సేద్యానికినవతేజం

  • పత్తి రైతుకు ధర దక్కేలా చర్యలు
  • నకిలీ విత్తనాల కంపెనీలపై ఉక్కుపాదం
  • ఉద్యాన, వాణిజ్య పంటల ద్వారా రైతుకు ఆదాయ భరోసా
  • ఆంధ్రజ్యోతితో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
రైతులకు మద్దతు ధర వచ్చేలా చూడటంతో పాటు వారికి ఆధునికసాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంపొందించే దిశగా పలు చర్యలు చేపడుతున్నాం అంటున్నారు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి.
ఖరీ్‌ఫలో కష్టాలు ఎదుర్కొన్న రైతాంగాన్నిప్రభుత్వం ఎలా ఆదుకుంటున్నది?
 రాష్ట్రంలో ఈ యాసంగిలో 45 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని భావిస్తున్నాం. 25 లక్షల ఎకరాల వరకు బోర్ల కింద సాగు అవుతుంది. సింగూరు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌, ఇతర ప్రాజెక్టుల కింద ఇతర పంటలు సాగవుతాయి. వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగవుతాయని అంచనా. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా వుంచాం. ఇప్పటికే రైతులు శనగ సాగు మొదలెట్టారు. అన్ని పంటలకు కావాల్సిన సమాచారాన్ని వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్నాం.
ఖరీ్‌ఫలో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు.
రబీలో దీన్ని ఎలా అరికట్టనున్నారు?
 రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై ఉక్కుపాదం మోపుతుంది. ఆ విత్తనాలు సరఫరా చేసే యాజమాన్యాలపై చర్యలు చేపడుతున్నాం. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీయాక్ట్‌ పెట్టే విధంగా చట్టాన్ని సవరిస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే బిల్లును తీసుకువస్తున్నాం. విత్తనోత్పత్తితో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అన్ని రకాల చర్యలుతీసుకుంటున్నాం.
 
విస్తరణ విభాగాన్ని పటిష్టం చేయాల్సి వుందంటారా?
వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంటలపై వివరించేందుకు ఐదువేల మందికి ఒక్క ఏఈవో చొప్పున 1,525 మందిని ఇటీవల నియమించాం. వీరి ద్వారా రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. విస్తరణ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసి, ఆధునిక సాగు పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
 
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు ఏవైనా చేపడుతున్నారా?
వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఈ మధ్యనే మహారాష్ట్రకు పంపించాం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పరంపర పురోగతి కృషి వికాస్‌ యోజన పథకాన్ని (పీకేవీవై) అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద రాష్ట్రంలో 390 క్లస్టర్లు తీసుకుని, ఒక్కో క్లస్టర్‌ కింద 50 ఎకరాలు తీసుకున్నాం. ఒక్కో ఎకరం ఒక్కో రైతుకు ఇచ్చి ప్రకృతి సేద్యం చేయిస్తున్నాం. ఇప్పటికే పలు దఫాలుగా రైతులకు శిక్షణ ఇచ్చాం.
రైతులకు ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటలు, కూరగాయల సాగును ఎలా ప్రోత్సహిస్తున్నారు?
 పాలిహౌజ్‌ ద్వారా పూలు, కూరగాయల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు సబ్సిడీపై 1,336 పాలిహౌజ్‌లను రైతులకు మంజూరు చేశాం. జీడిమెట్లలో 10 ఎకరాలలో సెంటర్‌ఫర్‌ కన్వెన్షన్‌ ఏర్పాటుచేశాం. ఈ కేంద్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. మొక్కలను రైతులకు అందిస్తున్నాం. ఉద్యానవన శాఖ ద్వారా పండ్ల తోటలను ప్రోత్సహిస్తున్నాం. కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పూలసాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం.
 
ఈ-నామ్‌ సక్సెస్‌కు ఏం చర్యలు చేపడుతున్నారు?
ప్రస్తుతం 44 మార్కెట్లలో ఈ-నామ్‌ వ్యవస్థను ఏర్పాటుచేశాం. జాతీయ మార్కెట్‌లతో అనుసంధానం కల్పిస్తున్నాం. దీనిద్వారా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూస్తున్నాం. ఇతర మార్కెట్‌లలో అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఏర్పాట్లను చేస్తున్నాం. పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం తరపున చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో 18 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్‌ల నిర్మాణం చేపట్టాం. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు పూర్తి అయితే ధాన్యం ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది. అప్పటి వరకు మరిన్ని గోడౌన్‌ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది. రైతుబంధు పథకం ద్వారా రైతులు ఇప్పటికే గిడ్డంగులలో పంటలను నిలువ చేసుకుంటున్నారు.
పంటల బీమా పథకంలో ఆశించిన సంఖ్యలో రైతులు చేరడం లేదు కదా?
రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే రైతులు అందరికీ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన బీమాపథకం అమలు చేస్తున్నాం. రుణాలు తీసుకోని రైతులను కూడా బీమా చేయాలని కోరుతున్నాం. వారికి వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈ పథకం గ్రామ యూనిట్‌గా ఉంది. దీనిని రైతు యూనిట్‌గా చేయాలని కేంద్రాన్ని కోరాం.
ఈ యేడాది ఖర్చులు కూడా రాని పత్తి రైతులను ఎలా ఆదుకుంటారు?
రాష్ట్రంలో ఈ సంవత్సరం 48 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు. 33 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశాం. ఇప్పటివరకు మార్కెట్‌లకు పత్తి ఐదు శాతం కూడా రాలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలోని మార్కెట్‌లకు ఒకలక్షా 50వేల మెట్రిక్‌ టన్నుల పత్తి మాత్రమే వచ్చింది. ఈ పత్తి కొనుగోలు కోసం సీసీఐ 38 కేంద్రాలను ఏర్పాటుచేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్‌లలో కొనుగోలు చేస్తున్నాం. ఆదిలాబాద్‌ మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర వస్తుంది. మహారాష్ట్ర రైతులు కూడా వచ్చి అమ్మకాలు చేస్తున్నారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *