క్యారెట్‌ అంటే కేశవపల్లి!

వికారాబాద్‌ జిల్లా కేశవపల్లి క్యారెట్‌ సాగుకు పెట్టింది పేరు. ఊరు ఊరంతా కూరగాయల సాగుకు అంకితమయ్యారు. ఏడాది పొడవునా నీరందించే చెరువు, పుష్కలంగా భూగర్భజలాలు అందుబాటులో వుండటం ఆ గ్రామ రైతులకు వరం. రోజుకు 35 నుంచి 45 టన్నుల కూరగాయలను హైదరాబాద్‌ తరలిస్తూ 150 రైతు కుటుంబాలు ఆర్థికంగా లాభపడుతున్నాయి.
వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని కేశవపల్లి గ్రామంలో 726 ఎకరాల సాగు భూమి ఉంది. గ్రామం ఎగువన వున్న పెద్ద చెరువు ఆ రైతులకు వరం. 726 మంది జనాభా, 200 వరకు కుటుంబాలుండగా అందులో దాదాపు 120 మంది రైతులే. గ్రామంలో 47కు పైగా వ్యవసాయ బావులు, 27 వరకు బోర్లు ఉన్నాయి. చెరువు కింద గ్రామం ఉండడంతో గ్రామంలో నీటి సౌకర్యం పుష్కలంగా ఉంది. దీంతో ఏడాదంతా గ్రామ పొలాలు పచ్చగా కనిపిస్తాయి. రోజుకు సగటున 35 నుంచి 45 టన్నుల కూరగాయలు నగరంలోని బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట తదితర మార్కెట్లకు తరలిస్తుంటారు. ఇందులో దాదాపు క్యారెట్‌ 80 శాతం పండిస్తుండడం గమనార్హం.
పొలం పనుల్లో ఇంటిల్లిపాది
కూరగాయలు పండించడంలో నూతన పద్ధతులు అవలంబిస్తూ మేలు రకం వంగడాలను ఎంపిక చేసుకుంటూ రాష్ట్రంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటకు డ్రిప్‌ ద్వారానే నీటిని అందిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సూచనలు, సలహాలు పాటిస్తూ దిగుబడులు పెంచుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే పనులు లేక రైతులు ఉపాధి హామీ, తదితర పనులకు వెళుతుంటారు. కానీ ఈ గ్రామం తీరు వేరు. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ నిరంతరం పొలంపనుల్లో నిమగ్నం అయి వుంటుంది కేశవపల్లి.
సేంద్రియ ఎరువుతో సేద్యం
గ్రామంలోని రైతులు చాలా వరకు సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పెంటకుప్పలు, కోడి ఎరువు, మేకలు, గొర్రెల ఎరువులు, వానపాముల ఎరువును తయారు చేసుకొని పంట పొలాలకు వినియోగిస్తున్నారు. ఇక్కడి రైతులు 80 శాతం క్యారెట్‌ పంటను సాగు చేస్తున్నారు. మిగతా 20 శాతం క్యాబేజీ, టమాట, వంకాయ, బీట్‌రూట్‌, చిక్కుడు, బీర, బెండ, ఆకుకూరల పంటలు పండిస్తారు. 15 ఏళ్లుగా గ్రామం మొత్తం మద్యనిషేధం పాటించాలని తీర్మానించింది. దాంతో వ్యవసాయమే శ్వాసగా ఆ గ్రామ రైతులు జీవిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ విత్తనాల కోసం ఈ గ్రామ రైతులు ఎదురుచూడరు. అనుకున్న సమయానికి విత్తనం లభించకపోతే పంట దిగుబడి తగ్గుతుందనే భయంతో మార్కెట్‌ నుంచే మంచి విత్తనాలు కొని తెచ్చుకుంటారు. పొలాల వద్ద ఏకంగా నర్సరీలు ఏర్పాటుచేసుకుని సొంతంగా క్యారెట్‌ నారు పోసుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వికారాబాద్‌ అర్బన్‌
ఎకరానికి 2 లక్షల ఆదాయం
గ్రామంలో దాదాపు ప్రతి ఒక్కరూ క్యారెట్‌ పంట సాగు చేస్తారు. పంట తీసే సమయంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. డ్రిప్‌తో నీళ్లు పారబెట్టడం వల్ల కలుపు తక్కువగా ఉంటుంది. మంచి ధర ఉంటే ఎకరానికి రూ. 2 లక్షల వరకు లాభం వస్తుంది.
రాఘవేందర్‌, యువరైతు, కేశవపల్లి
 
క్యారెట్‌ పండించని కుటుంబం ఉండదు
మొన్న కురిసిన వానలకు క్యారెట్‌ కాస్త దెబ్బతిన్నది. అయినా మంచి దిగుబడులు సాధించగలమనే నమ్మకం వుంది. రోజూ 40 టన్నులకు పైగా కూరగాయలు ఇక్కడి నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు చేరతాయి. కూరగాయల సాగులో మా గ్రామం జిల్లాలోనే టాప్‌ కావడం ఆనందంగా వుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *