కాంపాకు హరిత హారం 

 పచ్చదనం వాపస్‌కు సంకల్పం చెప్పుకొన్నాం
కాంపా నిధులు రూ.500 కోట్లు ఇవ్వండి
కేంద్ర అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం వినతి
నిధుల కోసం రేపు ఢిల్లీకి మంత్రి రామన్న 

హైదరాబాద్‌, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): హరిత హారం లక్ష్యం.. మొక్కల పెంపకం! అడవుల పునరుద్ధరణ! ‘కాంపా’ పథకం ఉద్దేశం.. ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకం.. పచ్చదనం పునరుద్ధరణ! రెండు పథకాల లక్ష్యాలూ ఒకటే! అదే సమయంలో.. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికీ పచ్చదనమే మార్గం! ఈ నేపథ్యంలోనే, హరిత హారం కార్యక్రమానికి కాంపా నిధులను ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రానికి మరిన్ని నిధులను ఇవ్వాలని కోరుతోంది. వాస్తవానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ నుంచి విడిపోయాక తెలంగాణ రాష్ట్ర కాంపా ఖాతాలో రూ.1400 కోట్లున్నాయి. వీటి నుంచి వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద ఏటా 10 శాతం నిధులు అంటే.. రూ.140 కోట్లను కేంద్రం విడుదల చేస్తోంది. అయితే.. హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందున అధిక మొత్తంలో కాంపా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర అటవీ శాఖపై ఒత్తిడి తెస్తోంది. ఈ ఏడాది కనీసం రూ.500 కోట్ల కాంపా నిధులనైనా విడుదల చే యాలని కోరుతోంది. ఇందులో భాగంగా, ఈనెల 14న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌తో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సమావేశం కానున్నట్లు తెలిసింది.

దారి మళ్లుతున్న కాంపా నిధులు

అభివృద్ధి కార్యక్రమాల కోసం నిర్మూలించిన అటవీ ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని పునరుద్ధరించడానికే కాంపా నిధులను ఉపయోగించాలి. కానీ, ఈ నిధులను గతంలో తెలంగాణ అటవీ శాఖ అరణ్య భవన్లో ఫర్నిచర్‌, గ్లాస్‌ ఫిటింగ్‌ కోసం ఖర్చు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణలోనే కాకుండా చాలా రాష్ట్రాల్లోని అటవీ శాఖలు కాంపా నిధులను దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు, ఫర్నిచర్‌, వాహనాల కొనుగోలు వంటి అటవీయేతర కార్యకలాపాలకు కాంపా నిధులను ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంపా నిధులను సద్వినియోగం చేయడానికి కేంద్రం కూడా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. నిజానికి, అభివృద్ధి కార్యక్రమాల కోసం అటవీ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు తదితర సంస్థలు కేంద్ర అటవీ శాఖకు చెల్లించిన పరిహార నిధులనే కాంపా నిధులు అంటారు. వివిధ రాషా్ట్రల నుంచి కేంద్ర అటవీ శాఖ వసూలు చేసిన ఈ నిధులు ప్రత్యేక ఖాతాలో జమవుతాయి. ఈ ఖాతా సుప్రీం కోర్టు అధీనంలో ఉంటుంది. ఖాతాను నిర్వహించేందుకు ప్రత్యేక అథారిటీ ఉంటుంది. దీనినే కాంపన్సేటరీ ఎఫారెస్టేషన ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (సీఏఎమ్‌పీఏ- కాంపా) అని పిలుస్తారు. గతంలో కాంపా నిధులను దుర్వినియోగం చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. రాషా్ట్రల నుంచి జమయిన మొత్తం నిధి నుంచి ఏటా 10 శాతం నిధులను యాన్యువల్‌ ప్లాన కింద విడుదల చేయాలి. ఆ నిధులను ఖర్చు చేసినట్లు యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పిస్తే తర్వాత ఏడాదిలో మరో పది శాతం నిధులను విడుదల చేయాలి. కానీ, చాలా రాష్ట్రాల్లో కాంపా నిధులు ఇప్పటికీ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో హరిత హారానికి రూ.48 కోట్లను కేటాయించింది. హరిత హారానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఈ ఒక్క ఏడాదిలోనే 40 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే హరిత హారానికి మరింత చేయూత ఇచ్చేలా కాంపా నిధులను పెద్దఎత్తున విడుదల చేయాలని కోరుతోంది.

Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *