బహుళ ప్రయోజనాల డ్రమ్‌సీడర్‌

విత్తనాలు వేసేందుకు రైతులకు వ్యవసాయ శాఖ రాయితీపై డ్రమ్‌సీడర్‌లను సబ్సిడీపై అందిస్తున్నది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఈ పరికరం ఏదో ఒక విత్తనం నాటేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ విజయనగరానికి చెందిన దమరసింగి బాబూరావు అన్ని విత్తనాలను నాటడంతో పాటు బహుళ ప్రయోజనాలున్న యంత్రాన్ని సొంతంగా తయారుచేసి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందారు.
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన దమరసింగి బాబూరావు చదివింది పదోతరగతే. వెల్డింగ్‌ షాప్‌ నడుపుకుంటూ జీవనం సాగించే ఆయన సరైన యంత్రాలు లేక రైతులు పడుతున్న కష్టాలను గమనించారు. ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే డ్రమ్‌సీడర్‌ను మరింత ఉపయోగిపడేలా తీర్చిదిద్దడం ఎలా అని ఆలోచించారు. అన్ని రకాల విత్తనాలతో పాటు పురుగుల మందులు పిచికారీ చేసేందుకు వీలుగా బహుళ ప్రయోజనాలున్న డ్రమ్‌ సీడర్‌ను సొంతంగా తయారు చేశారు. ఈయన తయారుచేసిన డ్రమ్‌సీడర్‌ వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్న, నువ్వులు, పెసలు, మినుములు, చోడి, కందులు ఇలా గింజ రకాలన్నింటినీ విత్తుకునే వీలుంది. ఒకేసారి వివిధ రకాల విత్తనాలు విత్తుకునే వెసులుబాటు ఈ యంత్రం వల్ల కలుగుతుంది.
సాధారణంగా నారు పోసి నాట్లు వేయాలంటే ఎకరాకు వరి విత్తనాలు 30 కిలోలు అవసరం. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న డ్రమ్‌సీడర్‌ ద్వారా అయితే 15 కిలోల విత్తనాలు అవసరం. కాని బాబూరావు ఆవిష్కరించిన డ్రమ్‌ సీడర్‌ ద్వారా ఎకరాకు కేవలం 3 కిలోల వరి విత్తనాలు సరిపోతాయి. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సీడర్లు ద్వారా ఒక్కోసారి దగ్గర విత్తనాలు పడిపోవటం. ఒకే దగ్గర కొన్నిచోట్ల రెండేసి విత్తులు పడిపోతాయి. బాబూరావు తయారు చేసిన యంత్రంలో విత్తన రకం ఆధారంగా ఎడ్జెస్ట్‌మెంట్‌ చేయటం ద్వారా ఖచ్చితంగా దూరం ఆధారంగా ఒకే విత్తనం పడే విధంగా ఏర్పాట్లున్నాయి.
కేవలం 30 నిముషాల్లో విత్తడం పూర్తి చేయడం వల్ల రైతుకు డబ్బు కూడా ఆదా అవుతున్నది. ఇదే యంత్రం ద్వారా పురుగుల మందులను పిచికారీ చేసే ఏర్పాటు కూడా చేశారు బాబూరావు. ఇన్ని ప్రయోజనాలున్న బాబూరావు తయారుచేసిన ఈ వినూత్న యంత్రం దేశ, విదేశాల్లో గుర్తింపు పొందింది. దీని ఖరీదు రూ.45 నుంచి రూ.48 వేల వరకు ఉంది. డ్రమ్‌సీడర్‌తో బాబూరావు ఆవిష్కరణలను విడిచిపెట్టలేదు. మొక్కజొన్న పొత్తుల నుంచి గింజలను విడదీసేందుకు చిన్న రైతులకు ఉపయోగపడేలా మనుషులే ఆపరేట్‌ చేసుకునే విధంగా ఒక పరికరాన్ని తయారు చేశారు బాబూరావు.
రైతుల్ని ఆదుకుంటే ఆనందం
గత నెలలో ముఖ్యమంత్రి నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాను. తెలంగాణ, పాండిచ్చేరి, పంజాబ్‌, బెంగాల్‌లో ప్రదర్శనలిచ్చాను. నాబార్డ్‌ నుంచి నూతన ఆవిష్కరణల అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నాను. ఎన్ని అవార్డులు అందుకున్నా రైతులకు మరింత ఉపయోగపడటంలో నిజమైన ఆనందం లభిస్తుంది. కొత్త ఆవిష్కరణలు చేయాల్సిందిగా ప్రైవేటు కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పరికరాలు తయారు చేసేందుకు సిద్ధం.
– డి. బాబూరావు
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *