ఆయిల్‌పామ్‌ సాగుతో రైతుకు భరోసా

  • తూ.గో. .జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు
ఉపాధిహామీ దెబ్బతో కూలీల కొరత, కోతుల బెడద వంటి అనేక కారణాలతో జిల్లాలో మెట్టప్రాంతంలో పత్తి, మిర్చి వంటి కొన్ని పంటల సాగు అసాధ్యంగా మారింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వందలాది మంది రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించారు. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌ సాగు బాగా సులభంగా ఉంటుంది. మొక్కనాటిన మూడేళ్లకు గెలలు వస్తాయి. మొదట్లో గెలలను తొలి దశలోనే తుంచివేస్తారు. తర్వాత వచ్చే గెలలను ఫ్యాక్టరీకి తరలించి విక్రయిస్తారు. నాలుగు, ఐదేళ్ల నుంచి తోట ఫలసాయం వస్తుంది. తోట నాటిన ఏడేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు.. అంటే ఎనిమిదేళ్లపాటు అధిక దిగుబడి వస్తుంది. మొత్తం 25 ఏళ్ల వయసు వరకు ఆయిల్‌పామ్‌ లాభసాటి దిగుబడి ఇస్తుంది. ఎరువులు, మొక్కల సబ్సిడీ కలిపి హెక్టారుకి రూ 26 వేల వరకు ప్రభుత్వం నుంచి రైతుకు సబ్సిడీ రూపంలో అందుతోంది. ఇది కాకుండా డ్రిప్‌ ఇరిగేషన్‌కు 5 ఎకరాలలోపు రైతులకు 90 శాతం, 10 ఎకరాల వరకు 70 శాతం, ఆపై ఎన్ని ఎకరాలున్నా 50 శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇస్తున్నారు. సాగు ఖర్చు తక్కువగా ఉండటం, సబ్సిడీలు ఎక్కువగా రావడం, కూలీల అవసరం పెద్దగా లేకపోవడంతో ఆయిల్‌ పామ్‌ ఈ ప్రాంత రైతుల పాలిట వరంగా మారింది.

సులభ సాగు పద్దతులు
కొబ్బరి ఇతర పంటలతో పోలిస్తే దొంగల భయం ఉండని పంట ఇది. అలాగే పక్షులు, పశువులు కూడా ఆయిల్‌పామ్‌ గెలల జోలికి వెళ్లవు. దీంతో ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు కల్పతరువుగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, గండేపల్లి, రంగంపేట, జగ్గంపేట, పెద్దాపురం, బిక్కవోలు, తుని రూరల్‌, రౌతులపూడి, శంఖవరం తదితర మండలాల పరిధిలో ఆయిల్‌పామ్‌ తోటలు అధికంగా సాగుచేస్తున్నారు. యాజమాన్య పద్దతులు సక్రమంగా పాటించే రైతులకు ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌ ధర టన్నుకి రూ 8,150 ఉంది. ఎ.కరాకు రూ 80 వేల ఆదాయం వస్తే.. అందులో రూ 25 నుంచి రూ 30 వేల వరకు పెట్టుబడిపోతుంది. సొంత రైతుకు రూ 50 వేల వరకు మిగులుతున్నది. రూ 25 వేల వరకు కౌలుకి తీసివేస్తే.. మరో రూ 25 వేల వరకు కౌలు రైతుకు మిగులుతుంది.

– ఆంధ్రజ్యోతి ప్రతినిధి – కాకినాడ
ఎకరాకు పది టన్నుల దిగుబడి
ఐదెకరాల ఆయిల్‌ పామ్‌ తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఏటా 50 టన్నులకు పైగా దిగుబడి వస్తున్నది. ఈ ఏడాది 55 నుంచి 58 టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నాను. డ్రిప్‌ పద్ధతిలో నీరు అందిస్తున్నాను. ఎరువులు సక్రమంగా అందిస్తే ఎకరాకు పది టన్నుల దిగుబడి సాధించడం కష్టం ఏమీ కాదు. రంగంపేట, గండేపల్లి మండలాలలో ఎకరాకు పదిటన్నులకుపైగా దిగుబడి సాధిస్తున్న రైతులు అనేకమంది ఉన్నారు.
– కూసి వెంకట రమణ, గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ ఆయిల్‌పామ్‌ రైతు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *