పామాయిల్‌ హబ్‌ ఖమ్మం

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12,600 హెక్టార్లలో సాగు
  • ఏటా 4 వేల హెక్టార్లలో పంట విస్తరణ వ్యూహం
పామాయిల్‌ రాకతో నూనెపంటల సాగు కొత్తబాట పట్టింది. వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు వంటి పంటల ద్వారా నూనె ఉత్పత్తి అవుతున్నప్పటికీ పామాయిల్‌ పంట ద్వారా దీర్ఘకాలం పాటు అధిక దిగుబడులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాగవుతున్న పామాయిల్‌ తోటల్లో తెలంగాణలో పదిశాతానికి పైగా పామాయిల్‌ సాగు కావడం విశేషం.
పామాయిల్‌ తోటల సాగులో దేశంలోనే తెలుగురాష్ట్రాలు అగ్రగామిగా వున్నాయి. కర్నాటక, కేరళ, తమిళనాడుల్లో ఈ పంట సాగవుతున్నా దేశవ్యాప్తంగా సాగవుతున్న 1,25,000 హెక్టార్లలో 90 వేల హెక్టార్లు తెలుగు రాష్ర్టాల్లోనే ఉంది. ఇందులో తెలంగాణలో 17,000 హెక్టార్లలో పామాయిల్‌ సాగులో ఉంది. అందులో ఖమ్మంలో 3 వేల హెక్టార్లు, ఽభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9వేల హెక్టార్లు టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో వేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి హెక్టార్లలో సాగు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పామాయిల్‌ సాగు విస్తరించింది
రాష్ట్రంలో పామాయిల్‌ పంట 1992 నుంచి సాగవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12,600 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగవుతున్నది. వీటిలో 10 వేల హెక్టార్లలో పామాయిల్‌ గెలల దిగుబడి వస్తోంది. సగటున హెక్టారుకు 6.5 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పుష్కలంగా వుండటం, సారవంతమైన నేలలు వుండటంతో పామాయిల్‌కు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంది. దీనికితోడు అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మించడంతో ఆయిల్‌పామ్‌ పంట వేగంగా పెరగటానికి అవకాశం కలిగింది. ఇటీవలే అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తోడు అదనంగా దమ్మపేట మండలం అప్పారావు పేటలో మరో ఫ్యాక్టరీని నిర్మించడంతో ఈ ప్రాంతంలో ఆయిల్‌పామ్‌ తోటల సాగు విస్తీర్ణం పెరగటానికి తోడ్పడింది.
భలే రాయితీలు
మేలురకం పామాయిల్‌ విత్తనం అమెరికాలోని కోస్టారికాలో దొరుకుతుంది. ఆయిల్‌ఫెడ్‌ కోస్టారికా నుంచి సీడల్‌లింక్‌ను ప్రత్యేకంగా దిగుమతి చేసుకొని అశ్వారావుపేటలో ఏర్పాటుచేసిన పామాయిల్‌ నర్సరీలో ఈ విత్తనాల ద్వారా మొక్కలను పెంచి రైతులకు అందిస్తోంది. పామాయిల్‌ పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అనేక రాయితీలను కల్పిస్తోంది. ఆయిల్‌ఫెడ్‌కు ఒక్కో మొక్కను పెంచడానికి రూ.91 ఖర్చవుతుంది. అయితే ఉద్యానశాఖ ఒక్కో మొక్కకు రూ.77 రాయితీని కల్పించడంతో రైతుకు ఒక్కో మొక్క కేవలం రూ.14కే దక్కుతోంది. పామాయిల్‌ పంట వేసిన రైతుకు నాలుగు సంవత్సరాల పాటు రాయితీపై ఎరువులను అందజేస్తోంది.
ఏడాదికి ఎకరానికి రూ.4వేల చొప్పున నాలుగు సంవత్సరాలలో రూ.20వేలు రాయితీ కల్పిస్తున్నారు. తోటలకు నీటిని అందించేందుకు వేసే డ్రిప్‌ ఎస్సీ, ఎస్టీ, చిన్నకారు రైతులకు 90శాతంపైన, 5 ఎకరాలు దాటిన రైతులకు 70 శాతం రాయితీపై డ్రిప్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ పంట వేసే రైతులకు ఆయిల్‌ఫెడ్‌ హామీతో బ్యాంకుల ద్వారా రుణ సహాయాన్ని అందిస్తుండటంతో పెట్టుబడికి ఇబ్బందులు లేవు.
దిగుమతి సుంకంతో ఊతం
దేశీయ మార్కెట్‌లోకి ఇబ్బడిముబ్బడిగా విదేశీ నూనెలు వచ్చి పడుతుండటంతో దేశీయనూనె ఉత్పత్తిదారులు పోటీని తట్టుకోలేకపోయేవారు. ఈ ప్రభావం ధరలపై పడేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 12 శాతంగా వున్న దిగుమతి సుంకాన్ని 25 శాతం వరకు పెంచడంతో దేశీయ నూనెలకు ఊరట లభించింది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *