ఎర్రజొన్న … లాభాల్లో మిన్న

 

  • 40 వేల ఎకరాల్లో సాగు
  • అంకాపూర్‌ రైతులకు సిరిజల్లు
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆర్మూర్‌ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు సాగవుతున్నాయి. అంకాపూర్‌ ప్రాంతంలోని రైతుల లోగిళ్లు సిరిసంపదలతో తులతూగడానికి ప్రధాన కారణం అయిన ఎర్రజొన్న సాగు విశేషాలు.
ఎర్రజొన్న గడ్డి జాతిపంట. ఇక్కడ పండిన ఎర్రజొన్నల్ని ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో గడ్డి విత్తనాలుగా వాడుతారు. 1983లో అంకాపూర్‌ గ్రామానికి చెందిన రైతులు ఏలూరు ప్రాంతానికి వ్యవసాయ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. అక్కడ ఎర్రజొన్నలు పండడం చూసి తమ ప్రాంతానికి కావాలని ఎపీ సీడ్స్‌ అధికారులను కోరారు. మొదట్లో రెండు వందల ఎకరాల్లో సాగయిన పంట విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ 40 వేల ఎకరాలకు చేరింది. ఎర్రజొన్నలు ఆరుతడి పంట. నీరు ఎక్కువగా అవసరముండదు. దాంతో పాటు లాభాలు బాగా రావడంతో అధిక సంఖ్యలో రైతులు ఎర్రజొన్న సాగువైపు దృష్టి పెట్టారు. ఎర్రజొన్న పంట సాగు చేసిన రైతులు ఏ సంవత్సరంలోనూ నష్టపోలేదు.
ధర ఒక సంవత్సరం ఎక్కువ, మరో సంవత్సరం తక్కువ వున్నా ఇతర పంటల మాదిరి నష్టపోలేదు. ఎర్రజొన్నలు పండించినప్పటి నుంచి ఆర్మూర్‌ ప్రాంత రైతులు ఆర్ధికంగా ఎదిగారు. అంకాపూర్‌తో పాటు ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో రైతులు ఆధునాతన భవంతులు నిర్మించుకుని, కార్లలో తిరుగుతున్నారంటే ఎర్రజొన్నల సాగు కూడా ఒక కారణం. ఎర్రజొన్న పంటకాలం 120 రోజులు. అప్పుడప్పుడు నీటి తడులు ఇస్తే సరిపోతుంది. ఎకరానికి ఆరునుంచి ఏడు వేల వరకు ఖర్చవుతుంది.
దిగుబడి ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు వస్తుంది. ధర ఉంటే పెద్దమొత్తంలో గిట్టుబాటు అవుతుంది. ఎర్రజొన్నలు ఆర్మూర్‌ ప్రాంతంలో పండుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో మార్కెటింగ్‌ లేదు. ఇక్కడ పండిన పంట ప్రాసెసింగ్‌ చేసి ఐదుకిలోల ప్యాకెట్లు తయారుచేసి ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేస్తారు. అక్కడ వీటిని గడ్డి విత్తనాలుగా వాడుతారు. ఢిల్లీ, గుజరాత్‌, హరియాణ, పంజాబ్‌, రాజస్థాన్‌, యుపితో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో ఈ విత్తనాలకు బాగా డిమాండ్‌ వుంది.
ఆర్మూర్‌ ప్రాంతంలో ఎర్రజొన్నలపై రూ. 120 కోట్లపైన వ్యాపారం జరుగుతోంది. రైతుల వద్ద స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి ఢిల్లీ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలో 53 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నవారు ఎర్రజొన్నలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తే ధర పెరుగుతుంది. రెండేళ్ల క్రితం పోటీపడి కొనుగోలు చేయడంతో నాలుగు వేల పైన ధర పలికింది. గత సంవత్సరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడటంతో ధర రెండువేలకు పడిపోయింది. ప్రభుత్వ పరంగా ఎర్రజొన్న రైతులకు ఎలాంటి ప్రోత్సాహం అందడంలేదని రైతులు చెబుతున్నారు.
యాసంగిలోనూ సిరులు
రెండెకరాల్లో 30 ఏళ్లుగా ఎర్రజొన్న సాగు చేస్తున్నాను. వానాకాలంలో సోయా, మొక్కజొన్న పంట తీసి యాసంగిలో ఎర్రజొన్నలు వేస్తాను. ఎక రానికి 20 క్వింటాళ్ల పైన దిగుబడి వస్తుంది. ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ కావడంతో ఏటా ఇదే పంట వేస్తున్నాను.
– ఉట్‌వెల్లి రాజేశ్వర్‌, రైతు, ఆర్మూర్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *