
- ‘చపాటా’ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు
చపాటా మిర్చి… చూడ్డానికి భలే రంగు… కారం తక్కువ. దీంతో ఈ వెరైటీ మిర్చికి విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఫుడ్ కలర్ మేకింగ్, ఔషధాల తయారీకి కూడా ఈ మిర్చి అనుకూలంగా వుండటంతో రైతులకు ఈ పంట సిరులను కురిపిస్తోంది. వెరైటీ పంటకు కేరా్‌ఫగా మారిన వరంగల్ రూరల్ జిల్లాలోని రెండు గ్రామాలు రైతుల్ని కలుద్దాం రండి.
వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపూర్, రేలకుంట గ్రామాల్లో చపాటా మిర్చిని ఐదు వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. మూడు తరాలుగా రంగాపూర్ గ్రామంలో రైతులంతా చపాటా మిర్చినే సాగు చేస్తూ వస్తున్నారు. రంగాపూర్ గ్రామంలో 350 రైతు కుటుంబాలుండగా, 2800 ఎకరాల్లో పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా చపాటా మిర్చిని సాగు చేస్తున్నారు. మరెక్కడా లేని విధంగా వరంగల్ రూరల్ జిల్లాలోఈ మిర్చి పండుతోంది.
చపాటా మిర్చి ఎరుపు రంగుతో ఆకర్షణీయంగా ఉం టుంది. రంగు ఎక్కువగా ఉండి, ఘాటు తక్కువగా ఉంటుంది. దీని రంగును వేరుచేసి ఆహార పదార్థాల తయారీ, బేవరేజెస్, ఫార్మా కంపెనీల్లో ఉపయోగిస్తున్నారు. కృత్రిమ రంగులతో ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తున్నందున సహజసిద్ధమైన ఈ చపాటా మిర్చి రంగును వాటిల్లో ఉపయోగిస్తున్నారు. మరోవైపు కారాన్ని కూరల్లో ఉపయోగించుకోని ఇతర దేశాల్లో దీని నుంచి వేరు చేసిన ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ చపాటా మిర్చికి అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ మిర్చికి మలేసియా, సింగపూర్, చైనా ప్రాంతంలో భలే గిరాకీ ఉంది. చపాటా మిర్చిలోని ఆయిల్ ద్వారా విదేశాల్లో వయాగ్రా లాంటి ఔషధాల్లో సైతం వాడుతున్నట్టు రైతులు చెప్తున్నారు.
రంగాపూర్ గ్రామంలోని రైతులు కొందరు నల్లబెల్లి మండలంలోని రంగాపూర్ గ్రామానికి 30 ఏళ్ల క్రితం వలస వచ్చారు. ఇలా వారి వలసతో చపాటా విత్తనం రావడంతో ఒకరి నుంచి మరొకరికి విత్తనం అంది ఇప్పుడు ఊరంతా విస్తరించింది. ఈ విత్తనం ల్యాబ్‌లో రూపొందలేదు. చాలా వరకు రైతులు ప్రకృతి మీద భారం వేసి ఈ మిర్చి పంటను సాగు చేస్తున్నారు. తరచూ వైర్‌సల బారిన పడడంతో చాలావరకు నష్టం వాటిల్లినట్టు రైతులు చెప్తున్నారు. ఈ వెరైటీ మిర్చి పంటకు సోకుతున్న తెగుళ్లను అరికట్టేందుకు అవసరమైన పరిశోధనలు లేకపోవడంతో ఒక్కోసారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది వైరస్ ప్రభావంతో దిగుబడి తగ్గింది. వ్యవసాయ అధికారులు వచ్చి సూచనలు ఇవ్వడం తప్ప, ఎలాంటి మందులను కనిపెట్టలేకపోతున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న తరుణంలో చపాటా మిర్చిని విస్తృతంగా సాగు చేసేందుకు వీలుగా వరంగల్ రూరల్ జిల్లాలో మిర్చి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రంగాపూర్ సర్పంచ్ గోనె రాంబాబు కోరారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్ రూరల్
పెట్టుబడి, దిగుబడులు ఎక్కువే
చపాటా మిర్చి సాగుకు నల్ల రేగడి భూములు అనుకూలంగా ఉంటాయి. ఎకరానికి 50 వేల నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెడితే 15 నుంచి 18 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వస్తోంది. విత్తనం నుంచి యాజమాన్య పద్ధతులకు భారీగానే పెట్టుబడులు అవసరమవుతాయి. బిందు సేద్యం ద్వారా అయితే మరింత దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో రేట్లను బట్టి ఆదాయం ఉంటుంది. గత ఏడాది ధరలు భారీగా పతనం కావడంతో రైతులకు ఆదాయం రాక నష్టాల బారిన పడ్డారు. సాధారణంగా బహిరంగ మార్కెట్లో ఒక్కో క్వింటాల్‌కు ధర రూ. 15వేల వరకు ఉంటుంది. ఒక ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
Credits : Andhrajyothi