మెరిసిన మహిళారైతు

ఒక మహిళా రైతుకు వచ్చిన మెరుపులాంటి ఆలోచన ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. పశువుల దాణా కోసం పాడి రైతులు పడుతున్న కష్టాలు గమనించిన ఆ మహిళా రైతు పశువుల దాణా తయారుచేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
పశువుల పెంపకంలో దాణా అత్యంత కీలకం. పశువులు ఆరోగ్యంగా వుండి, పుష్కలంగా పాలు ఇవ్వాలంటే వాటికి ఇచ్చే ఆహారం మేలైనదిగా వుండాలి. ఈ పరిస్థితులన్నింటినీ దగ్గరగా గమనించారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన కుంచే అమరావతి. నాణ్యమైన పశువుల దాణా తయారుచేసి రైతులకు అందిస్తే లాభదాయకంగా వుంటుందని భావించారు. మహిళా స్వశక్తి సంఘాల సహకారంతో రూ.2.5 లక్షల ఖర్చుతో దాణా తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. పాడి రైతులకు అతి తక్కువ ధరకు పశువుల దాణా అందించడం ప్రారంభించారు.
ఒడిదుడుకులు ఎదురైనా…
దాణా తయారీ కేంద్రం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వాటిని ఽభర్త శ్రీనివాస్‌ సాయంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. అమరావతి బ్రాండ్‌ పేరుతో ఆమె దాణా ప్యాకెట్లు తయారుచేశారు. మార్కెట్‌లో మిగిలిన వారి కంటే తక్కువ ధరకు దాణా ప్యాకెట్లు విక్రయించడం ప్రారంభించారు. సాధారణ పశుగ్రాసం కిలో ఒక్క రూపాయికి, అధిక పోషక విలువలతో కూడిన మొక్కజొన్న, కర్ర పెండలం, తవుడు, పత్తిపిండి మొదలయిన మిశ్రమంతో తయారుచేసిన మినరల్‌ మిక్స్‌ దాణాను కేవలం రూ.20కి రైతులకు విక్రయిస్తూ నెలకు రూ. ఎనిమిది నుంచి పది వేల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారామె. యూనిట్‌ను ప్రారంభించిన ఏడాదిలోనే ఆమె ఉత్పత్తి పరమైన లక్ష్యాన్ని సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
మోదీ నుంచి పురస్కారం
రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్థక శాఖకు కేటాయించిన ఇన్నోవేటివ్‌ ఫండ్స్‌ ద్వారా రాయితీలు అందుకుని పశువుల దాణా కేంద్రాన్ని ప్రారంభించిన ఆ మహిళా రైతు అనతికాలంలో లక్ష్యాని చేరుకుని రికార్డు సృష్టించారు. ఆమె కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. ఆమె త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. పాడి రైతుల అభివృద్ధికి చేస్తున్న అమరావతి కృషికి రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రశంసలు, సత్కారాలు లభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితర ప్రముఖుల నుంచి ఆమె ప్రశంశలను అందుకున్నారు.
స్వయం ఉపాధికి మేలు
దాణా కేంద్రం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాను. నేను నా కుటుంబ సభ్యులం అంతా కష్టపడి దాణా తయారు చేస్తున్నాం. పాడి రైతులకు అందుబాటు ధర నిర్ణయించి, నాణ్యమైన దాణా అందిస్తున్నాం. ముడి సరుకును ప్రభుత్వం రాయితీపై అందిస్తే మరింత ప్రయోజనం వుంటుంది.
– కుంచే అమరావతి, తిరుపతి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *