కూలీల కొరతకు నయా మంత్రం

  • చెరుకు నరికే యంత్రం  
చెరుకు కొట్టేందుకు కూలీలు దొరకక, ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది. చెరుకును నరికి, ట్రాక్టర్‌లో వేసే ఈ యంత్రం ఖరీదు కోటి 30 లక్షలు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా దీన్ని కొనడం రైతులకు సాధ్యమయ్యే పని కాదు. దాంతో సంగారెడ్డికి చెందిన కొందరు పెద్ద రైతులు తొలిసారిగా ఈ యంత్రాన్ని తమిళనాడు నుంచి అద్దెకు తెచ్చారు.
ఈ యంత్రం చెరుకును నరకడమే కాకుండా చెరుకును అరఫీటు చొప్పున ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఈ ముక్కలను పక్కనే ఉండే ప్రత్యేక ట్రాక్టర్‌లో నింపుతుంది. పొలం నుంచి ఆ ప్రత్యేక ట్రాక్టర్‌ను రైతులు రహదారి వరకు తెచ్చి, లారీలలో నింపి, షుగర్‌ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. టన్నుకు రూ.700ల చొప్పున అద్దెతో వినియోగిస్తున్న ఈ యంత్రం రోజుకు వంద టన్నుల చెరుకును నరికి ముక్కలుగా చేసి, ట్రాక్టర్లలో నింపుతున్నది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాలలో రైతు బారాది నర్సింహ్మారెడ్డి ఉపయోగిస్తున్న ఈ చెరుకు నరికే యంత్రాన్ని చూసేందుకు రైతులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈయన 15 ఎకరాలలో చెరుకును పండిస్తున్నారు. కొన్నేళ్లుగా కూలీలు దొరకకపోవడంతో నిర్ణీత సమయంలో చెరుకును ఫ్యాక్టరీకి తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాడినని ఆయన తెలిపారు.
కూలీలకంటే యంత్రం మిన్న
చెరుకు కొట్టేందుకు కూలీలను మాట్లాడుకున్నా వాళ్లు సకాలంలో రాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కూలీల జాప్యం కారణంగా రైతులు సమయాన్ని, పంటను నష్టపోతున్నారు. ఈ యంత్రంతో కూలీల సమస్య తగ్గుతుందన్నారు ఆ రైతు. ఎనిమిది జతల కూలీలు రోజుకు పది టన్నుల చెరుకును నరుకుతారు. అదే యంత్రమైతే రోజుకు వందటన్నుల చెరుకును నరికి ఫ్యాక్టరీకి చేరవేస్తుంది. టన్నుకు రూ.500 చొప్పున జత కూలీకి చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు పది టన్నుల చెరుకు కొట్టే 8 జతల కూలీలకు రూ.5000ను చెల్లించాల్సి వస్తున్నది. పది రోజుల్లో 100 టన్నుల చెరుకును కొట్టేందుకు 8 జతల కూలీలకు 50 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికితోడు ఫ్యాక్టరీకి తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులు అదనం.
అదే యంత్రం వినియోగిస్తే 70 వేల రూపాయల ఖర్చుతో ఒక్క రోజులోనే 100 టన్నుల చెరుకును నరికి ఫ్యాక్టరీకి తరలించవచ్చు. యంత్రం చెరుకు మొదళ్లను నరకడంతో తర్వాత వచ్చే పంట కూడా పూర్తిగా వస్తుంది. చెరుకు నుంచి వచ్చే ఆకును దుగ్గు చేయడం వల్ల అది తిరిగి ఎరువుగా మారి, చేనుకు బలమవుతుంది. చెరుకు కొట్టినపుడు ఉండే దుగ్గు చేనులోనే ఉండడం వల్ల భూమిలో తేమ తగ్గకపోవడంతో పాటు కాండం త్వరగా ఇగురు పెట్టే వీలవుతుంది. కూలీలకంటే యంత్రం వాడడం వల్ల రైతులకు ఆర్థికంగా కూడా కలిసివస్తుంది. రైతులకు ఉపయోగపడే చెరుకు నరికే యంత్రాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేయాలని కాసాల రైతు నర్సింహ్మారెడ్డి కోరారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *