అంజీర సాగు భళా!

తీవ్ర వర్షాభావంతో సతమతమయ్యే అనంతపురం జిల్లా పండ్లతోటల సాగులో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రధానంగా వేరుశనగ సాగు చేసే జిల్లా రైతులు కరవు పరిస్థితుల్లో ద్రాక్ష, అంజీర, దానిమ్మ, జామ, మామిడి లాంటి పండ్లతోటల సాగుపై దృష్టి పెట్టారు. మార్కెట్‌లో మంచి ధర పలికే అంజీరను అనంతపురం రైతులు అవలీలగా సాగు చేసి అధిక లాభాలు గడిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని కూడేరు, గార్లదిన్నె, బొమ్మనహాళ్‌, డీ హీరేహాళ్‌ మండలాల్లో రెండు వేల ఎకరాలకు పైగా అంజీర పంటను రైతులు సాగు చేస్తున్నారు. సంవత్సరంలో 270 రోజుల పాటు పంట దిగుబడి వస్తోంది. బొమ్మనహాళ్‌ మండలంలోని ఎల్‌బీనగర్‌, ఏళంజి, కొళగానహళ్లి, దేవగిరి క్రాస్‌, ఉంతకల్లు, శ్రీధరఘట్ట, హిర్దేహాళ్‌, సోమలాపురం, అంబాపురం గ్రామాల్లో అంజీర సాగవుతోంది.
సాగు ప్రారంభించిన యేడాదిలో పంట కోతకు వస్తుంది. తొలి యేడాది దిగుబడి తక్కువగా వున్నా రెండవ యేడాది నుంచి పెరుగుతుంది. కురుగోడు నుంచి తీసుకువచ్చిన మొక్కల్ని అంటు పద్ధతిలో పెంచుతున్నారు. డ్రిప్‌ ద్వారా నీటిలో కలిసే ఎరువులను వేస్తున్నారు. యేడాది కాలంలో ఆరు నెలలు పంట దిగుబడి ఎక్కువగా వుంటుందని, ఆ తరువాత తగ్గుతూ వస్తుందంటున్నారు రైతులు.
 
వేరుశనగ నుంచి అంజీర వైపు..
అనంతపురం జిల్లా కూడేరు మండలం జయపురం గ్రామంలో మారుతి అనే రైతు వేరుశనగతో నష్టాలు భరించలేక అంజీర పంటవైపు దృష్టి సారించారు. జిల్లాలోని కణేకల్లు మండల ప్రాంతంలో రైతులు అంజీర సాగు చేస్తుండటంతో అక్కడకు వెళ్లి సాగు పద్ధతులు తెలుసుకున్నారు. కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి కుర్రకోడు నుంచి అంజీర మొక్కలు కొని తెచ్చుకున్నారు. ఒక్కొక్కటి రూ. 25 చొప్పున ఐదెకరాల పొలానికి 1750 మొక్కలను కొనుగోలు చేశాడు. హార్టికల్చర్‌ అధికారుల సూచనలతో పంటను కాపాడుకున్నాడు. ఏడాదికే పంట చేతికి వచ్చింది. ప్రస్తుతం రెండు సంవత్సరాల మొక్కలు ప్రతి రోజూ 180 నుంచి 200 కేజీల వరకూ దిగుబడి ఇస్తున్నాయి. తన పొలం వద్ద కిలో రూ. 35 ప్రకారం విక్రయించి రోజుకు రూ.6 వేలకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నాడు.
పని తక్కువ ఫలితం ఎక్కువ
అంజీర సాగులో పని తక్కువగా వుంటుంది. దిగుబడి మాత్రం ఆశించిన మేరకు వస్తున్నది. రోజూ అంజీర కాయలను కోయాల్సి వుంటుంది. ఒక రోజు ఆలస్యం అయినా కాయలు దెబ్బతింటాయి. మార్కెట్‌లో ఈ పండ్లకు మంచి డిమాండ్‌ వుంది. రైతులకు అంజీర సాగు వరప్రదాయిని.
– మారుతి, రైతు, 80085 55511
ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి
మొదటి యేడాది రూ.19 వేలు, రెండో యేడాది రూ. 4,500 వేలు సబ్సిడీ అందించారు. మూడో యేడాది మాత్రం ఇవ్వలేదు. మార్కెట్‌ వసతితో పాటు ప్రభుత్వం గిట్టుబాటు ధరను ప్రకటించాలి. రాయితీపై మొక్కలను పంపిణీ చేయాలి.
– వై వెంకటేశులు, ఎల్‌బీ నగర్‌, 94415 87382
మంచి దిగుబడులు
అంజీర సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. ఎకరాకు పది టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. ఏడెకరాల పొలంలో అంజీర సాగు చేశాను. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందితే అంజీర సాగు రైతుకు ఎంతో లాభం చేకూరుతుంది.
– శీనప్ప, ఉంతకల్లు, 95736 66709
సేంద్రియ పద్ధతిలో సాగు
సంప్రదాయంగా దొరికే పశువుల ఎరువులు, తంగిడ, జిల్లడ, ఎంపిలాకులతో పాటూ పచ్చిరొట్ట ఎరువులను చెట్ల కింద వేయడంతో అంజీర చెట్లు ఆరోగ్యంగా, ధృఢంగా పెరిగాయని మారుతి చెబుతున్నాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వల్ల పెట్టుబడులు బాగా తగ్గాయన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన అంజీర పండ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ వుండటం విశేషం.
ఎకరాకు ఎనిమిది టన్నులు
అంజీర పంట ఎకరాకు ఎనిమిది టన్నుల దాకా దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పండ్ల తోటల్లోకెల్లా అంజీర సాగు ఆశాజనకంగా వుంటుందంటున్నారు. ఎకరా సాగుకు పెట్టుబడి కింద రూ. 50 వేల దాకా అవుతుంది. పెట్టుబడి పోను ఎకరానికి రూ. 50 నుంచి రూ. 60 వేల దాకా మిగులుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మార్కెట్లో కిలో అంజీర ధర రూ. 40 దాకా వుంటోంది. ఇక్కడ పండించిన అంజీరను రైతులు అమరావతి, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు తరలిస్తున్నారు. 20 కిలోల బాక్స్‌ రూ. 800 దాకా ధర పలుకుతున్నట్లు రైతులు తెలిపారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *