డెయిరీతో లాభాల భేరి

  • 100 గేదెలతో లక్షల్లో ఆర్జిస్తున్న ఖమ్మం యువకుడు
అతను ఉన్నత చదవులు చదివాడు. సొంత గ్రామమంటే ప్రాణం. వ్యవసాయం అంటే మక్కువ.. ఈ రెండు అంశాలు అతడిని పల్లెబాట పట్టించాయి. స్వగ్రామం చేరుకుని వ్యవసాయం ప్రారంభించాడు. అప్పటికే తండ్రి నడుపుతున్న పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి ఉద్యోగం కంటే అధికంగా సంపాదించడంతో పాటు మరో పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన నెల్లూరి రవి.
ఖమ్మంజిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు కుమారుడు రవి. జర్నలిజంలో పీజీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం పోరాటం చేయడం మనస్కరించలేదు. తల్లిదండ్రులను చూసుకుంటూ స్వగ్రామంలోనే నలుగురికీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలని సంకల్పించారు. తండ్రి చేస్తున్న వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావించారు. దానికి అనుబంధంగా నడుస్తున్న డెయిరీని ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తే లాభాలు తప్పక వస్తాయని ఆలోచించారు.
2012లో 100 గేదెలతో ప్రారంభం…
2012లో మాటూరుపేటలోని 12ఎకరాల తన సొంత స్థలంలో రెండు షెడ్లు నిర్మించి కోటి రూపాయల పెట్టుబడితో 100 గేదెలతో డెయిరీ స్థాపించాడు. ఇందుకు బ్యాంకు నుంచి రూ.70 లక్షలను రుణంగా తీసుకున్నాడు. గ్రామానికి చెందిన 12 మంది సిబ్బందిని డెయిరీ నిర్వహణకు నియమించుకున్నారు. వంద గేదెలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వాటికి కావలసిన వసతులన్నీ స్వయంగా రవి సమకూర్చుతారు. దాణాగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పెసరపొట్టు, డెయిరీల్లో వాడే బలపాలు, మొక్కజొన్న పిండి గేదెలకు ఆహారంగా ఇస్తున్నారు. ప్రతిరోజూ గేదెలతో పాటు షెడ్లను పరిశుభ్రంగా కడిగి డెయిరీని అద్దంలా ఉంచుతారు. గేదెలు, పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే పాల దిగుబడి, స్వచ్ఛత పెరుగుతాయంటారు రవి.
పాలు తీసేందుకు యంత్రాల వినియోగం
డెయిరీని సమర్థంగా నిర్వహించేందుకు తాను చదివిన చదువులను ఉపయోగిస్తున్నారాయన. గేదెల నుంచి పాలు తీసేందుకు యంత్రాలను వినియోగిస్తున్నారు. పాలు తీసే యంత్రాన్ని ఒక్కోటి రూ.50 వేలతో కొనుగోలు చేసి పాలు తీసేందుకు వినియోగించటంలో విజయవంతమయ్యారు. ఒక్కో గేదె రోజుకు 3 నుంచి 5 లీటర్ల పాలు రెండుపూటలా ఇస్తుంది. ఇలా తీసిన పాలను ఎలాంటి కల్తీ లేకుండా మధిర మార్కెట్‌కు తరలించి రెండు కేంద్రాల ద్వారా నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు రవి. పాలకేంద్రాలకు ఇస్తే లాభం పరిమితంగా ఉంటుంది. మనం విక్రయించే పాలు స్వచ్ఛమైనవని వినియోగదారులు నమ్మితే పది రూపాయలు అధికంగా ఇచ్చి మరీ కొంటారు. అందుకే నేనే స్వయంగా పాలను విక్రయిస్తున్నానంటారు రవి.
సొంత మనుషులుంటే భేష్‌
సొంత మనుషులు ఉంటే పాడిపరిశ్రమ మరింత లాభసాటిగా ఉంటుందని రవి తండ్రి నెల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చిన్న స్థాయి నుంచి మొదలైన డెయిరీ ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది. ఒక్కో గేదెకు రోజుకు రూ.75 వరకు ఖర్చవుతుంది లీటరు రూ. 60 కు నేరుగా ప్రజలకు విక్రయిస్తే రూ.180 వస్తాయి. సొంత మనుషులయితే పశువులను శ్రద్ధగా పాషిస్తారు. అప్పుడు దిగుబడులు కూడా బాగా వస్తాయి. నీటి సదుపాయం, సొంత మనుషులు ఉండి గడ్డి పెంచేందుకు అవసరమైన భూమి ఉంటే పరిశ్రమ మంచి లాభదాయకం అన్నారు వెంకటేశ్వర్లు.
పశువులకు మేత, నీటి వసతి ఎంత ముఖ్యమో వాటికి సకాలంలో వైద్యం చేయించడం కూడా అంతే ముఖ్యం. గేదెలకు అనారోగ్యం వచ్చినప్పుడు షెడ్డు వద్దకే వైద్యులను పిలిపించి వైద్యం చేయిస్తున్నారు ఈ తండ్రీకొడుకులు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మధిర
యంత్రాలతో సక్సెస్‌
పాలు తీయడానికి యంత్రాలు వినియోగిచడం వల్ల ప్రయోజనం ఉండదనే అపోహ ఉండేది. కానీ పాలు తీసే యంత్రాలు కొని వాటిని ఉపయోగించడంలో మేం సక్సెస్‌ సాధించాం. ప్రజలకు నేరుగా స్వచ్ఛమైన పాలను అందించినప్పుడు నా శ్రమ ఫలించనట్టువుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. అందుకే పాలను ప్రజలకు నేరుగా విక్రయిస్తున్నాను. పది మందికి ఉపాఽధి కల్పిస్తూ స్వగ్రామంలో ఉండటం ఆనందంగా ఉంది.
– నెల్లూరి రవి, మాటూరుపేట,
సెల్‌నెంబర్‌: 9848402111
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *