అప్పుల ఊబిలో ఈము రైతులు

తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది రైతులు ఎనిమిదేళ్లుగా ఈము పక్షుల పెంపకం చేపట్టారు. తెలంగాణలో 120 మంది రైతులు ఈము పక్షులను పెంచుతున్నారు. సుమారు రూ.13 కోట్ల వరకు బ్యాంకుల అప్పుల్లో కూరుకుపోయారు.
ఈము పక్షుల గుడ్లు, పిల్లలు కొవ్వుద్వారా వచ్చే నూనెకు మంచి డిమాండ్‌ ఉందని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రచారం చేశాయి. ఈము పక్షిపిల్ల ధర రూ. 5 వేలు, నూనె ధర కేజీ రూ.2 వేల నుంచి 4 వేల వరకు ఉంటుందని చెప్పడంతో ఒక్కో రైతు రూ.5 లక్షలు విలువైన వంద పిల్లలను కొనుగోలు చేశారు. రెండేళ్లపాటు ఎలాంటి ఆదాయం లేకుండా వీటిని పెంచారు.
రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి ఆస్ర్టేలియా జాతికి చెందిన ఈము పక్షులను వేలంవెర్రిగా పెంచుకొన్నారు. పిల్లలు పెద్దవై గుడ్లుపెట్టి అవి కూడా పిల్లలు కూడా కావడంతో ఒక్కో యూనిట్‌లో వంద నుంచి 300 వరకు పెరిగాయి.
అయితే ఈము పక్షులను కానీ, పిల్లలను కాని, నూనెను కానీ కొనే నాథుడులేక పక్షులను పెంచే శక్తిలేక బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తీర్చే దారిలేక రైతులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఈము పక్షులను పెంచే పరిస్థితి లేక స్థానికంగా వాటి మాంసాన్ని విక్రయించగా, మరికొందరు అడవుల్లో కూడా వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఈముపక్షుల యూనిట్లన్నీ ఖాళీ అయ్యాయి. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు భారమయ్యాయి. గత నాలుగేళ్లుగా అప్పులు తీర్చలేక రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తున్నారు.
కనికరించని ప్రభుత్వం
తెలంగాణలో 120 మంది రైతులకు సుమారు రూ.13 కోట్లు, ఆంధ్రాలో 350 మంది రైతులకు రూ.84 కోట్లు రుణాలున్నాయి. ఏపీ ప్రభుత్వం వడ్డీని బ్యాంకుల ద్వారా మాఫీచేయిస్తూ అసల్లో 25 శాతం రైతులు, 25 శాతం బ్యాంకులు, 50 శాతం ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాత్రం తమ రుణాలు మాఫీచేయాలని, ఆదుకోవాలని ఈముపక్షుల పెంపకందారులు కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి తమగోడు చెప్పుకొన్నా ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు.
ఈముపక్షుల రైతు సంఘం నాయకుడిగా ఖమ్మానికి చెందిన బొల్లేపల్లి హరిబాబు కూడా పలుసార్లు మంత్రులను కలిశారు. అయితే ఎలాంటి భరోసా లభించకపోవడంతో అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈము రైతుల్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రైతు సంఘ నేతలు, పి.వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌. రమణారెడ్డి కోరుతున్నారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *