కోటి ఎకరాల్లో ఉద్యాన సేద్యం

  • రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
  • హార్టికల్చర్‌ హబ్‌గా రాయలసీమ
ఉద్యాన పంటల సాగుకు రాష్ట్రంలో అనువైన వాతావరణం వుంది. వనరులు పుష్కలంగా వున్నాయి. దాంతో పండ్ల తోటల సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉద్యాన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అన్నారు రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి.
ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు?
ఉద్యాన తోటల విస్తీర్ణం కోటి ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఫోకస్‌ పెట్టాం. సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి, ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తున్నాం. నీటి కుంటల తవ్వకం, రాయితీపై బిందు, తుంపర సేద్యానికి పరికరాలు, యంత్ర పరికరాలు ఇస్తున్నాం. కూరగాయల్లో హైబ్రీడ్‌ రకాల విత్తనాల పంపిణీ చేస్తున్నాం. సీఆర్‌డీఏ పరిధిలో వినుకొండ ప్రాంతాన్ని కొత్తగా హార్టికల్చర్‌ క్లస్టర్‌గా తీసుకున్నాం.
సేంద్రియ సేద్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు?
రసాయన ఎరువులు వాడకం వల్ల ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తున్న విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నాణ్యమైన ఉత్పత్తులకు, మంచి ధరకు సేంద్రియ పద్ధతులతో ఉద్యాన పంటలను పండించాలని రైతులకు సూచిస్తున్నాం. ముఖ్యంగా కూరగాయల ఉత్పత్తులపై రైతులను అప్రమత్తం చేస్తున్నాం. రాష్ట్రంలో 10 వేల హెక్టార్లలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. 2017-18లో మరో 8500 హెక్టార్లలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేపడుతున్నాం.
సాగు నీటి సమస్య లేకుండా తోటలను కాపాడుకునే విధానాలు ఏమిటి?
పూర్తిగా వర్షాధారంగా ఉద్యానతోటల సాగు కష్టం. అందుకే భూగర్భజలాలు, నీటి కుంటలు ఉన్న ప్రాంతాల్లో బిందు, తుంపర సేద్యానికి రాయితీపై పరికరాలు ఇస్తున్నాం. పంట కుంటల తవ్వకానికి సహకారం అందిస్తున్నాం. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం.
ఉద్యాన రైతులకు అందిస్తున్న రాయితీలు ఏమిటి?
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎంఐపీ కింద తుంపర, బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతర సన్న, చిన్న కారులకు 50 శాతం రాయితీతో పరికరాలను ఇస్తున్నాం. చీడపీడల నివారణ పఽథకం కింద 30 శాతం రాయితీతో హెక్టారుకు రూ.5వేలు ఇస్తున్నాం. డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి నూతన పంటల సాగు పెంచడానికి 40 శాతం రాయితీతో హెక్టారుకు రూ.5.52 లక్షల రాయితీతో ఒక లబ్ధిదారుడికి రెండెకరాల వరకు రాయితీ వర్తిస్తుంది. పూలతోటల సాగు పెంచేందుకు 40 శాతం రాయితీతో హెక్టారుకు రూ.16వేల చొప్పున రెండెకరాలకు ఇస్తాం. కొత్త పండ్ల తోటల అభివృద్ధికి 40 శాతం రాయితీ ఇస్తాం. రైతు గ్రూపుల కమ్యూనిటీ ట్యాంకులకు 50 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2లక్షలు ఇస్తాం.
ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల భాగస్వామ్యంతో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. మామిడి, టమాట ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పండ్లు, పూలు, కూరగాయలు చెడిపోకుండా సురక్షితంగా ఉంచేందుకు శీతల గిడ్డంగుల ఏర్పాటుకు 35 శాతం రాయితీ ఇస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది రూ.30-40కోట్లు బడ్జెట్‌ కేటాయించాం. పండ్లు మగ్గబెట్టేందుకు రైపనింగ్‌ ఛాంబర్లు, రీఫల్‌ (శీతలీకరణ)వ్యాన్లు 35 శాతం రాయితీతో ఇస్తున్నాం. గ్రీన్‌హౌస్ లు, పాలిహౌస్ లకు 50 శాతం రాయితీ ఇస్తున్నాం.
కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఏమిటి?
నిత్యావసరాలైన కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ట్రైల్లీస్‌ పద్ధతిలో కూరగాయల పెంపకంతో 30 శాతం దిగుబడులు పెరుగుతాయి. వేసవిలో కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు షెడ్‌ నెట్‌ నర్సరీలను కూడా ఈ పథకంలో అమలు చేస్తున్నారు. హైబ్రీడ్‌ కూరగాయ విత్తనాలను కూడా సరఫరా చేస్తున్నాం. విత్తనం ఖరీదులో 50శాతం రాయితీ ఇస్తాం. రాష్ట్రంలో పండే మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, పచ్చిమిర్చి, క్యారెట్‌, క్యాప్సికం, టమాట, ఎండుమిర్చి, పసుపు వంటివి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మామిడి తోటల పునరుద్ధరణకు 50 శాతం రాయితీపై హెక్టారుకు రూ.17500 ఇస్తున్నాం.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *