
- అన్న, డోర్సెట్ గోల్డెన్ రకాలు అనుకూలం
- 100 మంది రైతులతో సాగుకు శ్రీకారం
విశాఖ ఏజెన్సీలోని లంబసింగి ప్రాంతం యాపిల్ సాగులో ఆంధ్రాకశ్మీరంగా మారనుంది. 2014 జనవరిలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా యాపిల్ సాగును ప్రారంభించారు. సిమ్లాకు చెందిన ఉద్యాన పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రాంతం యాపిల్ సాగుకు అనుకూలమని ప్రకటించడంతో పాడేరు ఐటీడీఏ, ఏపీ ట్రైకార్ అధికారులు విశాఖ ఏజెన్సీలో కాఫీ తరహాలో యాపిల్ సాగును ప్రోత్సహించి గిరిజన రైతుల ఆర్థిక పురోగతికి తోడ్పడాలని సంకల్పించారు. యాపిల్ సాగుకు ఆసక్తిచూపుతున్న వందమంది రైతుల్ని ఎంపికచేసి వారికి మొక్కలు పంపిణీ చేశారు. సాగుకు అవసరమైన ఆర్థిక సహకారం, శిక్షణ కూడా ఇస్తున్నారు. విశాఖ ఏజెన్సీ రైతులకు శిక్షణ ఇస్తున్న అభ్యుదయ రైతు పురుషోత్తమరావు చెబుతున్న యాపిల్ సాగు విశేషాలు.
అనుకూల వాతావరణం
యాపిల్ సాగుకు ప్రధానంగా శీతల వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు మించి నమోదుకాకూడదు. ఒకటి రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా సమస్య ఉండదు.
అనువైన రకాలు: విశాఖ ఏజెన్సీ వాతావరణ పరిస్థితుల ఆధారంగా వాణిజ్య సరళి సాగుకు 1954లో బహమాస్‌లో అభివృద్ధి చేసిన ‘డార్సెట్ గోల్డెన్’, 1959లో ఇజ్రాయిల్ అభివృద్ధి చేసిన ‘అన్న’ రకాలు అత్యంత అనుకూలమని హిమాచల్‌ప్రదేశ్ మసోబ్ర, సిమ్లాకు చెందిన డాక్టర్ వైఎస్ ఫార్మర్ యూనివర్సిటీ అండ్ ఫారెస్ర్టీ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం, శిక్షణ కేంద్రం సూచించింది.
నాట్లు: యాపిల్ మొక్కలను జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ నాటు కోవచ్చు. మొక్కల మధ్య ఎనిమిది, వరుసల మధ్య పది అడుగులు దూరం పాటిస్తూ నాట్లు వేసుకోవాలి.
అనుకూలమైన ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఏజెన్సీ 10 మండలాలు, తూర్పుగోదావరి ఏజెన్సీలో మూడు మండలాలు, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా కేరిమేరి, ఉట్నూరు, ఆసిఫాబాద్ అనుకూలం.
ఎరువులు: మొక్క నాటే సమయంలో ఒక్కొక్క మొక్కకు 70 గ్రాముల నత్రజని, 35 గ్రాములు పాస్పరస్, 70 గ్రాముల నైట్రోజన్ వేసుకోవాలి. మొక్కలకు పదేళ్ల వయస్సు వచ్చేవరకూ ప్రతి ఏడాది ఇదే క్రమంలో ఎరువులు వేసుకోవాలి. పదేళ్ల తరువాత ఒక మొక్కకు 700 గ్రాములు నైట్రోజన్, 350 గ్రాముల పాస్పరస్, 700 గ్రాములు నైట్రోజన్ వేసుకోవాలి. ఎకరానికి 800 మొక్కలు వేసుకోవాలి.
పెట్టుబడి: యాపిల్ మొక్క హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.250 ధర ఉంది. ఏపీకి సరఫరా చేసేందుకు నర్సరీ యజమానులు రూ.300 తీసుకుంటున్నారు. రైతు ఎకర విస్తీర్ణంలో యాపిల్ సాగుచేసేందుకు రూ.2.4 లక్షలు, ఎరువులు, గుంతలు తీసి నాటుకోవడానికి అదనంగా మరో రూ.40 వేలు ఖర్చు అవుతోంది. ఒకసారి మొక్కలు నాటిన తరువాత నుంచి ప్రతి ఏడాది రూ.20-40 వేలు పెట్టుబడి పెట్టాలి.
దిగుబడి: మొక్కలు నాటిన రెండో ఏడాది నుంచి కాపు ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వరకూ కాపు తక్కువగా ఉంటుంది. ఐదేళ్ల తరువాత ఒక మొక్క నుంచి 15 నుంచి 18 కిలోల దిగుబడి వస్తుంది. ఒక మొక్క 20 ఏళ్లకుపైగా దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 15 టన్నుల దిగుబడి వస్తుంది.
9 లక్షల ఆదాయం: తాజా మార్కెట్ ధరల ఆధారంగా కిలో యాపిల్ (ఎనిమిది కాయలు) ధర రూ.50-60 ఉంది. ఆవిధంగా ఏడాదికి ఎకరాకి 9 లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను 6 లక్షల నికర ఆధాయం మిగులుతుంది.
యాజమాన్యం: ఏటా జనవరిలో యాపిల్ మొక్కలను ప్రూనింగ్ (అదనపు కొమ్మలు తొలగింపు) చేసుకోవాలి. మొక్కలు 12 అడుగులు మించి ఎదగకుండగా చూసుకోవాలి.
విశాఖ ఏజెన్సీలో ఏడాదికి రెండు పంటలను తీసుకునే వాతావరణ పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాపిల్ పంట కాలం ఆరు నెలలు మాత్రమే. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో అతి శీతల ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో యాపిల్ మొక్కలు పూర్తిగా నిద్రావస్థలో వుంటాయి. దీంతో ఏడాదికి ఒక పంట మాత్రమే వస్తోంది. విశాఖ ఏజెన్సీలో ఆ పరిస్థితులు లేవు. దీంతో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఒక పంట, జూలైలో మరో పంట పొందే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో యాపిల్ సాగు చేసే రైతులు ఏడాదికి రెండింతల ఆదాయం పొందవచ్చు. ఏపీలో సంప్రదాయేతర పంటగా తొలిసారిగా సాగుచేస్తుండడంతో యాపిల్ సాగుకు చీడపీడలు, తెగుళ్లు పెద్దగా ఆశించే అవకాశం ఉండదు. – ఆంధ్రజ్యోతి, చింతపల్లి
ప్రయోగాత్మక సాగు సక్సెస్
చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు చేపడుతున్న ప్రయోగాత్మక సాగు విజయవంతంగా కొనసాగుతోంది. మొక్కలు నాటిన రెండో ఏడాది నుంచే యాపిల్ మొక్కలు కాపుకొచ్చాయి. ఈ ఏడాది కాసిన యాపిల్ పండ్ల రంగు, రుచి బాగుంది.
– దేశగిరి శేఖర్, ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లి.
యాపిల్ సాగులో నాణ్యమైన మొక్కల ఎంపిక చాలా కీలకం. బహిరంగ మార్కెట్లో విక్రయించే మొక్కలు కొనుగోలు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏపీ, తెలంగాణ రైతులు మొక్కలను ఏవిధంగా కొనుగోలు చేయాలి, సాగు విధానంపై సలహాలు, సందేహాలు నివృతి చేసుకునేందుకు 7207501515 నంబర్‌కి కాల్ చేయవచ్చు. డీడీఎజిఆర్వోఎ్ఫఎఆర్ఎంఎస్ ఎట్‌ద రేటాఫ్ జిమెయిల్.కాం కి మెయిల్స్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
– పురుషోత్తంరావు, సిమ్లా సీపీఆర్ఐ అనుబంధ ఐపీఏ సభ్యుడు.