మేలురకం గొర్రెలతో ఆదాయం భళా

  • గొర్రెల ఆరోగ్య సంరక్షణపై డాక్టర్‌ డి. వెంకటేశ్వర్లు సూచనలు
వ్యవసాయదారులు, గొర్రెల పెంపకం కులవృత్తిగా ఉన్న యాదవ, గొల్ల, కురుమ వర్గాల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీ పథకాన్ని చేపట్టింది. తెలంగాణ పల్లెసీమలను సుసంపన్నం చేసే లక్ష్యంతో తలపెట్టిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల మంది గొల్ల కురుమలకు సుమారు కోటిన్నర గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. మంచి గొర్రెలను ఎలా ఎంపిక చేసుకోవాలి? వాటికి బీమా ఎలా చేయించాలి? గొర్రెల ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్‌ డి. వెంకటేశ్వర్లు ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.
గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మన రాష్ట్రంలో గొర్రెల సంపదను వృద్ధి చేసుకుంటున్నాం. గొర్రెల ఎంపికలో, వాటిని ఆరోగ్యంగా పెంచే విషయంలో పెంపకందారులు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి.
గొర్రెల ఎంపిక ఇలా…
  • మంద అభివృద్ధిలో గొర్రెల ఎంపిక కీలకం. గొర్రెల ఎంపిక, వాటి వయస్సు, బాహ్య లక్షణాలు, శారీరక స్థితి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసుకోవాలి.
  • అధిక మాంసాన్ని ఇచ్చే మేలు జాతి గొర్రెలు అయిన నెల్లూరు, డక్కని, మడ్గ్యాల్‌, మాండ్య జాతులను ఎంపిక చేసుకోవాలి.
  • ఆడ గొర్రెలు 1 నుంచి ఒకటిన్నర సంవత్సరం వయస్సు ఉండి, 25-30 కిలోల బరువు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. కింది దవడకు రెండు శాశ్వత పళ్లు వచ్చి ఉండాలి.
  • గొర్రెలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. కళ్లలో కాంతి ఉండాలి. మేత మేయడం, నెమరు వేయడం సాధారణంగా ఉండాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలి. కాళ్లు నిటారుగా ఉండాలి. దగ్గడం, కళ్లు, ముక్కుల నుంచి స్రవాలు కారడం, దవడ కింద వాపు, ఉబ్బిన పెదవులు, విరోచనాలు, నోటిలో పుండ్లు, చర్యవ్యాధులు, కుంటడం వంటి అనారోగ్య లక్షణాలు ఉండరాదు.
  • శారీరకంగా గొర్రెలు మంచి కండపుష్టి కలిగి ఉండాలి. బక్కచిక్కి ఉండకూడదు.
  • ఆడ గొర్రెల ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఒక ఈత గొర్రెలు లేదా పాలు మరచిన లేదా పాలుతాగే ఆడ గొర్రెపిల్లలు కలిగిన గొర్రెలను ఎంచుకోవాలి. పొదుగు మెత్తగా ఉండాలి. చనులు సమానంగా ఉండాలి.
  • విత్తనపు పొట్టేలు మందలో సగం అని ప్రతీతి. పొట్టేలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. మంచి లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి. వృషణాలు సమానంగా ఉండాలి. ఎలాంటి వాపు ఉండకూడదు. చర్యవ్యాధులు ఉండకూడదు.
ఆరోగ్య సూత్రాలు తప్పనిసరి
మందను తీసుకువచ్చిన 3-4 గంటల తరువాత గ్లూకోజ్‌ ద్రావణం తాగించాలి. 2వ రోజు నుంచి 4వ రోజు వరకు మల్టీ విటమిన్‌ సిరప్‌ ఇవ్వాలి. 5వ రోజు (2 నెలల వయసుపైబడిన గొర్రెల పిల్లలకు కూడా) నట్టల నివారణ చేపట్టాలి. 6వ రోజు నుంచి 8వ రోజు వరకు నోటి ద్వారా బి కాంప్లెక్స్‌ ఇవ్వాలి. నట్టల నివారణ మందులు తాగించిన 3-7 రోజుల తరువాత గొంతు వాపు, చిటుకు రోగం, పిపిఆర్‌, గొర్రె మసూచి టీకాలు వేయించాలి. టీకా వ్యాధి నిరోధక కాలం ముగిసేలోగా మళ్లీ టీకాలు వేయించాలి. రెండు టీకాల మధ్య 14 రోజుల వ్యవధి ఉండాలి. 3 నెలలకు ఒక సారి నట్టల నివారణ మందులు తాగించాలి. త్వరలో ప్రతి నియోజక వర్గంలో ఒక సంచార గొర్రెల వైద్య కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. గొర్రెలకు జబ్బు చేస్తే వెంటనే 1962 నెంబరుకు సమాచారమిస్తే సంచార వైద్య శిబిరం వచ్చి వైద్యం చేస్తుంది. మరిన్ని సలహాల కోసం సమీపంలో వున్న పశు వైద్యాధికారిని సంప్రదించాలి. లేదా 73373 62131 ఫోన్‌ నెంబర్‌కు ఉచితంగా ఫోన్‌ కాల్‌చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
బీమాతో ధీమా
లబ్ధిదారులు కొనుగోలు చేసిన గొర్రెలకు, కొనుగోలు చేసిన ప్రాంతం నుంచే బీమా సౌకర్యం ఉంటుంది. కొన్న గొర్రెల చెవికి సంబంధిత బీమా కంపెనీ ట్యాగ్‌ వేసిన తరువాత మాత్రమే వాటిని తరలించాలి. ట్యాగులు చెవి మధ్యభాగంలో వేయించాలి. ట్యాగ్‌ నెంబర్లు ఏయే లబ్దిదారులకు చెందినవో నమోదు చేసుకోవాలి. బీమా చేసిన గొర్రె అకస్మాత్తుగా లేదా వ్యాధుల వల్ల మరణిస్తే వెంటనే సంబంధిత పశువైద్యాధికారికి తెలియజేయాలి. అప్పుడే బీమా పరిష్కారం అవుతుంది.
వ్యవసాయం పరమ ప్రయోజనం కేవలం పంటలు పండించడం కాదు. నిండు మనసున్న మనుషుల అభ్యున్నతికి కృషి చేయడం.
– మసనొబు ఫుకుఒక, ప్రకృతి వ్యవసాయ ఆద్యుడు
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *