‘వాటర్‌ బడ్జెట్‌’ రైతుకు వరం

వరి, పత్తి, చెరకులాంటి పంటల ఉత్పత్తికి ఎకరాకు సుమారు 60 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతుంది. సంవత్సరంలో సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం పడే ప్రాంతాలలో ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు అందుతుందనుకుంటే అందుకు మూడురెట్ల నీటిని ఒక పంటకాలంలోనే మనం వాడుతున్నాం. అంటే ఎకరా వరి పండించడానికి ఆ ఎకరంలో మూడేళ్లు పడిన వర్షపు నీటిని ఒకే పంట కాలంలో వాడుకుంటున్నాం. ఇలా ఐదేళ్లు రెండు పంటల చొప్పున తీసుకుంటే 30 సంవత్సరాలు పడే వర్షపు నీటిని మనం వాడేసినట్టే.

స్థానిక వర్షపాతం, భూమి తత్త్వం, వాననీటి సంరక్షణ ఆధారంగా పంట ప్రణాళిక, సాగు పద్ధతులను రూపొందించుకోవాలి. ఇదే వాటర్‌ బడ్జెట్‌.

– డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త, హైదరాబాద్‌

 

తరచూ కరువు బారినపడి పంట నష్టపోతున్న రైతులను, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక కిలోమీటర్ల దూరం నడిచి, నీళ్లు మోసుకొచ్చే మహిళలను ప్రతి వేసవిలో మనం చూస్తూంటాం. అదే సమయంలో వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు పంటలు మునిగిపోయి రైతులు పంట నష్టపోవడాన్నీ చూస్తున్నాం. వర్షాల కోసం రుతుపవనాల మీద ఆధారపడే భారతలాంటి దేశంలో వాన పడినప్పుడు నీటిని జాగ్రత్తగా సేకరించి దాచుకుని, అవసరమైనప్పుడు వాడుకునే పద్ధతులు చాలా అవసరం. ఎన్నో వందల ఏళ్లుగా మన దేశంలో చెరువులు, కుంటలు లాంటివి ఇందుకోసం ఏర్పాటు చేసుకుని సమర్థంగా నిర్వహిస్తున్న అనుభవాలున్నాయి. అయితే కాలక్రమేణా బోరుబావులు, ఆనకట్టలు, వాటి కాల్వలద్వారా వచ్చే నీటికి అలవాటు పడటంతో ఇవన్నీ పనికిరాకుండా పోయాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం.
ఒక మిల్లీమీటరు వర్షం కురిసినప్పుడు హెక్టారు భూమిలో సుమారు పదివేల లీటర్ల నీరు చేరుతుంది. అంటే 500 మిల్లీమీటర్ల వర్షం పడే ప్రాంతాలలో కూడా హెక్టారుకు 50 లక్షల లీటర్లు అంటే ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు చేరుతుంది. ఇందులో భూమిలోకి ఇంకిన భాగంగాక మిగిలిన నీరు బయటకు ప్రవహించి మురుగ్గుంటల్లో కలవడమో, ఆవిరి కావడమో జరుగుతున్నది. ఇందులో మూడొంతుల నీటిని కాపాడుకోగలిగితే ఒక పంటను సునాయాసంగా పండించుకోవచ్చు. నేల స్వభావం కారణంగా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ అంశం కూడా భూమిలోకి తక్కువ నీరు చేరడానికి కారణమవుతున్నది. భూమి గట్టిపడటంతో నీరు ఇంకడం తగ్గిపోతున్నది.

భూమి గట్టిపడటానికి కారణాలు

 • భూమిలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం.
 • ట్రాక్టర్‌తో దున్నటంవల్ల గట్టిపొర ఏర్పడటం.
 • పంట కోత యంత్రాల బరువువల్ల నేల గట్టి పడటం.
 • రసాయన ఎరువుల అధిక వాడకం, ఫిల్లర్‌ పదార్థాలవల్ల భూమిలోని సూక్ష్మ రంధ్రాలు, దారులు మూసుకుపోవటం.
 • ఈ అంశాల దృష్ట్యా వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని, భారీ యంత్రాల వినియోగాన్ని తగ్గించుకోవటం అవసరం. అలాగే సేంద్రియ పదార్థాల వినియోగం పెంచుకోవటం వల్ల భూమిలోకి ఎక్కువ నీరు ఇంకేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పంట సరళిలో మార్పు ముఖ్యం
ఆధునిక వ్యవసాయంతో పంటల సరళిలో వచ్చిన మార్పుతో ఎక్కువ నీటి వినియోగం ఉండే పంటల వైపు, సాగు విధానాల వైపు రైతులు మళ్లుతున్నారు. ఉదాహరణకు ప్రస్తుత పద్ధతిలో వరి, పత్తి, చెరకులాంటి పంటల ఉత్పత్తికి ఎకరాకు 60లక్షల లీటర్ల నీరు ఖర్చవుతోంది. ఏడాదిలో 500 మిల్లీమీటర్ల వర్షంపడే ప్రాంతాల్లో ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు అందుతుందనుకుంటే అందుకు మూడు రెట్ల నీటిని ఒక పంటకాలంలోనే ఖర్చుచేస్తు న్నాం. అంటే ఎకరా వరి పంటకు ఆ ఎకరంలో మూడేళ్లు పడిన వర్షపునీటిని ఒకే పంటకు వాడుతున్నాం. ఇలా ఐదేళ్లు రెండు పంటల చొప్పున తీసుకుంటే 30 ఏళ్ల వర్షపునీటిని వాడేసినట్టే. మరోవిధంగా మన పొలం చుట్టుపక్కల 30 ఎకరాల్లో పడిన నీటిని వాడుకున్నట్టే! అందుకే పంట ప్రణాళిక, సాగు పద్ధతులకు స్థానిక వర్షపాతం, భూత త్త్వం, వాననీటి సంరక్షణను ఆధారం చేసుకోవా లి. ఇదే వాటర్‌ బడ్జెట్‌. సగటు వర్షపాతం కో స్తాంధ్రలో1,094, తెలంగాణలో961, రాయలసీమలో 680మిల్లీ మీటర్ల మేర ఉంది. ఇందులో చాలాభాగం వర్షపునీటిని చక్కటి పంట ప్రణాళిక, సాగు పద్ధతులతో సంరక్షించుకోవచ్చు.

ఇందుకోసం రైతులు ప్రధానంగా చేయాల్సింది

 • ఎక్కడ పడిన వర్షం అక్కడే ఇంకటానికి వీలుగా పొలంలో బోదెలకు చిన్నచిన్న అడ్డుకట్టలు వేసుకోవాలి.
 • పొలంలో పల్లం ఉన్న పాంతంలో సుమారు అడుగు వెడల్పు, ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు లోతులో ట్రెంచలు చేసుకోవాలి.
 • వీటి ద్వారా సగం నీరు భూమిలో ఇంకుతుంది అనుకుంటే బయటకు ప్రవహించి, వృథా అయ్యే నీటిని సంరక్షించుకునేందుకు నీటి కుంటలు తవ్వుకోవాలి.
 • వృథాగా పోయే నీటిని నిలబెట్టుకుని, సంరక్షించుకోవటం కోసం అడ్డుకట్టలు కట్టుకోవాలి.
 • వాలుకు అడ్డంగా దున్నుకోవటం, గట్టు వేసుకోవటం, పక్కనే ట్రెంచలు చేసుకోవడం ప్రధానం.
 • భూమిలో సేంద్రియ పదార్థం పెంచుకోవడం కోసం ఎకరాకు కనీసం 4 టన్నుల జీవ పదార్థాలు వేసుకోవాలి.
 • ఈదురు గాలులు, వేడిగాలులవల్ల పెరిగే నీటి ఆవిరిని తగ్గించటం కోసం పొలం గట్లమీద మొక్కలునాటి పెంచాలి.
– డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు,
సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త,
హైదరాబాద్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *