ఆధునిక సేద్యం… లాభాల పర్వం 

వ్యవసాయమంటే అతికష్టమనే భావన. అంతంత మాత్రం నీటివసతి. అత్యల్ప వర్షపాతంగల నేలలో పట్టుదల, స్వీయ పర్యవేక్షణతో లాభాలు పండిస్తున్నారు పడమటి పావని. సంప్రదాయ పంటల సాగుతో ప్రయోజనం లేదని తెలుసుకుని పౌలీహౌజ్‌, సూక్ష్మసేద్యంవంటి ఆధునిక పద్ధతుల్లో బర్బరా పూలు సాగు చేస్తున్నారు. అనుబంధంగా పాడి, కోళ్లద్వారా మంచి ఆదాయం గడిస్తున్న మహిళారైతు విజయగాథ ఇది.

కరువు నేలలో లాభసాటి వ్యవసాయం 

హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రాంతంలో నివసిస్తున్న పడమటి పావని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా అవుషాపూర్‌. కుటుంబ వ్యవసాయ భూములు భూ సేకరణలో పోగా ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో బొమ్మల రామారం మండలం మర్యాలవద్ద 20 ఎకరా లు కొనుగోలుచేశారు. భర్త వెంకటరెడ్డి వ్యాపారంలో ఉండగా ముగ్గురు పిల్లలను చూసుకోవడంలో ఆమెకూ తీరికలేనందున ఆ భూమి నిరుపయోగంగా ఉండిపోయింది. విద్యావంతురాలైన పావని కొంతకాలం తర్వాత ఆ భూమిని సాగుచేయాలని భావించి, 2005లో బావి తవ్వించారు. మూడు బోర్లతో సంప్రదాయ పద్ధతుల్లో వరి, చెరుకు, మొక్కజొన్న వేస్తూ వచ్చారు. కానీ, నీరు చాలక పంటలు సరిగా పండకపోవడంతో ఆలోచనలో పడ్డారు.

పూల సాగుతో సిరులు
ఉద్యానశాఖ అందిస్తున్న పాలీహౌజ్‌ వ్యవసాయ పద్ధతిని గమనించిన ఆమె 2010లో అటువైపు మొగ్గుచూపి 50 శాతం రాయితీతో ఎకరమున్నరలో పాలీహౌజ్‌ నిర్మాణం చేపట్టారు. తమ వాటాగా రూ.42 లక్షల పెట్టుబడి పెట్టారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర అలంకరణలకు వినియోగించే పూల పెంపకం ప్రారంభించారు. నీటి కరువు రాకుండా వర్షపు నీటిని వ్యవసాయ బావిలోకి మళ్లించారు. మూడు బోర్లవద్ద ఇంకుడు గుంతలు తవ్వించారు. దీంతోపాటు సూక్ష్మ, బిందు సేద్యం వల్ల నీటి సమస్య తీరింది. దీనికి అనుబంధంగా 40ఆవులతో డెయిరీ నిర్వహిస్తూ వాటి మూత్రం, పేడను సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్నారు. దేశవాళీ కోళ్ల పెంపకం సైతం చేపట్టారు. పాలీహౌజ్‌లో ఐదు రంగులలో బర్బరా పూలను సాగుచేస్తూ రాష్ట్రంలోనేగాక ఇతర రాష్ట్రాలకూ రవాణా చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలోని గడ్డిఅన్నారంతోపాటు ఢిల్లీ, బెంగుళూరు, చైన్నె, విజయవాడ లకు పూలు రవాణాచేస్తూ లాభాలు గడిస్తున్నారు. పూల సాగుద్వారా ఎకరాకు సగటున నెలకు రూ.లక్షదాకా ఆర్జిస్తున్నారామె. ఆధునిక పద్ధతులతో సాగుచేసే అలంకరణ పూల రకాలలో ఆదరణ ఉన్న వెరైటీలను ఎంచుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. పట్టుదల.. స్వీయ పర్యవేక్షణతోపాటు ఎటువంటి పూలకు, ఎటువంటి కూరగాయలకు గిరాకీ ఉందో నిరంతరం గమనిస్తూ లాభాల దిశగా పయనిస్తున్నారు ఆదర్శ మహిళా రైతు పావని.

– ఆంధ్రజ్యోతి, భువనగిరి

స్వీయపర్యవేక్షణతో సిరులు 

ఆధునిక పద్ధతులతో తప్పక లాభాలు వస్తాయి. నీటివసతితో చింత లేదు. ఎరువులూ ఎక్కువగా వాడన క్కర్లేదు. లక్షల పెట్టుబడితో కూడిన పాలీహౌజ్‌ సేద్యం స్వీయ పర్యవేక్షణలో చేసుకోవాలి. ఎప్పుడు ఏ సస్యరక్షణ చర్యలు చేపట్టాలో స్వయంగా చూసుకోవాలి. ఉద్యానశాఖ రాయితీ ఇస్తుంది. నర్సరీలు మెలకువలు నేర్పుతాయి. పాలీహౌజ్‌ చేపట్టే రైతులు మార్కెట్‌ను గమనిస్తూ సాగుచేస్తే లాభాల పంట పండుతుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *