రబీకి నీరు ప్రధానం

ఖరీఫ్‌లో వాతావరణం అనుకూలించక పంట వేయని రైతులు రబీ సాగుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో రబీకి అనువైన వంగడాల ఎంపిక, పంటల సాగులో యాజమాన్య పద్ధతులు చాలా ముఖ్యం అంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ కె. రాజారెడ్డి.
రబీ సాగుకు రైతులు ఏవిధంగా సన్నద్ధం కావాలి?
ఖరీఫ్‌ పంట కోత పూర్తి కాగానే, రబీ సాగుకు మళ్లీ భూమిని సిద్ధం చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి పంటను ఎంచుకోవాలి. నీటి లభ్యతను గమనించాలి. నాణ్యమైన విత్తనాలను సేకరించుకోవాలి. వరి మాగాణుల్లో అయితే మినుము, పెసర వేసుకోవచ్చు. 7 లేదా 8 తడులు ఇవ్వగలిగేంత నీటి వనరులు ఉంటే మొక్కజొన్న, వేరుశనగ వేయవచ్చు.
ఈ సీజన్‌కు అనువైన వంగడాలు ఏవీ?
మినుములో పల్లాకు తెగులు తట్టుకునే టీబీజీ 104, ఎల్‌బీజీ 787, పీయూ 31. పెసరలో పల్లాకు తెగులు తట్టుకునే డబ్ల్యూజీజీ4, టీఎం96-2, ఎల్‌జీజీ 460. వేరుశనగలో కదిరి6, కదిరి9, నారాయణి, ధరణి, కదిరి హరితాంధ్ర, కదిరి 7-8(బోల్ట్‌), అమరావతి, చిత్రావతి. కాలపరిమితి 105-110 రోజులు. శనగలో జేజీ 11, ఎన్‌బీఈజీ 49, ఎన్‌బీఈజీ 47. వరిలో ఎంటీయూ 1156, కాటన్‌దొర సన్నాలు, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఎంటీయూ 1121(శ్రీధృతి) రకాలు రబీ సీజన్‌కు అనువైనవి.
సాధారణంగా ఏ పంట అయినా భూసారాన్ని బట్టి వేసుకోవాలి. భూసార పరీక్షల ఫలితాల ప్రకారం సూక్ష్మపోషకాల లోపాలను నివారించుకుని, తమకు అనువైన పంటలు వేసుకోచ్చు. ఇం దుకు సమీపంలోని పరిశోధన స్థానం/ ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించి, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. విశ్వవిద్యాలయ పరిశోధన స్థానాల ద్వారా బ్రీడర్‌ సీడ్‌ను ఏపీ సీడ్స్‌కు సరఫరా చేస్తారు. ఏపీ సీడ్స్‌ అభివృద్ధి చేసిన ఫౌండేషన్‌, సర్టిఫైడ్‌ విత్తనాలను రైతులకు అందిస్తారు.
రబీలో ఏ పంటలు లాభదాయకం?
రబీలో ఆరుతడి పంటలు లాభదాయకం. మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ వంటి రకాలు. మొక్కజొన్న సరాసరి దిగుబడి 35-40 క్వింటాళ్లు వస్తుంది. మినుము 6-8 క్వింటాళ్లు, పెసర 5-6 క్వింటాళ్లు, శనగ 10-12 క్వింటాళ్లు, వేరుశనగ 2 లేదా 3 నీటితడులు అందిస్తే, 13-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రబీ సీజన్‌ వర్షాకాలం కాదు కాబట్టి మాగాణుల్లో కాలువల నీటి లభ్యత, మెట్టలో కుంటల్లో నీటి నిల్వలను ఉపయోగించుకోవాలి. వరికి బదులు ఆరుతడి పంటలు మేలు.
పరిశోధన ఫలితాలను రైతులకు ఏవిధంగా అందిస్తున్నారు?
వ్యవసాయ పంచాంగం, ప్లాంటిక్స్‌ వంటి యాప్‌లను రైతులు వినియోగించుకోవాలి. పరిశోధన స్థానాలు, ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు రైతుల సందేహాలు తీరుస్తారు. వ్యవసాయ శాఖ, ఆత్మా ప్రాజెక్టు ద్వారా చంద్రన్న రైతు క్షేత్రాలు ఏర్పాటుచేసి, పంటల యాజమాన్యంపై సూచనలు ఇస్తున్నాం.
అన్నపూర్ణ కృషి ప్రసారసేవ టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 3141 ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఫార్మర్‌ కాల్‌ సెంటర్‌ 1800 425 0430 ద్వారా కూడా రైతుల ప్రశ్నలకు సమాధానాలిస్తాం.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *