కరివేపాకు సాగుతో కాసుల పంట

  • మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే మరిన్ని అద్భుతాలు

కరువుతో సతమతమవుతున్న రైతును కరివేపాకు సాగు ఆదుకుంటోంది. కడపజిల్లా జమ్మలమడుగు మండలం ఎస్‌.ఉప్పలపాడులో 350 ఎకరాల్లో రైతులు కరివేపాకు సాగుచేస్తూ ఆదాయం పొందుతున్నా, కష్టానికి తగిన ప్రతిఫలం అందటం లేదు. ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఆరుగాలపు కష్టం దళారుల పాలుకాకుండా ఉంటుందని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.

ప్రభుత్వంనుంచి వచ్చే ప్రయోజనాలు తెలుసుకుని సాధించుకోవాలంటే రైతులు సంఘటితమై కలిసికట్టుగా నడవాల్సిందే.
– ‘రైతు స్వరాజ్య వేదిక’ రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్‌ కుమార్‌ విస్సా. 

కడపజిల్లా ఎస్‌.ఉప్పలపాడు రైతులు కొన్నేళ్లుగా పత్తి, శనగ తదితర పంటలు సాగుచేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక, పంటలు చేతికందక నష్టాలపాలవుతున్నారు. మరోవైపు సాగు పెట్టుబడి గణనీయంగా పెరిగి, దిగుబడి నామమాత్రమై అప్పుల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో గురప్ప అనంతపురంజిల్లాలోని బంధువుల గ్రామానికి వెళ్లి కరివేపాకు సాగుగురించి తెలుసుకున్నాడు. దశాబ్దాలుగా సాగుచేస్తున్న పంటలతో నష్టపోతున్నందున కొత్త పంటవైపు మొగ్గుదామనుకున్నాడు ఆ రెతు. అలా గురప్ప తొలిసారి గ్రామంలో కరివేపాకు సాగుకు శ్రీకారంచుట్టారు. తొలి ప్రయత్నంలోనే ఆయన మంచి లాభాలు గడించడంతో ఇతర రైతులు కూడా కరివేపాకు సాగు చేపట్టి నష్టాలనుంచి గట్టెక్కారు. ప్రస్తుతం ఉప్పలపాడులో 350 ఎకరాల మేర కరివేపాకు సాగవుతుండటం విశేషం.

ధరలో హెచ్చుతగ్గులు

కరివేపాకు సాగుకు గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి రైతులు విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఎకరాకు 90 కిలోలదాకా విత్తనం కావాలి. ఇందుకోసం రూ.70 వేలు ఖర్చవుతుంది. ఒకసారి విత్తనం వేస్తే నేల స్వభావాన్ని బట్టి రెండుమూడేళ్లకుపైగా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఎకరాకు 5 ప్యాకెట్ల ఫాస్పేట్‌ వాడాల్సి వస్తుందని, ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని చెబుతున్నారు. చీడపీడల నివారణకు పది రోజులకొకసారి పురుగు మందులు పిచికారీ చేస్తారు. నాలుగు నెలలకు ఒక కోత వంతున ఎకరాకు 6టన్నుల దిగుబడి వస్తుంది. దిగుబడి బాగుంటే 10 టన్నులు కూడా వస్తుంది. ఆకును నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్తే రైతుకు మంచి లాభం వస్తుంది. కానీ, ఎక్కడికి తీసుకెళ్లాలో రైతులకు తెలియకపోవడంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వ్యాపారులు కొందరు పొలం దగ్గరకే వచ్చి కిలోల వంతున కరివేపాకు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం రైతుకు కిలోకు రూ.2 వస్తుండగా డిసెంబరు ప్రాంతంలో రూ.15-20దాకా లభిస్తుంది. ఖర్చులుపోగా ఏటా ఎకరానికి రూ.50వేల నుంచి లక్షవరకు ఆదాయం పొందిన రైతులు కూడా ఉన్నారు. ‘‘మా పంటను తక్కువ ధరకు కొని వ్యాపారులు ప్రధాన నగరాల్లో అమ్మి మంచి లాభాలు గడిస్తున్నారని తెలుసు. కానీ, ఏం చేయాలో తెలియక వచ్చినదానితో సరిపెట్టుకుంటున్నాం’’ అంటున్నాడు గురప్ప.

ప్రభుత్వ సహకారంతో మరింత సాగు
ఈ ప్రాంతంలో వందలాది రైతులు కరివేపాకు సాగు చేస్తున్నా దీనికి సంబంధించిన ఉద్యానశాఖ అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే గతంలో దీన్ని సాగు చేసిన రైతుల సలహాలతోనే నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తున్నదని వారు చెప్పారు. అలాంటి సమయంలో శాస్త్రవేత్తలు సలహాలు అందిస్తే మెరుగైన దిగుబడులు సాధిస్తామని రైతులు చెబుతున్నారు. కరివేపాకు పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే మేం పడిన కష్టం దళారుల పాలు కాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ పంట సాగుకు రుణ సౌకర్యం, బీమా లాంటివి కల్పిస్తే మరింత స్థాయిలో కరివేపాకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
– ఆంధ్రజ్యోతి, ప్రొద్దుటూరు 

మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి
కరివేపాకు సాగు లాభదాయకంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా ఈ పంటను సాగు చేయడంలేదు. ఎక్కువ ఖర్చుండదు. టెన్షన్‌ ఉండదు. ప్రభుత్వం మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించగలిగితే రైతులకు మరింత ఆదాయం చేకూరుతుంది. మార్కెట్లో ఉన్న రేటు మాకు తెలియడంలేదు. వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చేస్తు న్నాం. కానీ, వారు అధిక ధర లభించే ప్రాంతాల్లో విక్ర యిస్తూ లాభాలు గడిస్తున్నారు.

– కృష్ణ, ఉప్పలపాడు

ప్రభుత్వ మద్దతు కావాలి 
మేం సాగు చేసిన పంటను అధికారులు పరిశీలించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగితే మరింత దిగుబడి సాధిస్తాం. ఈ పంట సాగుకు రుణ సౌకర్యంతోపాటు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే ఏ అధికారిని కలువాలనో కూడా మాకు తెలియడంలేదు. ఈ పంట సాగు చేసిన పక్క రైతులను అడిగి వారు చెప్పిన మందును పిచికారీ చేస్తున్నాం.

– హరి, ఎస్‌.ఉప్పలపాడు
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *