లంబసింగికి స్ట్రాబెర్రీ సిరి

సేంద్రియ పద్ధతుల్లో సాగుచేస్తున్న టీచర్‌.. ఎకరాకు మూడు లక్షలకు పైగా ఆదాయం. నోరూరించే స్ట్రాబెర్రీ సాగు ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తోంది. చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామానికి చెందిన గిరిజన రైతు బౌడు కుశలవుడు ఏడేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. అతని స్ఫూర్తితో చిక్కుడుబట్టి గ్రామానికి చెందిన గిరిజన యువ ఉపాధ్యాయుడు వనుము రాజ్‌కుమార్‌ పదెకరాల్లో స్ట్రాబెర్రీ, బొప్పాయి సాగు చేస్తూ లాభాల పంట పండిస్తున్నాడు.
గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీ అమెరికాలో పుట్టింది. యూరోపియన్లు ఈ వంగడాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేవలం విశాఖ ఏజెన్సీలో మాత్రమే స్ట్రాబెర్రీ పండుతోంది. ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ‘ఆంధ్ర కశ్మీర్‌’ లంబసింగి పరిసర ప్రాంతాల్లో గిరిజన రైతులు స్ట్రాబెర్రీ సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
గొందిపాకలు పంచాయతీ చిక్కుడుబట్టి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ ఇదే మండలంలో 2001 నుంచి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు వారికున్న పదెకరాల భూమిలో సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజ్‌కుమార్‌ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయంలో ఏదో సాధించాలనే తపన వుండేది. దీంతో గత ఏడాది ఉద్యాన పంటల సాగు ప్రారంభించాడు.
రాజ్‌కుమార్‌కు వరుసకు సోదరుడయ్యే బౌడు కుశలవుడు ఏడేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేస్తూ ఒడిదొడుకులను ఎదుర్కొంటూ గత ఏడాది నుంచి లాభాలబాట పట్టారు. అతని సలహాతో రాజ్‌కుమార్‌కు స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించాలనే కోరిక కలిగింది. వెంటనే స్నేహితుడు అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తిచేసిన నర్సీపట్నంకు చెందిన సత్యనారాయణతో కలిసి స్ట్రాబెర్రీ, బొప్పాయి సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాజ్‌కుమార్‌ ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న సిరిపురం గ్రామంలో పది ఎకరాలు కౌలుకు తీసుకుని ఉద్యాన పంట సాగును ప్రారంభించాడు. 1.5 ఎకరాల్లో పూణె నుంచి దిగుమతి చేసుకున్న వింటర్‌డాన్‌ రకం స్ట్రాబెర్రీ మొక్కలను ఈ ఏడాది సెప్టెంబర్‌ ఆఖరులో వేశారు.
రాజ్‌కుమార్‌ ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సహకారంతో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ స్ట్రాబెర్రీ, బొప్పాయి సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీ మొక్కలను అడుగు ఎత్తు కలిగిన బెడ్స్‌ ఏర్పాటుచేసి మధ్య అడుగు దూరం పాటిస్తూ నాట్లు వేసుకున్నారు. స్ట్రాబెర్రీలు నేలకు తగిలి పాడైపోకుండా వుండేందుకు మల్చింగ్‌ షీట్‌ వేసుకున్నారు. స్ట్రాబెర్రీ, బొప్పాయి పంటలకు పూర్తిస్థాయిలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుచేసుకున్నారు. స్ట్రాబెర్రీ, బొప్పాయిలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయడం మరో విశేషం.
మొక్కలు దిగుమతి మొదలుకొని నాట్లు, సస్యరక్షణ కోసం స్ట్రాబెర్రీకి రూ.3.5 లక్షలు, బొప్పాయికి రూ.1.5 లక్షలు ఖర్చు చేశారు.
బొప్పాయి సెప్టెంబర్‌ నుంచి దిగుబడి వస్తోంది. ఒక్కొక్క కాయ మూడు కిలోలు పైబడి వుంది. తీపి అధికంగా వుంది. కిలో బొప్పాయి రూ.15 చొప్పున నర్సీపట్నం మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కేవలం నెలరోజుల్లో రూ.40 వేల విక్రయాలు నిర్వహించినట్టు రాజ్‌కుమార్‌ చెబుతున్నాడు. నవంబర్‌ మొదటి వారం నుంచి స్ట్రాబెర్రీ దిగుబడి మొదలైంది. డిమాండ్‌ అధికంగా వుండడంతో ప్రస్తుతం 200 గ్రాముల స్ట్రాబెర్రీలను రూ.80లకు విక్రయిస్తున్నాడు. ఇరవై రోజుల్లో కోసిన స్ట్రాబెర్రీలను అమ్మడం ద్వారా రూ. 35 వేల ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు.
అనంతగిరిలో సైతం..
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన రైతు జనార్దనరావు స్థానికులతో కలిసి అనంతగిరిలో ఎకరన్నర విస్తీర్ణంలో ఈ ఏడాది స్ర్టాబెర్రీ సాగు ప్రారంభించారు. 32 వేల మొక్కలను నాటగా వాటిలో 30 వేల వరకూ కాపునకు వచ్చాయి. ఈ పంట సాగుకు అనంతగిరి ప్రాంతం కూడా అనుకూలంగా వుంది. సారవంతమైన నేల అయితే మరింత దిగుబడి వచ్చే అవకాశం వుందని జనార్దనరావు అన్నారు. ఎకరాకు 20 వేల మొక్కలు నాటవచ్చునని, సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నానని ఆయన తెలిపారు. పెట్టుబడి పోను రూ.2.5 లక్షల ఆదాయం వస్తుంది ఆయన అంచనా వేస్తున్నారు. పర్యాటకులు ఈ ప్రాంతానికి అధికంగా రావడంతో మార్కెటింగ్‌ తేలిగ్గా వుంది. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే స్ట్రాబెర్రీ సాగుకు తిరుగుండదని ఆ రైతు చెప్పారు.
స్వప్నం ఫలించింది.
వ్యవసాయంలో లాభాలు గడించాలనే నా కల నెరవేరింది. బొప్పాయి, స్ట్రాబెర్రీ దిగుబడులు, విక్రయాలను పరిశీలిస్తే పెట్టుబడి రూ.5 లక్షలు పోనూ రూ.3-4 లక్షల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను. రైతు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే నష్టపోడని నిరూపించాలన్నదే నా ఆశయం. విశాఖ ఏజెన్సీ వాతావరణం ప్రకృతి ప్రసాదించిన వరం. దీన్ని రైతులు అందిపుచ్చుకుంటే ఆదాయం పెంచుకోవచ్చు.
– రాజ్‌కుమార్‌, స్ట్రాబెర్రీ రైతు, చిక్కుడుబట్టి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *