మంచి మార్కెట్‌తో పామాయిల్‌కు మహర్దశ

పామాయిల్‌ సాగులో తెలుగు రైతులది అందెవేసిన చేయి. బాగా దిగుబడులు వచ్చే సమయంలో పంటకు మంచి ధర లేకపోవడంతో రైతులు లాభాలు అందుకోలేకపోతున్నారు. పామోలిన్‌ నూనెను 90 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రైతుల్ని ప్రోత్సహించి సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వాలు మార్కెట్‌పై దృష్టి సారిస్తే విదేశీమారకం భారీగా ఆదా అవుతుంది.
ఆయిల్‌ పామ్‌ సాగు, ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 4.63 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు కు అవకాశం వుండగా, ప్రస్తు తం 1.55 లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా 29.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి లభిస్తోంది. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోని 225 మండలాల్లో 1.08 లక్షల మంది రైతులు ఆయిల్‌పామ్‌ తోటలు వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 78,427 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగులో వుంది. ఈ ఏడాది మరో 11,500 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెంచాలని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. హెక్టారుకు 19.81 టన్నుల దిగుబడి వచ్చే ఆయిల్‌పామ్‌ గెలల నుంచి ముడి నూనె తీసేందుకు రాష్ట్రంలో 13 ప్రోసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి.
ఏపీ ఆయిల్‌ పామ్‌ రెగ్యులేషన్‌ యాక్టు ప్రకారం ఎక్కడికక్కడ ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలు ఫీల్డ్‌ స్టాఫ్‌తో రైతుల నుంచి గెలలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరకు ఆయా ఫ్యాక్టరీలు ఆయిల్‌ పామ్‌ను కొనుగోలు చేస్తాయి. గత నెలలో టన్ను ఆయిల్‌పామ్‌ గెలలు రూ.7702 పలికాయి. గెలల నుంచి ముడి నూనె తీసి, తర్వాత రిఫైనరీలకు పంపుతారు. ఈ విధంగా నూనె, పిండి, మడ్డినూనె విడివిడిగా వివిధ అవసరాలకు వినియోగిస్తుంటారు. ఏడాదిలో 3 నెలలు సీజన్‌ ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలో పామాయిల్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఏటా జూన్‌ మొదలుకుని ఆగస్టు వరకు 90ు దిగుబడులు వస్తున్నాయి. మిగిలిన 9 నెలల పాటు కేవలం 10ు మాత్రమే పామాయిల్‌ గెలలు ఉత్పత్తి అవుతుంటాయి. మార్కె ట్‌ ధరల విషయానికొస్తే జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లోనే తక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పామాయిల్‌ టన్ను ధర రూ. 7702. కానీ రైతు వద్ద పంటలేదు.
విదేశాలపైనే ఆధారం
దేశీయంగా వినియోగం అయ్యే పామాయిల్‌కు విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రధానంగా మలేసియా, ఇండోనేసియాల నుంచే పా మాయిల్‌ దిగుమతి అవుతుంది. ఈ 2 దేశాల నుంచి ఏటా 80 లక్షల టన్నుల పామాయిల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దేశాల్లో నవంబర్‌ నుంచి సీజన్‌ ప్రారంభమవుతుంది. అప్పుడు ధరలు పెరుగుతు న్నాయి. మన రాష్ట్రంలో సీజన్‌ ఉండే 3 నెలలు మా త్రం ధరలు కనిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. ఇతర దేశాలపై అంతగా ఆధారపడే పామాయిల్‌ సాగును దేశీయంగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, తాడేపల్లిగూడెం
రాయితీల జల్లు
ఆయిల్‌పామ్‌ సాగును మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు రాయితీలు ఇస్తోంది. మొక్కల సరఫరా, సాగు ఖర్చు, వర్మికంపోస్టు యూనిట్‌, బోరుబావులు, బిందు సేద్య పరికరాలకు రాయితీలు ఇస్తున్నారు. మొక్కల సరఫరాకు 85శాతం సబ్సిడీతో హెక్టారుకు రూ.12 వేలకు మించకుండా ఇస్తున్నారు. సాగు ప్రోత్సాహానికి హెక్టారుకు, 50% రాయితీతో ఏడాదికి రూ.5వేల చొప్పున నాలుగేళ్లలో రూ.20 వేలు ఇస్తున్నారు. అంతర పంటల సాగుకు 50% రాయితీతో హెక్టారుకు రూ.5 వేలు మించకుండా నాలుగేళ్లలో రూ.20వేలు; కొత్తగా బోరుబావులు, నీటి కుంటల తవ్వకానికి 50% రాయితీతో రూ.50వేలకు మించకుండా, మైక్రో ఇరిగేషన్‌ పథకం నిబంధనల ప్రకారం 50% సబ్సిడీతో బిందు సేద్య పరికరాలు ఇస్తున్నారు. రాయితీలు వినియోగించుకుని, ఆయిల్‌పామ్‌ సాగు పెంచాలని, రాయితీ లబ్ధి పొందేందుకు స్థానిక ఉద్యాన అధికారి లేదా జిల్లాలోని ఉద్యాన శాఖ ఏడీని సంప్రదించాలని ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి రైతులను కోరారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *