తేనెటీగల పెంపకం.. లాభాలు మధురం

  • విజయరాయిలో వందలాది మందికి శిక్షణ ఏటా విస్తరిస్తున్న పెంపకం 
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చేపట్టేవారు. అడవులు తగ్గిపోయి పచ్చదనం లోపించడం, పరిశ్రమలు పెరిగిపోవడం, పొలాల్లో రసాయనాల వాడకం పెరిగిపోవడం తేనెటీగ ల పెంపకానికి అవరోధంగా మారింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్తరకం పనిముట్లు, ప్రక్రియలు అందుబాటులోకి రావటంతో క్రమంగా ఇది పూర్తిస్థాయి వృత్తిగాను, పారిశ్రామిక స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం రైతులతో పాటు నిరుద్యోగులు శిక్షణానంతరం ఈ పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సాధిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు కూడా తేనెటీగల పెంపకం వరంగా మారింది. ఆంధ్రప్రదేశలో 700 మంది తేనెటీగల పెంపకం చేస్తున్నారు. పశ్చిమగోదావరిలో 100 మంది, కృష్ణాజిల్లాలో 200 మంది, గుంటూరు జిల్లాలో 300 మంది ఈ తేనెటీగల పెంపకాన్ని చేస్తున్నారు. తెలంగాణలో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పెంపకం ప్రారంభమైంది.

తెలుగు రాష్ట్రా‌ల్లో ఒకే కేంద్రం 

పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం విజయరాయిలోని తేనెటీగల పెంపక ం, విస్తరణ కేంద్రంలో తేనెటీగల పెంపకంపై రైతులకు, నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు.ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ ఆధ్వర్యంలో 1981 సంవత్సరంలో రెండు తెలుగు రాషా్ట్రల ప్రజల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా శిక్షణ ఇచ్చారు. రైతులు, నిరుద్యోగులు, ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన తేనెటీగలను ఈ కేంద్రమే సరఫరా చేస్తుంది. ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తొలినాళ్ళలో తేనెటీగల ఉత్పత్తి కూడా ఇక్కడ జరిగేది. అయితే ప్రస్తుతం కేవలం ఈ కేంద్రం తేనెటీగలను రైతుల వద్దనుంచి తెచ్చి సరఫరా చేయటంతో పాటు ఈ పెంపకంపై శిక్షణా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

లాభాల తేనెపట్టు 
ఒక రాణి( పరిపూర్ణమైన ఆడ ఈగ). వేల సంఖ్యలో కూలి ఈగలు (అసంపూర్ణమైన ఆడ ఈగలు) , వందల సంఖ్యలో పోతు(మగ) ఈగలు ఒక గుంపుగా కలిసి ఉండటాన్ని తేనెపట్టు లేదా తేనెతుట్టె అంటారు. తేనె పట్టుకున్న బలాన్ని బట్టి శక్తి సామర్థ్యాలను ఆ పట్టులోని శ్రామిక(కూలి) ఈగల సంఖ్య బట్టి నిర్ధారిస్తారు. ఎన్ని ఎక్కువ శ్రామిక ఈగలు ఉంటే ఆపట్టును బలమైన తేనెపట్టు అంటారు తేనెపట్టుల అభివృద్ధికి, మంచి దిగుబడికి పుప్పొడి, మకరందం ఉండే పుష్పజాతులు అందుబాటులో ఉండాలి. అన్ని ప్రాంతాల్లో ఈ పుష్పజాతులు కొన్ని మాసాల్లో విరివిగా లభించడం వల్ల తేనెదిగుబడి ఎక్కువగా ఉంటుంది. మెట్ట ప్రాంతంలో నువ్వు, ఆవాలు, జనుము, పిల్లిపెసర, దోస, పుచ్చ, కంది మొదలైన పూతల వద్దకు తరలించి మంచి తేనె దిగుబడిని పొందుతున్నారు. వేప, తాడి, జీడిమామిడి, చింత, నల్లమంది, నేరేడు, ములగ, కానుగ, కరక్కాయ, కుంకుడు, నీలగిరి, కొబ్బరి, కాఫీ, నిమ్మ, నారింజ, మామిడి, బూరుగ, ఈత, పామాయిల్‌ చెట్లతో పాటు అపరాల పంటలు ఉన్న ప్రాంతాల్లో తేనెదిగుబడి ఎక్కువగా లభిస్తోంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఏలూరు సిటీ

భారీగా సబ్సిడీలు 
విజయరాయిలోని ఈ కేంద్రంలో శిక్షణ పొందిన తర్వాత కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. గ్రామీణ ఉపాధి కల్పనా పథకం ద్వారా జాతీయ బ్యాంకులలో రుణం పొందిన వారికి ఈ పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీలు అందజేస్తున్నారు. రూ. 10వేలు నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకులు రుణాలు అందిస్తుండగా ఈ పరిశ్రమ స్థాపించిన వారికి ఒసి పురుషులుకు మాత్రం 25 శాతం, మిగిలిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి మహిళలకు అందరికీ 35శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. బ్యాంకు రుణం పొందిన వారికి మాత్రమే ఈ సబ్సిడీలు అందజేస్తారు.

ఉజ్వల భవిత 
విజయరాయిలో ఉన్న రాష్ట్రస్థాయి తేనెటీగల పెంపక విస్తరణ కేంద్రంలో కేవలం శిక్షణా కార్యక్రమాలే నిర్వహిసున్నాం. ప్రస్తుతం తేనెకు మంచి గిరాకీ ఉండడంతో తేనెటీగల పరిశ్రమలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పరిశ్రమ పట్ల మొగ్గుచూపడంతో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశం ఉంది.

– తేనెటీగల విస్తరణ కేంద్రం అధికారులు వీఎస్‌ రావు, టీవీ రావు

కష్టమైనా లాభదాయకం 
అలవాటులేని వారికి కష్టమైన పరిశ్రమ, కష్టపడి పనిచేస్తే ఈ పరిశ్రమలో మంచి ఫలితాలను పొందవచ్చు. విజయరాయిలో అందించిన శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ శిక్షణతోపాటు ప్రయోగాత్మకంగా రైతుల వద్ద మెలకువలు నేర్చకుంటే తేనెటీగల పరిశ్రమలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 

Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *