సేద్యానికి కొత్త ఊపు

  • సాగుకు సాంకేతిక సహకారం
  • ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం
  • విత్తనాల నాణ్యతకే మెగా సీడ్‌ పార్కు
  • భూసార పరీక్షకు కొత్త టెక్నాలజీ
  • ఆంధ్రజ్యోతితో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి
 
ఎరువులు, కిమ్రిసంహారకాలను మితిమీరి వాడటంతో సేద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. మార్కెటింగ్‌పై అవగాహన లేక గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారు. అందుకే వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్య రంగంగా ఎంచుకుని, రైతులకు నికరాదాయం పెంచాలనిముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే స్థిరమైన ఆదాయాన్ని పొందే వీలుంటుందన్నారు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి. 
రాష్ట్రంలో వ్యవసాయ రంగ పురోగతికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు?
వాతావరణ సమాచారాన్ని బట్టి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి, రైతులకు సాయిల్‌ హెల్త్‌కార్డులు ఇస్తున్నాం. పోషక లోపాల మేరకు ఎరువులు వాడాలని చెబుతున్నాం. భూమిలో సూక్ష్మపోషక లోపాలు ఉన్న పొలాల రైతులకు నూరుశాతం రాయితీపై జింక్‌, జిప్సం, బోరాన్‌ అందిస్తున్నాం. క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బందికి ట్యాబులు ఇచ్చి, ఆధునిక పరిజ్ఞానంతో ఈ-క్రాప్‌ బుకింగ్‌ పేరుతో పంటను నమోదు చేస్తు న్నాం. పంట నష్టపోయినా, ప్రభుత్వ సంస్థలకు సరుకు అమ్ముకోవాలన్నా క్రాప్‌ బుకింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఖరీఫ్ లో 66,108 మెట్రిక్‌ టన్నులు, రబీకి 20,633 మెట్రిక్‌ టన్నుల సూక్ష్మపోషకాలు సరఫరా చేశాం. ఖరీఫ్ లో సాధారణంగా 40.47 హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, 36.34 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో 36.28 లక్షల హెక్టార్ల పంటను ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేశాం.
మెగా సీడ్‌ పార్క్‌ లక్ష్యం?
కర్నూలు జిల్లా తంగడంచలో 623.40 ఎకరాల్లో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కుఏర్పాటు చేస్తున్నాం. దీనికి అమెరికాలోని ఐయోవా వర్సిటీ ఎంవోయూపై సాంకేతిక సహకారం అందిస్తోంది. ల్యాబ్‌, ప్రొసెసింగ్‌ యూనిట్‌, పరిపాలన విభాగాన్ని నిర్మిస్తాం. విత్తన పరిశోధనల్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు. సీజన్‌కు ముందే నకిలీ విత్తనాలపై నిఘాపెట్టి, అధికారులు దాడులు చేస్తున్నారు. నకిలీ విత్తన విక్రేతలపై పీడీ యాక్డు పెడతాం. తెగుళ్ల నివారణలో ప్లాంటెక్స్‌ యాప్‌ రైతుకు బాగా ఉపయోగపడుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షల్లో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అమెరికాలోని బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారం తీసుకుంటున్నాం.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సేద్యంలో మన రాష్ట్రం పరిస్థితి?
ఈ-క్రాప్‌ బుకింగ్‌, సాయిల్‌ హెల్త్‌కార్డులు, సూక్ష్మపోషకాల పంపిణీలో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ముం దుంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించేలా చేస్తూ రైతుకు నికరాదాయం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. విశాఖపట్నంలో ఈనెల 15 నుంచి జరిగే వ్యవసాయ సదస్సులో రైతుకు సాంకేతిక సహకారం అందించే అంశాలపై చర్చ జరగనున్నది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్‌ పుడ్‌ ఇండియా సదస్సులో ఏపీకి బ్రాండ్‌ ఇమేజీ తెచ్చాం.
అతివృష్టి, అనావృష్టితో ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఎలా ఆదుకుంటున్నారు?
రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తున్నాం. 2016లో కొన్ని జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.1900 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రూ.450 కోట్లు ఖర్చు చేశాం. ఏపీ మైక్రో ఇరిగేషన్‌ పథకంలో రూ.1,127 కోట్లతో రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలు అందిస్తున్నాం. గత ఏడాది మిర్చి, పసుపు, కంది, మినుములకు ధర లేకపోతే ఎంఐఎస్‌ కింద రూ.170 కోట్లతో రైతులకు సాయం చేశాం. పత్తి రైతును ఆదుకునేందుకు దశలవారీగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం. కనీస మద్దతు ధరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొన్ని మార్కెట్‌ యార్డుల్లో ఈ-నామ్‌ అమలు చేస్తున్నాం.
ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
పాలేకర్‌ విధానాలతో ప్రకృతి సేద్యం చేయడం ద్వారా వ్యవసాయంలో ఖర్చులు తగ్గించవచ్చని, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలిపేలా ప్రయత్నిస్తున్నాం. జీరో బడ్జెట్‌ ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. ప్రకృతి వ్యవసాయ నిర్వహణకు రూ.10 వేల కోట్లతో అజీంప్రేమ్‌జీ ఫిలాంత్రఫిక్‌ వంటి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాం.
రైతులు పంట మార్పిడి పాటిస్తే, నేల ఆరోగ్యం పెరిగి దిగుబడులు పెరుగుతాయి. అందుకే ఉద్యాన రైతులకు అనేక రాయితీలు ఇస్తున్నాం. ఏపీఎంఐపీ ద్వారా సేద్య పరికరాలు ఇస్తున్నాం. ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు తీసుకువెళ్లాలని సీఎం భావిస్తున్నారు. అగ్రి ప్రొసెసింగ్‌ రంగంలో పెట్టుబడుల కోసం ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో జపాన్‌, శ్రీలంక వంటి దేశాలతో చర్చించాం.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *