ఎంటెక్‌ రైతు.. హై టెక్‌ సేద్యం

 

  • ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్‌ యువ రైతు నవీన్‌
నిజామాబాద్‌కు చెందిన మగ్గిడి నవీన్‌ కుమార్‌ ఎంటెక్‌ చదివారు. కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. మనసు వ్యవసాయం వైపు మళ్లింది. స్వగ్రామం చేరుకున్నారు. బ్యాంక్‌లోన్‌ తీసుకుని పాలీహౌస్‌ ప్రారంభించారు. తొలి సంవత్సరమే మంచి లాభాలు గడించారు. అరుదైన చామంతుల నర్సరీ ఏర్పాటు చేసి తె లుగు రాష్ట్రాల్లోని జిల్లాలన్నింటికీ చేమంతి నారు సరఫరా చేస్తున్నారు. భేషైన సాగు పద్ధతులు అవలంబిస్తున్న ఆ యువరైతు పేరు ఇప్పుడు అంతటా మారుమోగుతున్నది.
నిజామాబాద్‌లోని కంఠేశ్వర్‌కు చెందిన మగ్గిడి నవీన్‌ కుమార్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదివారు. కొంత కాలం ఉద్యోగం చేశారు. ఎవరి దగ్గరో ఉద్యోగం చేసే కంటే పుట్టిన ఊళ్లో సొంతంగా వ్యవసాయం చేసుకుంటే మేలని భావించారు. డిచ్‌పల్లి మండలంలోని బీబీపూర్‌ తండా శివారులో కొంత భూమి సేకరించి పాలీహౌస్‌ సేద్యం చేయాలని సంకల్పించారు. అందుకోసం ఖర్చు భారీగా అవుతుంది. పాలీహౌస్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిసి దరఖాస్తు చేసుకున్నారు. 1.3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలీహౌస్‌ నిర్మించుకున్నారు. అందులో 90 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చింది.
పాలీహౌస్‌ సేద్యంలో మెళకువలు తెలుసుకున్న నవీన్‌ రొటీన్‌ పంటలను వదిలేసి మంచి ఆదాయం ఇచ్చే పంటల సాగు ప్రారంభించారు. చామంతి, బీర, టమాటా, చె ర్రీ టమాటా, క్యాప్సికం, వంకాయ, చిక్కుడు, బీర, సొర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌ పంటల సాగు చేపట్టారు. వీటి సాగులో ఆధునిక పద్ధతులు అవలంబించడంతో భారీగా దిగుబడులు సాధించాడు నవీన్‌. పాలీహౌస్ లో పండించిన నాణ్యమైన పంటలను హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు ఈ యువరైతు. తను పండించిన పంటలను స్వయంగా విక్రయించడం ద్వారా అధిక లాభాలు గడిస్తున్నారు.
లాభాల తెల్ల చామంతులు
మార్కెట్‌లో ఏ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉన్నదో గమనించి ఆ పంటలు సాగు చేయడం నవీన్‌ ప్రత్యేకత. ఈ సీజన్‌లో పూలకు మంచి డిమాండ్‌ ఉంటుందని గ్ర హించన ఆయన చేమంతి పూల సాగు ప్రారంభించారు. పాలీహౌస్లో చేమంతులు విరగకాశాయి. కేవలం చేమంతి పూల ద్వారా ఏడాది కాలంలో 15 లక్షల ఆదాయం సంపాదించారు నవీన్‌. చేమంతి సాగు చేపట్టడంతో ఆగకుండా చేమంతి నారును పెంచడం లాభదాయకం అని తెలుసుకున్నారా ఆ యువరైతు.చామంతి నర్సరీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 30 జిల్లాలకు మొక్కలను సరఫరా చేయడం ప్రారంభించారు నవీన్‌. దీనివల్ల అదనపు ఆదాయం పొందుఉన్నారు.
 
బీరసాగు భళా
పాలీహౌస్లో అర ఎకరంలో యాంటీ పాలీనేషన్‌ ద్వారా బీరకాయ పంటను సాగుచేసి మంచి దిగుబడులు సాధించాడు. వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. పంటలకు చీడపీడలు సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంటలను సాగుచేసి అధిక లాభాలు గడిస్తున్నారు ఈ రైతు. యాంటీ పాలినేషన్‌ ద్వారా బీరకాయ సాగు చేయడంతో ఆయనకు ఈ సీజన్‌లో 3లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది. మిగిలని పంటల సాగు ద్వారా ఉద్యోగంలో వచ్చే జీతం కంటే స్వయంకృషితో అధిక ఆదాయం పొందుతున్నారు నవీన్‌. తనతో పాటు పది మందికి జీవనోపాథి కల్పిస్తున్నారు అ విద్యాధిక రైతు.
పాలీహౌస్‌ సాగు ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. మరెక్కడా లేని విధంగా పాలీహౌస్‌ నిర్మాణానికి ఉద్యానవన శాఖ భారీ మొత్తంలో సబ్సిడీ అందజేస్తోంది. నిజానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోతే పాలీహౌస్‌ ఏర్పాటు చేయలేకపోయేవాడిని. ప్రస్తుతం పూలు, కూరగాయలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. మార్కెట్‌కు అనుగుణంగా పాలీహౌస్లో సాగు చేస్తే రైతులకు భారీగా లాభాలు ఆర్జించే అవకాశం వుంది. – నవీన్‌, రైతు, నిజామాబాద్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *