రైతుకు రెట్టింపు రాబడిలా?

  • ఉత్పాదకత పెంచాలి…
  • నష్టాలు నివారించాలి..
  • అనుబంధ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి..
  • కేంద్రం ఏడడుగుల వ్యూహం ఖరారు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. భాగస్వాములందరితో చర్చించి వ్యవసాయ శాఖ ఏడు సూత్రాలతో వ్యూహాన్ని రచించింది. శుక్రవారం వాటిని వెల్లడించింది.
ఉత్పాదకత పెంచాలి
ఉత్పాదకత పెంచాలంటే సాగునీటి వసతి పెరగాలి. కేంద్రం ‘’ఒక బొట్టుకు అధిక పంట’’ నినాదంతో పనిచేస్తూ ఇరిగేషన్‌ బడ్జెట్‌ను కూడా పెంచింది. ప్రతీ సాగు భూమికి నీరందించాలన్న ఉద్ధేశంతో ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెండింగ్‌లో ఉన్న మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. వాటర్‌షెడ్‌ అభివృద్ధి, నీటి సంరక్షణ, నిర్వహణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయతలపెట్టింది.
 
ఖర్చులు తగ్గాలి
భూసారం గురించి రైతులు తెలుసుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూపరీక్షలు చేస్తూ భూసార హెల్త్‌ కార్డులను అందజేస్తోంది. దాన్ని బట్టి రైతులు భూమిలో ఏ పంట వేయాలి, ఎంత మోతాదులో ఎరువులను వేయాలన్నది నిర్ణయించుకోవాలి. తద్వారా ఖర్చులు తగ్గుతాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. వేప నూనె పూత యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కిసాన్‌ కాల్‌ సెంటర్‌, కిసాన్‌ సువిధా యాప్‌ ద్వారా కేంద్రం ఇస్తున్న సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకోవాలి.
పంట నిల్వ నష్టాలు
పంట చేతికొచ్చిన తర్వాత రైతులకు అధికంగా నష్టం జరుగుతోంది. పంటను నిల్వ చేసుకోడానికి వసతుల్లేక తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీన్ని నివారించడానికి గోదాముల వినియోగాన్ని ప్రభుత్వం పోత్సహిస్తోంది. గోదాములకు పలు ప్రయోజనాలను కల్పిస్తూ ప్రభుత్వం రుణాలను ఇప్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గోదాములను, కోల్డ్‌ స్టోరేజ్‌ చైన్లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది.
అదనపు విలువ
ఫుడ్‌ ప్రాసెసింగ్‌తో పంట నాణ్యత పెరుగుతుంది. ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి కిసాన్‌ సంపద యోజన పథకానికి కేంద్రం రూ.6వేల కోట్లను కేటాయించింది. ప్రాసెసింగ్‌ సామర్థ్యం పెంచడానికి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 20లక్షల మంది రైతులకు లబ్ధి, 5లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
 
వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు
వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తోంది. ఈ-నామ్‌ వ్యవస్థను 445 మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చింది. మరిన్ని మార్కెట్లకు దీన్ని విస్తరించాలి. ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసుకోడానికి అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ) చట్టాన్ని సవరించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పింది.
నష్టాలు, భద్రత, సహకారం
ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టానికి పరిహారం చెల్లించడానికి కేంద్రం ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను ప్రవేశపెట్టింది. దీన్ని మరింత విస్తరించాలి. పంట నష్టాన్ని అంచనా వేయడానికి స్మార్ట్‌ఫోన్లు, శాటిలైట్‌ ఇమేజ్‌, డ్రోన్లు తదితర నూతన టెక్నాలజీ వినియోగం. ప్రీమియంను చెల్లించడానికి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సదుపాయాం కల్పించాలి. ఈ పథకం వల్ల పరిహారం 1.5 రేట్లు పెరిగింది.
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు:
ఉద్యాన పంటలు: ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధి పథకం ద్వారా మంచి మొలకలు, విత్తనాలు తదితర అవసరాల సరఫరా.
సమీకృత వ్యవసాయం: అన్ని అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను అనుసంధానం చేయాలి. దీంతో రైతుల ఆదాయం పెరగడమే కాకుండా కరువు, వరదల ప్రభావం పెద్దగా ఉండదు.
శ్వేత విప్లవం: రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ కింద మెరుగైన బ్రీడ్‌ ఆవులను సంరక్షించుకోవడం. డెయిరీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోంది. నీలి విప్లవం, ఆగ్రోఫారెస్ట్రీ, పౌల్ట్రీ, తేనెటీగల పెంపకంపై రైతులు దృష్టి సారించాలి. వీటికి కేంద్రం సహకారం అందిస్తుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *