సాగులో సరికొత్త సృష్టి

  • నయా పరికరాలతో సాగుబడి
  • ఇంజనీరింగ్‌ చేసి తండ్రి కోసం ఓ తనయుడు
  • టెన్త్‌ చదివి కళ్లు చెదిరే ఆవిష్కరణలతో మరో రైతు
  • కొలిమి అనుభవంతో సాగు యంత్రాల తయారీ
  • విత్తులు వేసే మల్టీ మిషన్‌
  • పొత్తులు యేరే చేతి పరికరం

ఎవరో వచ్చిందాకా వారు ఆగలేదు. వారే చక్రం పట్టారు. యంత్రం తిప్పారు. నయా సాగు పరికరాలకు వారే సృష్టికర్తలు అయ్యారు. తండ్రి తిప్పలు చూడలేని కుమారుడు.. తన ఇంజనీరింగ్‌ చదువుల సారాన్ని సేద్యంలోకి మళ్లించాడు. ఆదా, ఆసరా దిశగా ఆవిష్కరణలు చేశాడు. ఇక రైతే.. పొలంబాటలో ప్రయోగాలకు తెరతీసిన వైనం, వ్యవ సాయ యంత్రీకరణలో నూత్న చరిత్రని లిఖించింది.

కూలీలను పెట్టుకొని రైతులు విత్తనాలు నాటిస్తుంటారు. సాలు సాలులో విత్తనం ఎలా పడుతుందనేది దగ్గరుండి చూసుకొంటారు. విత్తనానికీ విత్తనానికీ మధ్య ఎడం పెరుగుతుంటే కూలీలను హెచ్చరిస్తుంటారు. ఉపాధి హామీ పథకం పనులు ఊళ్లో పెరిగిపోయాక.. కూలీలు దొరకడం కష్టం అయిపోయింది. దీనికోసం ప్రభుత్వం విత్తనాలు నాటే యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. వాటితో రైతుల అవసరాల చాలామటుకు తీరుతున్నాయి. కానీ, పక్కాగా అవి పని చేస్తున్నాయని చెప్పలేం. డ్రమ్‌ సీడర్‌ తయారీ సమయంలో దీనిపై బాబూరావు దృష్టి పెట్టారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యంత్రాన్ని ఉపయోగించినప్పుడు.. ఒక్కోసారి విత్తనాలు మరీ దగ్గరగా పడుతుంటారు. కొన్ని చోట్ల రెండేసి విత్తులు పడతాయి. కానీ, రైతులకు విత్తన ఆదా చేసేలా బాబూరావు తన మిషన్‌ని సిద్ధం చేశాడు. విత్తన రకం ఆధారంగా సర్దుబాటు చేసుకొనే వెసులుబాటు ఉండటం ఈ యంత్రం ప్రత్యేకత. ఈ డ్రమ్‌ సీడర్‌కు అనుబంధంగా చిన్నపాటి నాగళ్లు ఉంటాయి. విత్తనం పడకముందు అవి.. అక్కడ సాలు చేస్తాయి. విత్తనం నాటగానే.. దాని మీద మట్టిని కప్పుతాయి. పురుగు మందు పిచికారీకి ఈ యంత్రానికి ప్రత్యేక సిలెండర్‌ ఏర్పాటు చేశారు.
కాలం, ఖర్చు ఆదా
సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో విత్తనాలు వేయాలంటే మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు అవుతుంది. అదే బాబూరావు యంత్రంతో ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలతో పని అయిపోతుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రాడ్లుతో తయారుచేయడం వల్ల తేలికగా ఇద్దరు మనుషులు లాగొచ్చు. తయారీకి రూ.48వేలు ఖర్చు అయిందని బాబూరావు తెలిపారు.
గింజలను వేరుచేసి..
మొక్కజొన్న పొత్తుల నుంచి గింజలను విడదీసేందుకు పెద్దపెద్ద మిషన్లు, దానికి అనుసంధానంగా ట్రాక్టర్‌ తప్పనిసరిగా ఉండాలి. వీటిని ప్రభుత్వం రైతులకు సమకూరుస్తోంది. మార్కెట్‌లో లక్ష రూపాయలకు దొరికే వాటిని ప్రభుత్వం రూ.50 వేలుకు అందిస్తోంది. కానీ, చిన్న, సన్నకారు రైతుల కోసం మాన్యువల్‌గా పనిచేసే యంత్రాన్ని బాబూరావు తయారుచేశాడు. నాలుగు కండెల నుంచి ఒకేసారి గింజలు తొలగించవచ్చు. ఇలా గంటలో క్వింటా నుంచి, ఒకటిన్నర క్వింటాళ్ల గింజలు వొలిచేస్తుంది. గత మార్చి 24న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్ మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ నుంచి ఇన్నొవేషన్‌ అవార్డును బాబూరావు పొందాడు. పాండిచ్చేరిలో జరిగిన జాతీయస్థాయి వ్యవసాయ పరిశోధనలు, ప్రదర్శనలలో పాల్గొని బహుమతి గెలుచుకొన్నాడు.
రైతుల కోసమే..
ఎన్నో కంపెనీలు నాకు ఆహ్వానాలు పంపించాయి. తమతో కలిసి పనిచేయాలని అనేక సంస్థలు పిలిచాయి. అయితే, రైతులను, వ్యవసాయాన్ని వదులుకొనే వెళ్లడం నాకు ఇష్టం లేదు. నా పరిశోధనల వల్ల రైతులకు ఏ కొంచెం మేలు కలిగినా నాకదే పదివేలు. నేను చిన్నరైతును. ప్రయోగాలు చేసేంత స్తోమత లేదు. అందువల్ల ఎక్కువగా ఈ రంగంలో పనిచేయలేకపోతున్నాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయగలుగుతాను.
– దమరసింగి బాబూరావు
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన దమరసింగి బాబూరావు చదివింది పదో తరగతి. వ్యవసాయం చేస్తాడు. అన్‌సీజన్‌లో వెల్డింగు పనులతో కడుపు నింపుకొంటాడు. ఈ కొలిమి అనుభవంతో రైతులకు సాగులో తోడ్పడే అనేక పరికరాలను బాబూరావు తయారుచేశాడు. ఉదాహరణకు, ప్రభుత్వం రాయితీపై రైతులకు డ్రమ్‌ సీడర్‌లను రాయితీపై అందిస్తోంది. దాని ద్వారా ఎకరా పొలంలో పంట వేయడానికి 15 కేజీలు విత్తనం కావాలి. బాబూరావు తయారుచేసిన డ్రమ్‌ సీడర్‌ ద్వారా నాటడానికి మూడు కిలోల విత్తనాలు చాలు. విత్తడానికి బహుళ ప్రయోజన యంత్రాన్ని బాబూరావు సిద్ధం చేశాడు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *