి లేకుండా ఉంటుంది. ఎక్కువగా ఉన్న పశుగ్రాసాన్ని నిల్వచేసే పద్ధతుల్లో ఇది చాలా తేలికైనది. ఈ పద్ధతిలో గ్రాసంలోని నీటి శాతం బాగా తగ్గేవరకూ ఎండనివ్వాలి. పూయకుండా, బూజు పట్టకుండా ఉండేలా తేమ శాతాన్ని తగ్గించాలి. పప్పుజాతి గ్రాసాలతో కలిపి లేదా కలపకుండా ‘హే’ను తయారుచేసుకోవడంలో రెండు పద్ధతులున్నాయి.

సాధారణ పద్ధతి : పొలంలోనే పనలుగా వేసిన గడ్డిని బాగా ఎండబెట్టాలి. ‘హే’ తయారుచేయడానికి పంటను మంచు బిందువులన్నీ ఆవిరి అయిన తర్వాత మాత్రమే కోయాలి. కోసిన గడ్డిని పొలం లోనే ఆరనివ్వాలి. ప్రతి 4-5 గంటలకు ఒకసారి బోద పనలను తిప్పుతుండాలి. తేమ 40 శాతం వరకూ వచ్చిన తర్వాత తేలికగా ఉండే కుప్పలుగా వేయాలి. తర్వాత రోజు మళ్ళీ తేమ 25 శాతం వచ్చే వరకూ వాడనివ్వాలి. ఇలా ఎండిన గడ్డిని సుమారు 20 శాతం తేమ ఉండేలా చూసుకొని, నిలువ చేసుకోవాలి. వర్షాకాలంలో షెడ్స్‌లో ఈ గడ్డిని వాడబెట్టి ‘హే’గా తయారుచేయాలి.

యాంత్రిక పద్ధతి : ఈ ప్రక్రియలో ఇనుప కంచెలను ఉపయోగించి, తయారు చేసిన ఫ్రేములలో గడ్డిని ఎండబెడతారు. బర్సీము, లూసర్న్‌ గడ్డిని ఈ విధంగా ఎండబెట్టవచ్చు. ఇలా ఎండబెట్టడం వల్ల 2-3 శాతం మాంసకృత్తులు మాత్రమే నష్టం అవుతాయి. ఆలస్యంగా కోతలు కోయడం వల్ల పోషకాలు తగ్గుతాయి. పప్పుజాతి మొక్కలలో కోతదశలో, ఆకులు, కాయలు ఎండి రాలిపోతాయి. వాడనివ్వడం వల్ల కెరోటిన్‌, క్లోరోఫిల్‌ పరిమాణం తగ్గిపోతుంది.

సైలేజి’ (మాగుడు గడ్డి) :సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అధిక దిగుబడినిచ్చే పచ్చిమేతను ముక్కలుగా చేసి, గాలి లేకుండా పులియబెట్టి, నీరు కూడా లేకుండా ఉండే స్థితిలో నిల్వ చేయడాన్ని ‘సైలేజి’ అంటారు. ఆక్సిజన్‌ కూడా లేని పరిస్థితిలో నిలువ చేయడం వల్ల పశుగ్రాసంలోని నీటిలో కరిగే పిండిపదార్థాలన్నీ, ఆర్గానిక్‌ ఆమ్లాలుగా మారి, గ్రాసపు ఆమ్ల పరిమాణాన్ని పెంచుతాయి. ఈ పరిస్థితుల్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరగలేవు. దీనివల్ల పోషకాహార నష్టం జరగకుండా నాణ్యత పెరుగుతుంది. పశువులు దీన్ని చాలా ఇష్టంగా తింటాయి. బాగా అరిగించుకుంటాయి కూడా. ‘సైలేజీ’ నాణ్యత గడ్డిలోని ఎండుపదార్థం, కరిగే తీపి పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ముడి మాంసకృత్తు లకు తీపి పదార్థాల నిష్పత్తీ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. పంటను 50 శాతం పూతదశలో కోసినపుడు, లేదా పాలదశలో కోసినపుడు తయారుచేసే ‘సైలేజి’ మంచి నాణ్యత కలిగి ఉంటుంది. మొక్కజొన్న, జొన్న, సజ్జ, మొదలైన పంటలను 50 శాతం పూతదశలో కోసి సైలేజీకి ఉపయోగించాలి. నేపియర్‌ గడ్డి అయితే 45-50 రోజుల వ్యవధిలో, ఇతర గడ్డినీ పూతదశలో కోసి, సైలేజీకి ఉపయోగించాలి.

 

సైలేజి తయారీ: నీటి ఊటలేని ఎత్తయిన ప్రదేశంలో పాతర తవ్వి, వాటి అడుగు భాగాన, పక్కలకు సిమెంటు గోడలు కట్టాలి. చాప్‌కట్టర్‌తో సన్నగా నరికిన మేతను పాతరలో నింపి, ట్రాక్టరుతో నడిపి, పాతరలో గాలి లేకుండా చేయాలి. ప్రతి టన్ను గడ్డికి 2-3 కిలోల బెల్లపు మడ్డి, 2 కిలోల రాతి ఉప్పు పొరల మధ్య చల్లాలి. పాతరను భూమికి 2-3 అడుగుల ఎత్తుకు నింపి, దానిపై మందపాటి పాలిథీóన్‌ షీట్‌ లేదా వరిగడ్డినిగానీ పరచి మట్టి, పేడ మిశ్రమంతో పూత పూసి (అలికి) ఏమాత్రం గాలి, వర్షపు నీరు పాతరలోకి పోకుండా జాగ్రత్తపడాలి. గోతులను నింపే ముందు గోతుల అడుగుభాగం పక్కలకు వరిగడ్డి వేస్తే పాతర గడ్డి వృధా కాకుండా ఉంటుంది. లేనట్లయితే గాలి, నీరు సోకిన పాతరగడ్డి బూజుపట్టి చెడిపోతుంది. ఇలా నిల్వచేసిన గడ్డి త్వరగా రసాయనిక మార్పుకు గురవుతుంది. మంచి గడ్డి లేత పసుపుపచ్చ రంగులో మగ్గిన పండ్ల సువాసనతో తేమను కలిగి ఉంటుంది. చెడిపోయిన మాగుడు గడ్డి ముదురు గోధుమరంగు లేదా నలుపు రంగులో పులుపు వాసనతో ఉంటుంది.

సౖౖెలేజీ పిట్‌: మూడు నెలల్లో ఐదు పాడి పశువులకు 12 టన్నుల సైలేజీ అవసరమవుతుంది. ఒక ఘనపుటడుగు గుంతలో తయారుచేసిన సైలేజీ బరువు 15 కిలోలు ఉంటుంది. 15 టన్నుల సైలేజీ తయారుచేయడానికి 1000 ఘనపుటడుగుల పాతర కావాలి. ఇందుకు 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవున్న గుంతను తవ్వుకోవాలి. సైలేజీ తయారీకి పచ్చిమేతలో 60 శాతం మించి నీరు ఉండరాదు. మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను కంకి, గింజ గట్టి పడుతున్న సమయంలో.. నేపియర్‌ గడ్డిని ముదరనిచ్చి, సైలేజీ చేయడానికి వాడుకోవాలి

 

మాగుడుగడ్డి వాడుక : అలవాటుపడే వరకు పశువులు సైలేజీని తినకపోవచ్చు. పాలు పితికిన తర్వాత లేదా పాలు పిండడానికి నాలుగు గంటల ముందు సైలేజీని పశువులకు మేపాలి. లేకపోతే పాలకు సైలేజీ వాసన వస్తుంది. పాడిపశువు ఒక్కింటికి సుమారుగా 20 కిలోల సైలేజీని ఇతర ఎండుమేతతో కలిపి మేపాలి. పాతర వేసిన గడ్డి రెండు మూడు నెలలకు మాగి, కమ్మటి వాసన కలిగిన సైలేజీగా తయారవుతుంది. దీన్ని అవసరాన్ని బట్టి ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2-3 సంవత్సరాల వరకూ చెడిపోకుండా సైలేజీని నిల్వ ఉంచుకోవచ్చు. సైలేజీ గుంత తెరిచిన తరువాత నెలరోజులలోపు వాడుకోవాలి. లేని యెడల ఆరిపోయి చెడిపోతుంది. మొత్తం కప్పునంతా ఒకసారి తీయకుండా ఒక పక్క నుంచి బ్రెడ్‌ ముక్కల్లాగా తీసి వాడుకోవాలి.

Credits : www.prajasakti.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *