వినూత్న ఆవిష్కరణల మల్లేశం

దిగుబడి ఖర్చులు పెరగడం, కూలీలు దొరక్కపోవడం, వ్యవసాయ పరికరాల ధరలు చుక్కల్లో వుండటంతో రైతులే శాస్త్రవేత్తలుగా మారుతున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా
అడ్డగూడూరు మండలం ఆజీంపేట గ్రామానికి చెందిన బొమ్మగాని మల్లేశం రైతులకు ఉపయోగపడే పలు రకాల పరికరాలు రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌
ప్రశంసలు అందుకున్నారు.
రైతులు చేలకు క్రిమిసంహారక మందు పిచికారి చేయడానికి చేతిపంపు లేదా పెట్రోల్‌తో నడిచే తైవాన్‌ స్ర్పేయర్‌ వాడతారు. పెట్రోల్‌ ఖర్చు భారం రైతుపై పడకుండా వుండాలన్న ఆలోచనతో సోలార్‌ పవర్‌ స్ర్పేయర్‌ను రూపొందించాడు మల్లేశం. దానికి చార్జింగ్‌ బ్యాటరీని అమర్చాడు. సోలార్‌ స్ర్పేయర్‌ పనితీరును పరిశీలించిన రైతులతో పాటు సీఎం కేసీఆర్‌ ఆ యువరైతును

అభినందించారు.

విత్తనం విత్తే యంత్రం
మల్లేశం విత్తనం విత్తే యంత్రాన్ని రూపొందించాడు. కూలీల చేత విత్తనాలు వేయిస్తే కుప్పలు కుప్పలుగా పడటం లేదా దూ రంగా పడటం, గాలికి నాగటి సాలులో కాకుండా బయట పడుతుంటాయి. మల్లేశం రూపొందించిన విత్తనం విత్తే పరికరంతో కూలీలు, పశువుల అవసరం లేకుండా రైతు ఒక్కరే విత్తనం వేసుకోవచ్చు. ముందు విత్తనం పడుతుండగా వెనుక నుంచి విత్తనం పడిన సాలును పూడ్చుకుంటూ వస్తుంది ఈ పరికరం. కుందెనలో విత్తనం పోసి అవి తగినంత మోతాదులో వచ్చేలా రేకును సరిచేస్తారు. కోలలాగా ఉన్న పైపును రైతు లాగుతుంటే కింద అమర్చిన కర్రుతో సాలు వచ్చి మధ్యన అమర్చిన చక్రం ద్వారా విత్తనం సాలులో కావాల్సినంత ఎడంగా పడుతుంది.
బావిలో నీళ్లు అయిపోగానే…
ఇప్పుడు రైతులంతా ఆటోమేటిక్‌ స్టార్టర్లు వాడుతున్నారు. దీంతో బావిలో నీరు అయిపోయినా మోటార్‌ తిరుగుతూనే ఉంటుంది. అలా గంటలు గంటలు నడిచి బుష్‌లు, బేరింగులు దెబ్బతినడం, మోటారు కాలిపోవడం జరుగుతున్నది. అలా రైతు నష్టపోకుండా ఉండేందుకు మల్లేశం బావిలో నీళ్లు అయిపోగానే ఆటోమేటిక్‌గా స్టార్టరు ఆగిపోయేలా ఓ చిన్న పరికరాన్ని రూపొందించాడు.
యూరియా చల్లే యంత్రం
వరి నాటే సమయంలో రైతులు యూరియా చేతితో గుప్పుతారు. అలా చేయడం వల్ల కుప్పలుగా పడటం, అసలే పడకపోవడం జరుగుతుంది. అలా కాకుండా సోలార్‌తో యూరియా చల్లే యంత్రాన్ని మల్లేష్‌ రూపొందించాడు. డబ్బాలో యూరియా పోసి దానికి అమర్చిన డీసీ మోటారు ద్వారా ఫ్యాన్‌ తిరుగుతుంటే యూరియా అందులోంచి సమానంగా సుమారు 12 అడుగుల వెడల్పుతో పడుతుంది. రైతులకు ఉపయోగపడే ఇన్ని పరికరాలు రూపొందించిన ఈ యువ రైతుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాస్థాయి గ్రామీణ శాస్త్రవేత్త అవార్డు లభించింది.
 
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మోత్కూరు
ప్రభుత్వం సహకారం ఉంటే..
నూతన పరికరాలు తయారీ కోసం ఖర్చు చేసే ఆర్థిక స్థోమత నాకు లేదు. స్వచ్ఛంద సంస్థలు, మిత్రులు అందిస్తున్న సహకారంతో నూతన పరికరాలు రూపొందిస్తున్నాను. ప్రభుత్వం సహకారం అం దిస్తే రైతులకు ఉపయోగపడే మరిన్ని నూతన పరికరాలు రూపొందిస్తాను.
బొమ్మగాని మల్లేశం, రైతు
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *