సాఫ్ట్‌వేర్‌ను వదిలి.. సాగుబాట పట్టి

  • ముంబైలో ఉద్యోగం వదిలేసి పల్లెకు
  • కూరగాయలు పండిస్తున్న శ్రీనివాస్‌
  • చౌహన్‌క్యూ, పాలేకర్‌ విధానాలు అమలు
  • వ్యవసాయంపై మక్కువే కారణమని వెల్లడి
కరీంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఎంబీఏ విద్యనభ్యసించాడు! ముంబయిలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు! మంచి ఉద్యోగమే చేస్తున్నా మనసులో ఏదో అసంతృప్తి! పలు రాష్ట్రాల్లోని రైతులు లాభాలబాటలో నడుస్తుంటే మన రాష్ట్రంలోని రైతులెందుకు అప్పులపాలవుతున్నారని మథన పడ్డాడు. లక్షలు రాకున్నా వ్యవసాయంతో లక్షణంగా బతికే అవకాశముందని చెప్పేందుకు ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టాడు! వ్యవసాయం చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ యువకుడే కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్‌ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్‌. వ్యవసాయం మీద మక్కువతో ముంబైలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరు వచ్చేశాడు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఆధునాతన పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టాడు. దక్షిణకొరియాలో చౌహన్‌క్యూ పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం అతడిని ఆకర్షించింది. దేశీయ సూక్ష్మ జీవులతో వ్యవసాయం చేయడం, మనకు అందుబాటులో ఉన్న నూనెలు, ఇంటిలో ఉండే వంట పదార్థాలు సస్యరక్షణకు స్థూల, సూక్ష్మ పోషకాలు అందించేందుకు తోడ్పడుతాయని గ్రహించాడు. వాటినే ఉపయోగించే వ్యవసాయం చేస్తున్నాడు.
రెండెకరాల్లో బోడకాకర, ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు, బెండ, మరో ఎకరంలో అనప, అలసంద, గోరుచిక్కుడు పంటలు సాగు చేస్తున్నాడు. పాలేకర్‌ వ్యసాయ విధానాలను చౌహన్‌క్యూ సిస్టమ్‌తో సమ్మిళితం చేసి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. బోడకాకర కిలోకు హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి రైతులకు గరిష్ఠంగా రూ.120, కనిష్ఠంగా రూ.80 లభిస్తుంది. దిగుబడి ఎకరాకు కనీసంగా 50 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సగటున ఒక రైతు రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే, బోడకాకర సాగులో మగ, ఆడ మొక్కలను గుర్తించి వాటిని అవసరమున్న మేరకే ఉంచుకొని మిగతా వాటిని తీసేయడం ప్రధాన ప్రక్రియ. ఇతర రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు శ్రీనివాస్‌ బోడకాకర సాగును ఎంచుకున్నాడు. డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆర్‌వీఎ్‌సకే రెడ్డి, రవి హైబ్రిడ్‌ సీడ్స్‌ వ్యవస్థాపకులు మన్నేపల్లి రవి సూచనలతో స్ఫూర్తిపొంది రెండెకరాల్లో బోడకాకర వేశాడు. ఇప్పటికే మూడు కటింగ్‌లలో క్వింటాలున్నర బోడకాకరను మార్కెట్‌కు పంపించారు.
సేంద్రియ ఎరువులతో దేశవాళీ రకాల సాగు
ఉప్పు తప్ప ఆహార పదార్థాలన్నీ పెరటిలోనే పండించుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యాన్నివ్వాలనే లక్ష్యంతో పల్లెకు వచ్చి వ్యవసాయాన్ని ఎంచుకున్నా. బోడకాకర, అలసంద, చిక్కుడు, గోరుచిక్కుడు, సొరకాయ, శీతాకాలంలో అయితే టమాటలను సేంద్రియ ఎరువులతో పండించవచ్చు. ఆధునిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులకు కలిపి వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఇలా వ్యవసాయం చేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *