
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బట్టి వరి, పత్తి పంట సాగుచేసే రైతులు తగిన మెళకువలు, సస్యరక్షణ చర్యలు పాటించాలి. లేదంటే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పత్తిని ఆశించే తెగుళ్లు, వాటి నివారణ మార్గాలపై జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎస్.లక్ష్మణ్ పలు సూచనలు అందించారు.
గులాబీ రంగు పురుగును గుర్తించాలంటే..
పత్తి పంటకు ప్రధానంగా గులాబీ రంగు పురుగు బెడద పట్టుకుంది. గత రెండు సంవత్సరాలుగా పరిశీలిస్తే.. దీని ఉధృతి పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ గులాబీ రంగు పురుగును గుర్తించాలంటే రెండు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నా యి. అందులో మొదటిది పత్తిలో గుడ్డిపూలు ఏర్పడతాయి. ఈ గుడ్డిపూలను గుర్తించాలంటే తల్లి రెక్కల పురుగు లేత మొగ్గలపై గుడ్లు పెట్టి మొగ్గ లోపలికి పోయి ఆకర్షక పత్రాలను అల్లుకుని పువ్వు విచ్చుకోకుండా చేస్తాయి. దీంతో పువ్వులు పూర్తి స్థాయిలో విచ్చుకో కుండా వుంటే వాటిని గుడ్డిపూలు అని పిలుస్తారు. ఈ గుడ్డి పూలు మొత్తం తోట లో 10% వరకు వ్యాపించి ఉంటే గులాబీ రంగు పురుగు ఉధృతి వున్నట్లు భావించాలి.
అలాగే రెండో పద్ధతిలో లింగాకర్షక బుట్టలను అమర్చి ఈ పురుగు ఉధృతి గుర్తించవచ్చు. పత్తిని విత్తి న 45 రోజుల దశ, పూత దశలో పంట కంటే అడుగు ఎత్తులో ఎకరాకు 8 బుట్టల చొప్పున ఒక్కో బుట్టకు 50 ఫీట్ల దూరంలో ఉండే విధం గా అమర్చాలి. ఈ బుట్టల్లో వరుసగా మూడ్రోజులు ఒక్కో బుట్టలో 8 మగ రెక్కల పురుగులు పడితే పురుగు ఉధృతి ఉన్నట్లు గుర్తించాలి. గుడ్డిపూలను మొత్తం సేకరించి వాటిని దూరం గా వేసి కాల్చడం, భూమిలో పూడ్చిపెట్టడంగానీ చేయాలి. వేప నూనె (1500 పీపీఎం)ను లీటరు నీటికి 5 మి.లీ., ఒక గ్రామ్ సర్ఫ్ గానీ, ఒక మి.లీ. శాడోవీట్గానీ కలిపి పిచికారి చేయాలి. రసాయన మందులను వాడాలంటే 2 మి.లీ. ప్రొఫెనోపాస్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రామ్ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరోపైరిఫాస్ లీటరు నీటికి 2.5 మి.లీ. కలిపి మార్చి మార్చి ఉదయం 10 గంటల్లోపు లేదా సాయంత్రం 4 నుంచి 6 గంటల్లోపు పిచికారి చేస్తే పురుగు నివారణ జరుగుతుంది.
రసం పీల్చే పురుగు
పత్తి పంటను రసం పీల్చే పురుగు, పేను బంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశిస్తాయి. ఆకులు కిందికి ముడుచుకుని ఉంటాయి. ఆకు కింది భాగాన్ని చూస్తే ఇలాంటి తెగుళ్లు కనిపిస్తాయి. అయితే రసం పీల్చే పురుగు నివారణకు కాండం పూత పద్ధతిని పాటించి సులభంగా నివారించవచ్చు. ఇందుకోసం ఒక పాలు మెనోక్రోటోపాస్ మందు, 4 పాల్లు నీళ్లు కలిపి పత్తి మొక్క కాండానికి మధ్య భాగంలో ఒకవైపు మాత్రమే 2 నుంచి 3 అంగులాల పొడవున పూయాలి. ఈ పూతను ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలు 90 రోజు ల వయస్సు వచ్చే వరకు ఈ కాండం పూతను పూయడం ద్వారా రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. కాగా, వర్షాభావాన్ని తట్టు కోవడానికి లీటరు నీటిలో 10 గ్రాముల యూరియా కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
వరినాట్లు అదును దాటుతుంటే..
వర్షాభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో నాటు వేయకుండానే నారుమడులు ముదిరిపోతున్నాయి. ఇప్పటికే నారు పోసిన రైతులు నీళ్లు లేక నాట్లు వేయలేని వారు ఆగస్టు చివరిలోగా పూర్తి చేయాలి.

-డాక్టర్ ఎస్.లక్ష్మణ్, పొలాస ఏడీఆర్
Credits : Andhrajyothi