రంగు గోధుమలు వస్తున్నాయ్‌!

 

వరి పొట్టు రంగులో వుండే గోధుమలు ఇక ముందు మరిన్ని రంగుల్లో మార్కెట్‌లోకి రానున్నాయి. నలుపు, నీలం, ఊదా రంగుల గోధుమలను కూడా రూపొందించారు పంజాబ్‌లోని నేషనల్‌ అగ్రి-ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ (నబీ) శాస్త్రవేత్తలు. సాధారణ గోధుమలతో పోలిస్తే పుష్కలంగా పోషక విలువలున్న రంగు గోధుమలను ఐదేళ్ల పాటు శ్రమించి రూపొందించారు నబీ నిపుణులు.
బియ్యం, గోధుమలనే దేశంలోని ప్రజలు ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. బియ్యంతో పాటు సాధారణ గోధుమల్లో పోషక విలువలు స్వల్పంగా వుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా వుండే గోధుమలను సృష్టించేందుకు నబీ శాస్త్రవేత్తలు నడుంకట్టారు.
అలా రంగు గోధుమలు రూపుదిద్దుకున్నాయి. రంగు గోధుమల్లో సూక్ష్మ పోషకాలు అధికంగా వుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇనుము, జింకు వంటి సూక్ష్మపోషకాలు అధికంగా వుండడం వీటి ప్రత్యేకత. ఊబకాయం, అధిక కొవ్వు, ఇన్సులిన్‌ నిరోధకతపై రంగు గోధుమలు ప్రభావం చూపుతాయని నమూనా అధ్యయనాల్లో తేలింది. సూక్ష్మ పోషక లోపాలున్న వారికి నాణ్యత కలిగిన ఈ గోధుమల ద్వారా ఇనుము, జింకు బాగా లభిస్తాయి.
రంగు గోధుమల దిగుబడి సాధారణ గోధుమల కంటే అధికంగా వుంటుందని, రైతులకు కూడా లాభసాటిగా వుంటుందని క్షేత్ర స్థాయి పరిశోధనల్లో వెల్లడైంది. ఫలితంగా రంగు గోధుమలు వినియోగదారులకు తక్కువ ధరకే లభిస్తాయి. సహజమైన రంగులతో పండే ఈ గోధుమల పిండితో బేకరీ ఉత్పత్తులను తయారు చేసుకునే వీలుంటుంది. త్వరలో ఈ గోధుమలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నబీ సంస్థ పేర్కొంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అమరావతి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *