వైరస్‌తో వరి దిగుబడికి గండి!

  • దిగుబడులు తగ్గేప్రమాదం
  • వరంగల్‌ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.ఉమారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వరి దిగుబడి ఈ సంవత్సరం తగ్గే అవకాశం వుంది. రాష్ట్రంలో సాధారణ వరి సాగు విస్తీర్ణం సుమారు 9.37 లక్షల హెక్టార్లు కాగా ఈ సంవత్సరం సుమారు 6.7 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిని సాగయింది. ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరుగా వర్షం కురిసి సాధారణ వర్షపాతం కంటే సుమారు 15 శాతం తక్కువ కురియడంతో చెరువుల్లో నీరు చేరలేదు. వరి విస్తీర్ణం తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు వరంగల్‌ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌ ఉమారెడ్డి. వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు ఆయన పలు సూచనలు చేశారు.
వర్షిభావం, ఆలస్యంగా నాట్లు వేయడం, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వరి పంట తగినంతగా ఎదగలేదు. దీనివల్ల వరి దిగుబడులు తగ్గేఅవకాశం వుంది. ఈ ఏడాది రైతులు సన్నరకాలైన సాంబ మశూరి, తెలంగాణ సోన, హెచ్‌ఎంటి సోనా, జైశ్రీరాం, సిద్ధి నెల్లూరు సాంబ లాంటి రకాలతో పాటు విజేతలాంటి దొడ్డు రకాలను సాగు చేశారు. ప్రస్తుతం వరి పైర్లకు చీడపీడల బెడద అధికంగా వుంది. దీని వల్ల కూడా పంట దిగుబడి తగ్గే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే వరి దిగుబడులు అధికంగా సాధించవచ్చు.
అధిక దిగుబడుల కోసం..
వరి సాగులో మెళకువలు పాటించినప్పుడు రైతుఉ అధిక దిగుబడులు సాధిస్తారు. సాధారణంగా అనుకూల పరిస్థితుల్లో 20 నుంచి 25 రోజుల వయస్సు గల వరి నారును నాటాలి. వాతావరణం అనుకూలించక ఆలస్యం అయిన ప్రాంతాల్లో కుదురుకు ఎక్కువ మొక్కలు నాటాలి. చదరపు మీటరు పరిధిలో ఎక్కువ కుదుర్లు ఉండేలా చూడాలి. పైరుకు వేయాల్సిన యూరియాను ప్రతీ 10 రోజులకొక మారు వేయాలి. కలుపును సకాలంలో నిర్మూలించాలి. ఎరువులను సిఫారసు మేరకు సరైన సమయంలో సరైన పద్ధతిలో వేయాలి. ప్రధానంగా పంట కాలంలో ఎకరాకు 2 బస్తాల యూరియా, ఒక బస్తా డీఏపీ, 40 కిలోల పొటాషియం వేయాల్సి ఉంటుంది. మోతాదు మాత్రమే కాకుండా సరైన సమయంలో ఎరువులు వేయాలి.
డీఏపీ బస్తాతో 20కిలోల పొటా్‌షను కలిపి నాటు వేసేటప్పుడు దుక్కిలో వేయాలి. అనంతరం యూరియాను ప్రతీ పది నుంచి 15 రోజులకొకసారి పొలంలో నీళ్లు లేని సమయంలో చల్లి 48 గంటల తర్వాత పొలానికి నీరు పెట్టాలి. యూరియాను నీటిలో వేస్తే వృథా అవుతుంది. ఆశించిన పెరుగుదల ఉండదు. ప్రతీ పంట కాలానికి విధిగా 20నుంచి 40కిలోల జింకు సల్ఫేట్‌ను వేయాలి. చౌడు నేలల్లో జింక్‌ మోతాదును రెట్టింపు చేయాలి. అవసరమైతే నాటిన 20 నుంచి 25రోజులకు పైరుపై జింక్‌ సల్ఫేట్‌ను పిచికారి చేయాలి. మూడుదఫాలుగా యూరియా వేయాల్సి ఉండగా చివరి దఫా వేసే యూరియాతో పొటా్‌షను కలిపి పొలంలో చల్లాలి.
చీడపీడలు అధికం
నారిమడి నుంచే చీడపీడల నివారణ చర్యలు చేపట్టాలి. నాటు వేసేందుకు వారం రోజుల ముందుగానే ఎకరా పొలానికి సరిపోయే వరినారుకు సుమారు 800గ్రాముల 3జీ గుళికలు వేయాలి. వరి నాటిన తర్వాత 12నుంచి 15రోజులలోగా పొలంలో నీరుపెట్టి ఎకరాకు 10కిలోల 3జీ గుళికలు వేయాలి. గుళికలను ఎట్టిపరిస్ధితుల్లో యూరియాతో కలిపి వేయకూడదు. యూరియాను పొలం బురదగా ఉండే సమయంలో, గుళికలను పొలంలో నీరు ఉండే సమయంలో చల్లాలి. నాటే పొలంలో ప్రతీ రెండు మీటర్లకు 20సెంటిమీటర్ల వెడల్పుతో కాలిబాటను తూర్పు,పడమరలుగా ఉండేలా చూడాలి.
సుడిదోమతో తంటా
సుడిదోమ వర్షాకాలంలో వరిని ఎక్కువగా ఆశిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. పైరు పిలక దశలో ఉన్న సమయంలో దోమలు చేరుతాయి. మొక్కల మొదళ్లలో రైతులు పరిశీలిస్తే కుదురుకు 10 నుంచి 15 దోమలు ఉంటే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దోమల నివారణకు లీటరు నీటికి 1.5 గ్రాముల అసిఫేట్‌ లేదా 2 మి.లీ ఇతెఫెన్‌ పాక్స్‌ను మొక్కల మొదళ్లలో పడేలా స్ర్పే చేయడం ద్వారా నివారించవచ్చు. దోమ ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే అసిఫేట్‌కు ఒక మి.లీ చొప్పున కలిపి పిచికారి చేయాలి. అయితే మందు పిచికారికి ముందు పొలాన్ని ఆరబెట్టాలి. కాండం తొలిచే పురుగు వరి పైరును పిలక దశలో, కంకి వేసే దశలో రెండు పర్యాయాలు ఆశిస్తుంది. పిలక దశలో మొవ్వ ఎండిపోతుంది. కంకి దశలో తెల్ల కంకి ఏర్పడుతుంది. వీటి నివారణకు ఎకరానికి 10కిలోల 3జీ గుళికలను కానీ లేదా లీటర్‌ నీటికి రెండు గ్రాముల కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా 0.3 పొరాజిన్‌ పిచికారి చేయాలన్నారు డాక్టర్‌ ఆర్‌. ఉమారెడ్డి.
– ఆంధ్రజ్యోతి వ్యవసాయ ప్రతినిధి, వరంగల్‌
 
కాండం తొలిచే పురుగు
కాండం తొలి చే పురుగు ఉనికిని గమనించడానికి ఒక ఎకరా పొలంలో 8 లింగాకర్షణ బుట్టలను పెడితే అందులో 8 నుంచి 10 పురుగులు పడితే లింగాకర్షక బుట్టలను మరికొన్నింటిని పెట్టాలి. దీంతో ఆడ, మగ పురుగులు సంయోగం చెందక పురుగుల సంతతి నశిస్తుంది. వరిని ఆలస్యంగా నాటడం, గుళికలు అవసరమైన మేరకు వేయకపోవడం, నాణ్యమైనవి కాకపోవడం తదితర పలు రకాల కారణాలతో వరి పైరులో ఉల్లికోడు ఆశిస్తుంది. దీనికి పురుగు మందులను స్ర్పే చేయాల్సిన అవసరం లేదు. గుళికలు మాత్రమే వేయాలి.
నేలతల్లి జీవితాలను అనుసంధానం చే స్తుంది. అందరికీ మూలం… సర్వస్వం భూమే. భూమిని పదిలంగా కాపాడుకో లేకపోతే మానవాళికి మనుగడ వుండదు
– వేండల్‌ బెల్లీ
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *