వరి సాగుతో రైతన్నలకు సిరి

 

ఆంధ్రజ్యోతి, బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహారపంట వరి. దేశ ఆహార భద్రత వరి పంటపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కాబట్టి భవిష్యత్తులో తక్కువ విస్తీర్ణం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో మరింత ఎక్కువ దిగుబడులు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరిసాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుంచి పంటకోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా సాగుఖర్చు తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చునంటున్నారు బాపట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు 22.11 లక్షల హెక్టార్లలో కాల్వలు, చెరువులు, బావులు కింద వరి పంట సాగుచేస్తున్నారు. ఏటా సుమారు 68.64 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు రైతన్నలు. సరాసరి ఎకరానికి 1240 కిలోల దిగుబడి లభిస్తున్నది. కోస్తాంధ్రలో సార్వా (ఖరీఫ్‌) జూన్‌ నుంచి నవంబర్‌ వరకు, రాయలసీమలో జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఉంటుంది. అదే దాళ్వా అయితే నవంబర్‌ నుంచి మార్చి వరకు ఉంటుంది. వరి పంట విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత ఆ ప్రాంతంలోని వర్షపాతం, నీటి లభ్యతమీద ఆధారపడి ఉంటాయి.
 

మేలైన యాజమాన్య పద్ధతులు 
వరి వంగడాల ఎంపిక: వివిధ ప్రాంతాలకు అనువైన వరివంగడాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన ఎంపికలోనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. మంచి విత్తనం ఎంపికతో రైతుకు మేలు చేకూరుతుంది.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండిజిమ్‌ను కలిపి 24 గంటలు తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంపనారు అయితే లీటర్‌ నీటికి ఒక గ్రాము కార్బండిజిమ్‌ కల్పి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకలను దంపనారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటర్‌ మందు నీరు సరిపోతుంది.

వరి విత్తనాలలో నిద్రావస్థను తొలగించటం: కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజలలోని నిద్రావస్థను తొలగించి అధిక మొలకశాతం రాబట్టటానికి లీటర్‌నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 6.3 మిల్లీలీటర్లు లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10మిల్లిలీటర్‌లు గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండెకట్టాలి.

విత్తన మోతాదు: నాటే పద్ధతికి 20 నుంచి 25కిలోలు, వెదజల్లటానికి (భూముల్లో) 24 నుండి 30కిలోలు, వెదజల్లటానికి గోదావరి జిల్లాలో 10 నుండి 12 కిలోలు గొర్రుతో విత్తటానికి (వర్షాధారపు వరి) 30 నుంచి 36 కిలోలు అవసరం ఉంటుంది. శ్రీ పద్ధతిలో అయితే ఎకరానికి రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి.

ఆరోగ్యవంతంగా నారు పెంచటం ఇలా 

  • నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలు దమ్ముచేసి చదును చేయాలి. నీరుపెట్టటానికి, తీయటానికి వీలుగా కాల్వలు ఏర్పాటు చేయాలి.
  • 5 సెంట్ల నారుమడికి రెండుకిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, కిలో పొటాష్‌నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భాస్వరం రెట్టింపు చేయాలి.
  • మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి.
  • నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి.
  • జింకు లోపాన్ని గమనిస్తే లీటర్‌ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీచేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరిసాగులో జింకు లోపం లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
  • విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీ లీటర్లు లేద క్లోరోపైరిఫాస్‌ 2మిల్లిలీటర్లు లీటర్‌ నీటికి కలిపి విత్తిన 10రోజులకు, 17 రోజులకు పిచికారీ చేయాలి. లేదంటే నారుతీయటానికి ఏడు రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్‌ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి వేయాలి.

Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *