ఉద్యానపంటల సాగులో మేటి మేడ్చల్‌

భాగ్యనగరాన్ని ఆనుకుని ఉన్న మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఉద్యానపంటలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. బోరుబావులే రైతులకు అధారం. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ ప్రాంత రైతులు మేలు రకం ద్రాక్షను సాగు చేసేవారు. ద్రాక్ష సాగుకు పెట్టుబడులు భారీగా కావాలి. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్న సందర్భాలు కోకొల్లలు. దాంతో వేలాది మంది రైతులు ఉద్యానపంటల సాగు వైపు మళ్లారు. జిల్లాలోని మేడ్చల్‌, శామీర్‌పేట్‌, కీసర, ఘట్‌కేసర్‌ మండలాలు కూరగాయల సాగుతో పాటు ద్రాక్ష, మామిడి, జామ, దానిమ్మ, నారింజ, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రస్తుతంజిల్లాలో దాదాపు 3వేల హెక్టార్లలో ఉద్యాన పంటలుసాగవుతున్నాయి. వీటిలో కూరగాయలు 1400 హెక్టార్లు, పండ్లతోటలు 1200 హెక్టార్లు, 250హెక్టార్లలో పలు రకాల పూలు సాగు చేస్తున్నారు. టన్ను ల కొద్దీ కూరగాయలను నగరానికి, కరీంనగర్‌, సిద్దిపేట జిల్లాల్లోని మార్కెట్లకు రైతులు తరలించి విక్రయిస్తున్నారు.
బాబాగూడ.. తీగసాగు అడ్డా
శామీర్‌పేట్‌ మండలంలోని బాబాగూడలో కూరగాయల సాగును నమ్ముకున్న రైతులు దాదాపు 200 మందికి పైగా ఉన్నారు. వీరు 20 సంవత్సరాలుగా ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. సీజన్‌ను బట్టి పంటలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ సీజన్‌లో కాకరకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, బీన్స్‌ తదితర రకాల కూరగాయలను పండిస్తున్నారు. బిందు సేద్యంతో ఈ పంటలు సాగుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యానశాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ భూమిని సిద్ధం చేయడం, విత్తనం ఎంపిక, సాగు విధానాలు మొదలు మార్కెటింగ్‌ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని లాభాల పథంలో నడుస్తున్నారు. ఏ పంటను సాగుచేసినా విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు మొత్తం కలిసి ఎకరాకు దాదాపు రూ.60 వేల వరకు ఖర్చు అవుతందని, ధరలను బట్టి రూ.లక్ష నుంచి రెండులక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు రైతులు. సాధారణంగా ఎకరాకు కూరగాయలు దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి రావాలి. ఎంత తక్కువగా వచ్చినా 6 నుంచి 7టన్నుల వరకు దిగుబడి ఖాయంగా వస్తుందని చెప్పారు రైతులు. పండించిన పంటలను మార్కెట్లలో ధరలను బట్టి సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి, సిద్దిపేట జిల్లాలోని ఒంటిమామిడి, కరీంనగర్‌కు తరలిస్తామని తెలిపారు. క్వింటాలుకు ఐదు రూపాయలు ఎక్కడ అధికంగా వస్తే అక్కడికి తీసుకెళ్తామని వారు వివరించారు
                                                                     – ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మేడ్చల్‌ జిల్లా
 
చంటి బిడ్డల్లా సాకాలి
కూరగాయల సాగులో ప్రతి మొక్కను ప్రాణంగా కాపాడుకోవాలి. ఎకరాకు 50 వేల ఖర్చు వస్తుంది. ప్రస్తు తం రెండెకరాల్లో బీరకాయను సాగు చేస్తున్నాను. ఎకరా కు 7 టన్నుల వరకు దిగుబడి ఇస్తే లాభాలు వచ్చినట్టు. లేకుంటే లాభం సున్నా. ప్రస్తుతం బీర కాయలు కోత దశలో ఉన్నాయి.
– పిన్నింటి సుదర్శన్‌రెడ్డి: రైతు, బాబాగూడ-9010451116
 
ఎకరాకు లక్ష లాభం
కూరగాయల సాగులో లాభాలు రాకున్నా నష్టాలు మాత్రం రావు. సీజన్‌ను బట్టి పంటలను మార్పిడి చేస్తు న్నాం. ప్రస్తుతం కాకరకాయ, పొట్లకాయను పండిస్తున్నాం. కోత దశలో ఉంది. ఎకరాలకు 7టన్నుల దిగుబడి వస్తే రైతుకు ఊరట. ప్రతి పంటకు ఖర్చులు పోగా రూ.50వేల నుంచి లక్షల రూపాయవరకు లాభాలు వస్తాయి.
– పి.బల్వంత్‌రెడ్డి, రైతు,బాబాగూడ-9177760243
సొంతగా విత్తనాలు సిద్ధం
కూరగాయల విత్తనాలు మేమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. గత ఏడాది పొట్ల, బీర, సొర పంటలను సాగుచేశాను. ఈ సీజన్‌లో పోల్‌ బీన్స్‌ పండిస్తున్నా. బీన్స్‌ విత్తనాలు స్థానికంగా దొరకడంలేదు. అందుకే నేనే సొంతగా బీన్స్‌ విత్తనాలు సిద్ధం చేస్తు న్నాను. సాటి రైతులకు మేలు రకం విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను
– సీతారాంరెడ్డి, రైతు, బాబాగూడ-90301417728

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *