సేంద్రియ పసుపు సాగుకుశ్రీకారం

తెలంగాణలోనే తొలిసారి ప్రయోగం.. విజయపథంలో మహబూబాబాద్‌ రైతులు
సేంద్రియ సాగు అంటే లాభాలు పెద్దగా వుండవని, పండించిన పంట అమ్ముకోడానికి తంటాలు పడాలని భావిస్తుంటారు. ్ఞ అయితే సేంద్రియ పద్ధతుల్లో పసుపు సాగును చేపట్టి విజయం సాధించారు ఆలేరు గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు.
మహబూబాబాద్‌ జిల్లా ఆలేరు గ్రామానికి చెందిన రూపిరెడ్డి గోపాల్‌రెడ్డి, చిన్నముప్పారంకు చెందిన కాలేరు నేతాజీ, వావిలాలకు చెందిన బానోత్‌ బోజ్యానాయక్‌ తెలంగాణలోనే తొలిసారిగా ఏసీసీ-48 ప్రతిభ దేశవాళీ రకం పసుపును సేంద్రియ పద్ధతిలో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా గుండెమెడ గ్రామానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ ఆజాద్‌ తన వ్యవసాయ క్షేత్రంలో కేవలం 14 కిలోల ఏసీసీ-48 దేశవాళీ రకం పసుపు వంగడాలతో అధిక దిగుబడులు సాధించాడని యూట్యూబ్‌లో చూశారు ఈ ముగ్గురు రైతులు. వెంటనే ముగ్గురూ ఆ వ్యవసాయ కేత్రం వెళ్లి పసుపు పంటను పరిశీలించారు. రైతుల ఆసక్తికి ముగ్ధుడైన చంద్రశేఖర్‌ ఆజాద్‌ తలో 3 క్వింటాళ్ల పసుపు విత్తనాలను ఉచితంగా అందజేశారు. ఆజాద్‌ సూచనల మేరకు గోపాల్‌రెడ్డి 4 ఎకరాలు, నేతాజీ 3 ఎకరాలు, బానోత్‌ బోజ్యానాయక్‌ 3 ఎకరాలలో సాగు చేపట్టారు.
ప్రస్తుతం వారి పసుపు పంట చీడపీడలు లేకుండా అద్భుతంగా ఉంది. డిసెంబర్‌ నెలలో పంట చేతికి రానుంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఏసీసీ-48, ఎసీసీ-79 పసుపు వంగడాలు స్వల్పకాలిక వంగడాలు కావడం, ఏడు నెలల కాలంలోనే పంట చేతికి వస్తుండటంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. సాధారణ సాగుతో పసుపులో నీరు నిలిచి దుంపకుళ్లు, వేరుకుళ్లు వస్తుంది. వేరుకుళ్లు, దుంపకుళ్లును నివారించడానికి బోదె పద్ధతిని ఎంచుకున్నారు. పసుపు తేమతో పండే పంట కాబట్టి నీరు నిలవకుండా ఉండటానికి బోదె పద్ధతి అనుసరిస్తున్నారు. బోదె వలన పసుపుకొమ్ములు సాగి అత్యధికంగా ఊరుతుంది. సాళ్ల మధ్య దూరం ఉండటం వలన పసుపు ఎక్కువ దిగుబడి వస్తుంది. తక్కువ నీటితో ఎక్కువగా సాగు చేసుకునే అవకాశం ఉంది. బోదె పద్ధతిలో ఎకరానికి 3 క్వింటాళ్ల పసుపు సీడ్‌ సరిపోతుంది. సాధారణ సాగుకు 8 క్వింటాళ్ల పసుపు సీడ్‌ అవసరం అవుతుంది. దీంతో ఉద్యాన శాఖ ఈ సాగును ప్రోత్సహిస్తోంది.
 ఆంధ్రజ్యోతి ప్రతినిధి,
నెల్లికుదురు
సాగు సులభం లాభాలు పుష్కలం
ఎసీసీ 48, ఏసీసీ 79 రకం పసుపు వంగడాలను సేంద్రియ, బోదె పద్ధతిలో సాగు చేయడం వలన ఎకరానికి పచ్చి పసుపు 250 నుంచి 300 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. ఎండు పసుపు 45 నుంచి 50 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ వంగడాల్లో కర్కిమిన్‌ (రంగు) 9.3 శాతం ఉంటుంది. మిగిలిన పసుపు రకాల కంటే సేంద్రియ పసుపులో కర్కిమిన్‌ శాతం చాలా అధికం. ఎకరానికి సుమారు 250 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఒక ఎకరంలో పండించిన సేంద్రియ పసుపు సీడ్‌ను ఇతర రైతులకు విక్రయిస్తే క్వింటాకు రూ. 4 వేల చొప్పున 250 క్వింటాళ్లకు 10 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆజాద్‌ సూచనలు భేష్‌
గుంటూరుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ ఆజాద్‌ సూచనల మేరకు సేంద్రియ పద్ధతిలో సాగు చేసి సక్సెస్‌ దిశలో పయనిస్తున్నాం. ఉద్యానవన శాఖ అధికారులు సేంద్రియ ఎరువులు ఇచ్చి పోత్సహిస్తున్నారు. మా పసుపును సీడ్‌ కోసం ఇతర రాష్ట్రాల వ్యవసాయ శాఖ వారు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
– రూపిరెడ్డి గోపాల్‌రెడ్డి, రైతు, ఆలేరు
సేంద్రియంతో అధిక దిగుబడి
బోదె పద్ధతి సేంద్రియ పసుపు సాగుతో అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్‌లో పంట చేతికందుతుంది. ఎకరానికి పచ్చి పసుపు 250 నుంచి 300ల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మా కృషికి ఐఐఎస్‌ఆర్‌ సంస్థచే గుర్తింపు పొందడం ఆనందంగా ఉంది.
నేతాజీ, రైతు, చిన్నముప్పారం
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *