స్మార్ట్‌ సేద్యం..రైతుకు లాభం

దేశంలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి జరిగినా వ్యవసాయం రంగం మాత్రం అభిలషణీయమైన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. యువత వ్యవసాయానికి దూరం కావడానికి ఇదే ప్రధాన కారణం. సేద్యానికి సంబంధించిన అన్ని రంగాలను సమన్వయం చేయాలి. చిన్నరైతుల ఆదాయం పెంచే దిశగా కృషి జరగాలి. దాంతో పాటు రైతులు స్మార్ట్‌ సేద్యం చేసినప్పుడే దేశం పురోగమిస్తుందంటున్నారు హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ, యాజమాన్య సంస్థ (మేనేజ్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వి. ఉషారాణి.
వ్యవసాయానికి దూరం అవుతున్న రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాలంటే ఏం చేయాలి?
వ్యవసాయం బతకాలంటే రైతుల ఆదాయం పెరగాలి. వ్యవసాయం అంటే కేవలం పంట పండించడం కాదు. ఏ పంటను ఏ కాలంలో, ఎంత తక్కువ ఖర్చులో పండించాలనే ప్రణాళిక వుండాలి. పండిన పంటకు అధిక ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలి. వ్యవసాయం పనులు ఏడాది అంతా వుండవు కాబట్టి మిగిలిన రోజుల్లో చిన్నపాటి వ్యవసాయ ఆధారిత వాణిజ్యంపై దృష్టి సారించాలి. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. యువత కూడా క్రమంగా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తుంది. ఆదాయం పెరగడంతో పట్టణాలకు వలస తగ్గి పల్లెలు మళ్లీ కళకళలాడతాయి.
వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ‘మేనేజ్‌’ ఎలాంటి చర్యలు చేపడుతున్నది?
వ్యవసాయ రంగ సమగ్ర వికాసం మేనేజ్‌ లక్ష్యం. రైతుల సంక్షేమం కోసం కృషి చేసే నిపుణులకు శిక్షణ ఇవ్వడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా రైతుల్ని బలోపేతం చేస్తున్నాం. 20 ఏళ్లుగా అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు నిర్వహిస్తూ దేశానికి నిపుణులైన అగ్రి మేనేజర్లను అందిస్తున్నాం. వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా గ్రామీణ యువతకు అగ్రి క్లినిక్స్‌ పేరిట 13 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55 వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చాం. వారిలో 20 వేల మందికి పైగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు.
వ్యవసాయ ఆధారిత రంగ అభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. గిడ్డంగుల నిర్వహణపై యువతకు త్వరలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సప్లయ్‌ ఛైన్‌ మేనేజ్‌మెంట్‌పై సర్టిఫికెట్‌ కోర్సు తలపెట్టాం. రైతులు ఏ పంటను ఎప్పుడు పండించాలనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా వున్న వివిధ వ్యవసాయ అనుబంధ సంస్థల వద్ద వున్న సమాచారాన్ని క్రోడీకరించి నాలెడ్జ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్ల ద్వారా రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు వ్యవసాయ అనుబంధ వాణిజ్యంపై దృష్టి సారించేలా పనిచేస్తున్నాం.
రైతులు ఏ వ్యవసాయ అనుబంధ వాణిజ్యం చేయాలంటారు?
ఏడాదంతా పొలం పనులు వుండవు. కొన్నాళ్లు పనిచేసి, మిగిలిన రోజులు ఖాళీగా వుండటం వల్ల రైతులకు ఆదాయ భద్రత లేకుండా పోతున్నది. అందుకే రైతులు వ్యవసాయ అనుబంధ వాణిజ్యంపై దృష్టి పెట్టాలి. తేనె, కొబ్బరినూనె తయారీ, చిరుధాన్యాలతో ఫ్లేక్స్‌, చిప్స్‌ వంటి ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించడం, పచ్చళ్లు, ప్యాకింగ్‌ వంటి వందలాది వ్యవసాయ అనుబంధ పనులపై రైతులు దృష్టి సారించాలి. వీటి ద్వారా నామమాత్ర పెట్టుబడితో రైతులు అదనపు ఆదాయం పొందుతారు. ఎగుమతులు చేసేందుకు వీలుగా నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తే రైతులకు తిరుగే వుండదు.
వ్యవసాయరంగ విస్తరణ విషయంలో మిగిలిన దేశాల అనుభవాల గురించి చెబుతారా?
అభివృద్ధి చెందిన దేశాల్లో రైతు డిమాండ్‌ ఆధారంగా పంటలు పండిస్తాడు. రైతు పండించే పంటను మార్కెట్‌ ముందే సిద్ధంగా వుంటుంది. మన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఈ ఏడాది ఏ పంట పండిస్తే లాభదాయకమో రైతుకు తెలియదు. పండించిన పంటకు ఎంత ధర వస్తుందో అసలే తెలియదు. మంచి ధర రానప్పుడు సరుకును గిడ్డంగుల్లో నిల్వ చేద్దామన్నా అవకాశం వుండదు.
దేశంలో వ్యవసాయానికి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ అనుసంధానం చేసినప్పుడే రైతుకు లబ్ధి చేకూరుతుంది. పండించిన పంట రైతు నుంచి కొనుగోలుదారుకు చేరే వరకు పటిష్ఠమైన వ్యవస్థ వుండాలి. అమెరికాలో స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసే ఔత్సాహికుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. మనం మాత్రం బ్రాండ్ల మోజులో అంకుర సంస్థలు ఉత్పత్తి చేసే నాణ్యమైన ఉత్పత్తులను కూడా పట్టించుకోం.
 
వ్యవసాయంపై రైతు దృక్పథంలో మార్పు రావాలంటారా?
ఖచ్చితంగా. కేవలం సాగుకు మాత్రమే పరిమితం కాకుండా రైతులు కాస్త సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు గమనించాలి. నాణ్యమైన ఉత్పత్తుల్ని ఇప్పుడు దేశంలో ఎక్కడైనా మంచి ధరకు విక్రయించుకునే వీలుంది. ఇలాంటి ఆధునిక సమాచారాన్ని రైతులు తెలుసుకోవాలి. అప్పుడే అన్ని రంగాల మాదిరిగా వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి సాధిస్తుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *