కమాల్‌ కిసాన్‌.. బాబూలాల్‌

ఒకప్పుడు పాత రోత… కొత్త వింత… ఇప్పుడేమో… పాత వింత… కొత్త రోత… ఎందుకంటారా? ఇప్పుడు పాతదనమే ఒక మార్పుకు నాంది పలికింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పెద్దాయన దానికి కారణం. ఆయన పేరు బాబూలాల్‌ దహియా. ఈయన ఒక సామాన్య రైతు. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో ఒక మంచి పనిని ఆయన తన భుజాలకెత్తుకున్నాడు. ఆ కథేమిటంటే…
పాతది, పురాతనమైనది ఏదైనా సరే.. బాబూలాల్‌ కంట పడితే వదలడు. అది జనపదాల సాహిత్యం కావొచ్చు! మట్టి వాసనలు వెదజల్లే విత్తనాలు కావొచ్చు! అపురూపమైన వరి వంగడాలు కావొచ్చు! బాబూలాల్‌ సంప్రదాయ విత్తనాలను మొలకలతో మెరిపిస్తాడు. అంతేకాదండోయ్‌.. మన పూర్వుల వెరైటీ పంటల సువాసనలను నేటి తరానికి ‘రుచి’ చూపిస్తున్నాడు కూడా! ఏకంగా 110 రకాల వరి వంగడాలను పండించడమే కాదు, ఆ వంగడాల సంరక్షణకూ పూనుకున్నాడు. ఈ రైతులో ఓ కవి కూడా ఉన్నాడు.
ఆ మూడంటే ప్రాణం…
బాబూలాల్‌ దహియాది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్నా జిల్లా. పొద్దున్న లేచింది మొదలు ఆయన ఓ మూడు అంశాలపైనే ఉంటుంది. అవి ధాన్యం, విత్తన సంపద సేకరణ, జానపద సాహిత్య అధ్యయనాలు. ఇప్పటిదాకా బాబూలాల్‌ 110 సంప్రదాయ వరి వంగడాలను సేకరించాడు. ఆ వెరైటీలన్నింటినీ తన రెండు ఎకరాల భూమిలో సాగు చేస్తున్నాడు. పాత వంగడాలను సంరక్షించాలన్న లక్ష్యంతో ఈ పనికి పూనుకున్నాడు. ఇందులో కొన్ని వరి వంగడాలు వెయ్యేళ్ల క్రితం నాటివి కావడం విశేషం. మార్కెట్‌లోని పోటీ కారణంగా అపురూపమైన ఆ వంగడాలు కనుమరుగైపోయాయని బాబూలాల్‌ అంటాడు. ‘పదాలు, విత్తనాల వెనుక సుదీర్ఘ చరిత్ర దాగుంటుంది. అవి కనుమరుగైతే వాటికి సంబంధించిన అపార జ్ఞానసంపద కూడా అందకుండా పోతుంద’ంటాడు బాబూలాల్‌. ‘వరి వెరైటీల్లో తక్కువ నీటితో పండించేవి, జబ్బులను అరికట్టేవి ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. కానీ ఎక్కువ దిగుబడి, అధిక లాభాలు రావాలనే ఆశతో రైతులు హైబ్రిడ్‌ వెరైటీలు వేయడం ప్రారంభించారు. పైగా ఈ హైబ్రిడ్‌ వెరైటీలకు ఎక్కువ పురుగుమందులు, ఎరువులు కావాలి. ఇవి చాలు ఆహారం విషతుల్యం కావడానికి’ అన్నది బాబూలాల్‌ వాదన.
వెరైటీ వరి సాగులో దిట్ట…
బాబూలాల్‌ రైతు మాత్రమే కాదు మంచి కవి కూడా. అందుకేనేమో ఆయనలో సామాజిక స్పృహ కూడా ఎక్కువే. తన ఊరికి పొరుగున ఉన్న దాదాపు 24 గ్రామాల్లోని రైతులను, బడి పిల్లలను సంప్రదాయ పంటలు, కూరగాయల గురించి చైతన్య పరుస్తుంటాడు. వాటిని పెంచమని వారందరినీ ప్రోత్సహించాడు. ‘నేను 2005 సంవత్సరం నుంచి స్థానిక వరి వెరైటీలను సేకరించడం మొదలుపెట్టా. ఇప్పటికి మొత్తం 110 వరి వెరైటీలను సమీకరించాను. వీటన్నింటినీ నాకున్న రెండున్నర ఎకరాల భూమిలో వేసి సాగుచేస్తున్నాను. నేను సేకరించిన విత్తనాలను సీడ్‌ బ్యాంకులో భద్రం చేశాను. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు సహాయసహకారాలతో విత్తన బ్యాంకును మేం అభివృద్ధి చేశాం’ అని బాబూలాల్‌ తెలిపాడు.
 
విత్తనయాత్రలోనూ…
పోస్టుమ్యాన్‌గా పనిచేసి 2007లో రిటైర్‌ అయ్యాడు బాబూలాల్‌. బఘేలీ జానపద సాహిత్యం మీదున్న అభిమానంతో దాన్ని అక్షరబద్ధం చేస్తున్నాడు. జానపద కథలు, సామెతలు, పాటలు, జానపద వీరులు, రకరకాల అపోహలు… ఇలా ఎన్నో విషయాలను బాబూలాల్‌ డాక్యుమెంట్‌ చేస్తున్నాడు. మౌఖిక సాహిత్యంగా జనం నోట ప్రాచుర్యం పొందిన బఘేలీ జానపద సాహిత్యంపై ఐదు పుస్తకాలు, బఘేలీ కవితల మీద రెండు పుస్తకాలను రాశాడు. ‘జానపదపాటలు, ప్రవచనాలు, కథల్లో రకరకాల సంప్రదాయ పంటల ప్రస్తావన ఉంది. వాటిల్లో ‘కార్గి, సువర్‌ ఖాయే నసామ్‌ధీ’ల వంటి వరి వంగడాల ప్రస్తావన చూస్తాం. అప్పుడనిపించింది నాకు జానపద సాహిత్యాన్ని కాపాడితే ప్రజల సంప్రదాయ వరి వంగడాలను కూడా కాపాడినవాళ్లమవుతామ’ని అంటారు బాబూలాల్‌.
బాబూలాల్‌ అందించిన స్ఫూర్తితో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున విత్తన యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక విత్తన వెరైటీలను, కూరగాయల వెరైటీలను, ఔషధమొక్కలను బోర్డు సేకరించింది. బాబూలాల్‌, మరికొందరు పెద్దలు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు. ఇప్పటిదాకా 24 జిల్లాల నుంచి మొత్తం 1,600 విత్తన వెరైటీలను వీరు సేకరించారు. 1980ల్లో మధ్యప్రదేశ్‌ ఛత్తీస్ గఢ్‌లో 23,800 వరి వెరైటీలు ఉండేవి. కానీ వీటిల్లో చాలా వరకూ కనుమరుగయ్యాయి. ఒక్క సియోని జిల్లాలోనే 570 వరి వెరైటీలు ఉండేవి. అవి కాస్తా 2000 నాటికి 110కి పడిపోయాయి. అంటే 80 శాతం వరి వెరైటీలు కనిపించకుండా పోయాయి. వాటిని తిరిగి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు బాబూలాల్‌. ఇలాంటి కృషి ఇతర రాష్ట్రాల్లోనూ జరిగితే మరెన్నో వైవిధ్యమైన పంటలను వెలికి తీయగలుగుతాం.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *