నకిలీ విత్తనాలు..పారాహుషార్

  • ఏటా వేల కోట్లు నష్టపోతున్న రైతులు.. సొంత విత్తనం మేలంటున్న నిపుణులు
విత్తనం రైతుకు, సాగుకు ప్రాణం. అధిక దిగుబడులకు మూలం. పూర్వం రైతులు సొంతంగా విత్తనాలు తయారుచేసుకునే వారు. హైబ్రీడ్‌ విత్తనాలు వచ్చాక విత్తనాల తయారీ, అమ్మకాలు కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిశోధనలు లేకుండానే, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌, ప్రకటన ల ఆర్భాటంతో నాణ్యత లేని విత్తనాలను రైతులకు అంటకడుతున్నారు. నకిలీ విత్తనాల వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు.
రైతులకు అందుబాటులో వున్న విత్తనాలలో రెండు రకాలున్నాయి. ప్రభుత్వ విత్తనం: వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థలలో శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి విత్తనాలను తయారు చేస్తారు. వీటిని ఆయా పరిశోధన సంస్థలు, వ్యవసాయ కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎపి సీడ్స్‌ ద్వారా రైతులకు అమ్ముతుంటారు
ప్రైవేటు విత్తనం: ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు తయారుచేసే విత్తనాలు. నిబంధనల మేరకు సుమారు 15-20 ఎకరాలు భూమి ఉండాలి. దానిలో పండించి పరిశోధనలు చేసిన విత్తనాలను పరిశీలించడానికి ఎజిబిఎ్‌ససి, ఎంఎ్‌ససి చదివిన నిపుణులైన బ్రీడర్‌ను ఆయా సంస్థలు ఎంపిక చేయాలి. ఆ బ్రీడర్‌ ఆధ్వర్యంలో తయారైన, పరిశోధించిన విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేయబోయే ముందు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల బృందం పరిశీలించాలి. నాణ్యత, ఉత్పత్తిని పరిశీలించిన తరువాత ఆ రకాలను మార్కెట్‌లోకి అమ్మడానికి అనుమతులు ఇవ్వాలి. సుమారు 2-3 ఏళ్లు ఈ రకం విత్తనాలపై ఎటువంటి ఫిర్యాదులు లేకపోతే ఆ కంపెనీ రకాలకు పూర్తి స్థాయి అమ్మకాల లైసెన్సులు ఇస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పరిశోధనలు, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ బి – రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌) లేకుండానే విత్తన కంపెనీలకు అనుమతులు ఇస్తున్నారు. దరఖాస్తులో తెలిపిన సర్వే నెంబర్లను పరిశీలించడం లేదు. ఒకే సర్వే నెంబర్‌ పేరుతో 3-4 విత్తన కంపెనీలు ఉంటున్నాయి. వీటితో పాటు ఈ కంపెనీలన్నింటికీ ఒకే బ్రీడర్‌ ఉంటున్నారు. రైతులకు ఆకర్షణీయమైన ప్యాకెట్‌లతో, వ్యాపార ప్రకటనలతో విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు మొలక రాకపోయినా, పంట పండకపోయినా కంపెనీలు సరిగా స్పందించడం లేదు. రైతులకు న్యాయం చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీల కొమ్ముకాస్తున్నారు.
జాగ్రత్తలు ఇలా…
  • రైతులు విత్తనాలను లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి
  • జిన్నింగ్‌/లూజు పత్తి విత్తనాలను కొనుగోలు చేయరాదు.
  • బిల్లులో కొనుగోలు చేసిన తేదీ, విత్తనరకం, పరిమాణం, లాట్‌ నెంబర్‌, నమోదు చేయించి బిల్లును దాచుకోవాలి.
  • విత్తనాలు కొనుగోలు చేసిన తరువాత మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. మొలక శాతం తక్కువగా ఉంటే విత్తనాలను తిరిగి డీలర్‌కు ఇవ్వవచ్చు.
  • రైతులు బీటీ విత్తనాలతో పాటు నాన్‌ బీటీ పత్తి విత్తనాలు పొలంలో నాటటం ద్వారా కాయ తొలిచే పురుగుల తీవ్రతను తగ్గించుకోవచ్చు.
  • గ్రామాల్లో బిల్లు లేకుండా అమ్మితే మండల వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారి (ఎంఎవో) లేదా సహాయ సంచాలకులు (ఏడీ) లేదా జిల్లా కలెక్టరేట్‌లోని టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-425-4099కు ఫిర్యాదు చేయాలి..
  • ఏ డీలర్‌ అయినా ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి, ఏడీలకు ఫిర్యాదు చేయాలి. నకిలీ, లూజు విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిపిన వారికి ప్రభుత్వం రూ. 10వేలు పారితోషికంగా ఇస్తుంది.  – ఆంధ్రజ్యోతి ప్రతినిధి, గుంటూరు
పంట నుంచే సేకరించాలి
సాగులో విత్తనాలకు 20 శాతం ఖర్చవుతుంది. రైతుల వారు పండించిన పంటలో 2 నెలల ముందు బలమైన కంకులు, గుబ్బలు ఉన్న వాటిని సేకరించాలి. దాని ద్వారా విత్తనాలను తీసుకొని వాటిని శుద్ది చేసి భద్రపరుచుకోవాలి. ఈ విత్తనాలు వాడుకుంటే రైతుల డబ్బు ఆదా కావడంతో పాటు నకిలీ విత్తనాల బెడదను తగ్గించుకోవచ్చు. రైతులు హైబ్రీడ్‌ విత్తనాలపై వ్యామోహం తగ్గించుకోవాలి.
– డాక్టర్‌ పావులూరి రత్నప్రసాద్‌, ఎడిఆర్‌, లాం వ్యవసాయ పరిశోధన కేంద్రం
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *