
కర్నూలు జిల్లాలో 1.35 లక్షల హెక్టార్లలో పప్పుశనగ సాగవుతున్నది. తాజాగా తెగుళ్లు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తెగుళ్లతో పంట ఎండిపోతున్నది. ఆలూరు మం డలం మొలగవెల్లి గ్రామానికి చెందిన రైతు చౌడప్ప ఎనిమిది ఎకరాలలో పప్పుశనగ సాగు చేశారు. విత్తనం, పురుగు మందులు, సేద్యం తదితర ఖర్చుల రూపంలో ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. పైరు ఎదుగుదల చూపి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించారు. పైరు పూత దశలో పచ్చపురుగు, లద్దెపురుగు ఆశించింది. దీంతో పైరు ఎండిపోతోందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కొనుగోలు చేసే మందులు నకిలీవి కావడంతో వాటిని పిచికారీ చేసినా ఫలితం వుండటం లేదని రైతులు వాపోతున్నారు.
వ్యవసాయాధికారులు చేల వైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏ మందు వాడాలో సూచనలు ఇచ్చేవారు లేరని, పరిస్థితి ఇలానే కొనసాగితే ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కర్నూలు
సూచన మేరకే మందులు వాడాలి
పప్పుశనగ పైరును పచ్చపురుగు, లద్దెపురుగు ఆశించాయి. పంటలు ఎండిపోతున్నాయి ఎండిన పంట సాళ్లలో డవీస్పిన్ అనే మందును లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున ఎకరాకు 200 గ్రాములు భూమి పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. పచ్చపురుగు, లద్దెపురుగు నివారణకు నివాల్ జరాన్ అనే మందును లీటర్ నీటికి ఒక మి.లీ కలిపి ఎకరాకు 200 మి.లీలు పిచికారీ చేయాలి. లేదా పైనోప్యాడ్ అనే మందును లీటర్ నీటికి 0.3 మి.లీలు చొప్పున ఎకరాకు 60 మి.లీలు పిచికారీ చేయాలి. రైతులు వ్యాపారుల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయకుండా వ్యవసాయాధికారులు సూచించిన మందులనే పిచికారీ చేయాలి.
– డాక్టర్ ప్రసాద్‌బాబు, ప్రధాన శాస్త్రవేత్త, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం
Credits : Andhrajyothi