- మంగళగిరి మండలంలో 400 ఎకరాల్లో సాగు.. ఎకరాకు 2 లక్షల ఆదాయం
- హైదరాబాద్, విజయవాడ మార్కెట్కు నిత్యం ఎగుమతులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతిచేరువలో ఉన్న పెదవడ్లపూడి గ్రామం నారింజతోటలు, కరివేపాకు సాగుతోపాటు మల్లెతోటలకూ పెట్టింది పేరు. పెదవడ్లపూడితో పాటు నిడమర్రు, బేతపూడి గ్రామాల్లోనూ మల్లెలు హెచ్చు విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వేసవి వస్తే చాలు…మంగళగిరి మండలంలోని ఈ మూడు పల్లెలు మల్లెల పరిమళంతో గుభాళిస్తూ ఉంటాయి. ఈ మూడు గ్రామాల్లో 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మల్లె తోటలు సాగవుతున్నాయి. ఇక్కడ సాగయిన మల్లెలు నేరుగా హైదరాబాదుకు నిత్యం రెండు టన్నుల వరకు ఎగుమతి అవుతాయి. విజయవాడ మార్కెట్ నుంచి విశాఖ, హైదరాబాదుకు మరో ఐదారు టన్నుల వరకు ఎగుమతి అవుతున్నాయి.
పండుగలు, పెళ్లిళ్ల వేళ.. మంచి ధర
మిగిలిన పైర్లకు, మల్లె సాగుకు ఎంతో వ్యత్యాసం ఉంది. మార్కెట్లో మల్లె ధరకు నిలకడ ఉండదు. రోజుకో ధర పలుకుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సందర్భాలలో పూలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో ధర అమాంతం పెరుగుతుంది. ముహూర్తాలు లేకున్నా, పండుగలు, పబ్బాలు తక్కువగా ఉన్నా ధరలు దారుణంగా పడిపోతాయి. దీనికితోడు వాతావరణం కూడా మల్లెల దిగుబడిని ప్రభావితం చేస్తుంటుంది. మల్లె రైతు మోము కళకళలాడాలంటే ఉష్ణోగ్రతలు 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండాలి. సాధారణంగా మల్లెలు బహుళ వార్షిక గుల్మాలు. ఒక్కసారి మల్లె అంట్లు వేస్తే… మూడో ఏట నుంచి మాత్రమే పెట్టుబడి సరిపడా పూలు కోతలు వస్తాయి. మూడో ఏడు దాటిన తోటలకు ఎకరాకు రూ.75 వేల వంతున తీసుకుని యజమానులు తోటలు కౌలుకు ఇస్తారు. చీడపీడల నివారణ, కోత కూలీ ఖర్చులు ఎకరాకు రూ.లక్షన్నర పైచిలుకు ఉంటాయి. వడ్లపూడి ప్రాంత రైతులు మల్లెలతోపాటు కనకాంబరం, సీజన్ల వారీగా వచ్చే బంతి, చామంతి, లిల్లీ పూలను పండిస్తూ అదనంగా ఆదాయం పొందుతున్నారు.
కృష్ణా జిల్లాకు విస్తరిస్తున్న సాగు
నిడమర్రు, బేతపూడి గ్రామాల రైతులు తమ పూలను స్కూటర్లు, బైకులపై నేరుగా విజయవాడ పూల మార్కెట్కు తరలిస్తుంటారు. ఈ రెండు గ్రామాల నుంచి విజయవాడకు నిత్యం ఏడు టన్నులకు పైగా పూలు వెళుతుంటాయి. ప్రస్తుతం పెదవడ్లపూడి మల్లె సాగు మైలవరం ప్రాంత రైతులను కూడా ఆకట్టుకుంది. దీంతో మైలవరం, ఆ పొరుగునే ఉన్న చండ్రగూడెం గ్రామాల్లో కూడా ఇంచుమించు వందెకరాలకు పైగా విస్తీర్ణంలో మల్లె సాగు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా నిత్యం విజయవాడ మార్కెట్కు మల్లెలు వస్తున్నాయి. సాధారణంగా ఒకింత ఉక్కపోతతో కూడిన ఉష్ణోగ్రతలు మల్లె కంతులు విరివిగా వచ్చేందుకు దోహదపడతాయి. ఇందుకు 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరమని రైతులు చెబుతున్నారు. 30 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు వుంటే వాతావరణంలోని తేమ, మంచుకు కంతులు సరిగా రావని రైతులు చెబుతున్నారు. అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే పూలు బాగా మెత్తబడి నాణ్యతను కోల్పోతాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజనలో కిలో మల్లె ధర వంద రూపాయలు దాటిపోతుందని కమీషన్ వ్యాపారి అన్నం వీరాంజనేయులు తెలిపారు. మల్లె ధరలు కనిష్టంగా కిలో రూ.పది నుంచి గరిష్టంగా రూ.రెండొందల వరకు వెళుతుంటుందని ఆయన చెప్పారు.