సీతాఫలానికి రియల్‌ శాపం

దేశంలోనే పేరొందిన షాద్‌నగర్‌ ప్రాంతంలో పండే బాలానగర్‌ రకం సీతాఫలం పండు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. రియల్‌ ఎసేట్‌ వ్యాపారం పెరగడం, వ్యాపారులు సీతాఫలం చెట్లను నరికివేస్తుండడంతో ఫలాల దిగుబడి గణనీయంగా తగ్గింది. నాణ్యమైన ఫలాలు కనిపించకుండా పోతున్నాయి.
భారతదేశంలోనే బాలానగర్‌ రకం సీతాఫలాలకు మంచి డిమాండ్‌ వుంది. గుజ్జు ఎక్కువగా, గింజ తక్కువగా వుండే బాలానగర్‌ రకం సీతాఫలాలు షాద్‌నగర్‌ ప్రాంతంలోనే అధికంగా లభించేవి. వ్యవసాయ భూముల్లోనే కాకుండా సాగుకు అనుకూలంగా లేని భూముల్లో సైతం సీతాఫలం చెట్లు అధికంగా ఉండేవి. పేద, మధ్యతరగతి రైతులు సీతాఫలం చెట్లను రక్షిస్తూ వచ్చారు.
అలాగే భూస్వాముల భూముల్లో సైతం చెట్లు అధికంగా ఉండేవి. అయితే షాద్‌నగర్‌ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ పేరుతో భూములను కొనుగోలు చేస్తున్న వారు భూమి చదును చేసే సమయంలో సీతాఫలం చెట్లను కూకటివేళ్లతో పీకి వేస్తున్నారు. అలాగే షాద్‌నగర్‌ ప్రాంతంలోని భూములను బడాబాబులు కొనుగోలు చేసి పరిశ్రమలు, ఫామ్‌హౌజ్‌ల నిర్మిస్తున్నారు. ఒకవైపు చెట్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు నాలుగేళ్లుగా వెంటాడిన వర్షాభావ పరిస్థితులతో చాలా చెట్లు ఎండిపోయాయి. దీంతో సీతాఫలాల దిగుబడి గణనీయంగా తగ్గింది.
40 టన్నుల నుంచి 4 టన్నుల దాకా..
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, వెంటాడిన వర్షాభావ పరిస్థితుల వల్ల సీతాఫలాల ఉత్పత్తులు ఏటేటా తగ్గుతూ వస్తున్నాయి. పదేళ్ళ క్రితం షాద్‌నగర్‌ మార్కెట్‌కు పరిసర గ్రామాల నుంచి నిత్యం 30 నుంచి 40 టన్నుల సీతాఫలాలు వచ్చేవి. ఇక్కడికి ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, రాయిచూర్‌, లిగ్సుర్‌, బంగారట్టి, నంద్యాల, ఆర్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి సీతాఫలాలను కొనుగోలు చేసేవారు.
పంట దిగుబడి తగ్గడం, నాణ్యమైన పండ్లు రాకపోవడంతో దూర ప్రాంతాల వ్యాపారులు రావడం మానుకున్నారు. ప్రస్తుతం షాద్‌నగర్‌ మార్కెట్‌కు మూడు, నాలుగు టన్నుల కాయలు మాత్రమే వస్తున్నాయి. రాయిచూర్‌, నంద్యాల ప్రాంతాల వ్యాపారులు మాత్రం ఇక్కడకు వచ్చి పంట కొనుగోలు చేస్తున్నారు.వ్యాపారుల మధ్య పోటీ తగ్గడంతో ధరలు ఆశించిన మేరకు రావడం లేదని మార్కెట్‌కు సీతాఫలాలను తీసుకు వస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *